16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపు



హరికై పలికిన పలుకా యది యందమొలికెడి పలికు
హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపు

హరిపారమ్యము నెఱుగనివాడై నరుడు గడపునది బ్రతుకా
హరిని విడచి యామరుని కొలుచు నే నరుని దైన నొక బ్రతుకా
హరినామము రానట్టి ప్రసంగము లను సలిపెడునది బ్రతుకా
హరి హరి హరి యని యానందముగా ననలేనిది యొక బ్రతుకా
హరికై

పొరిపొరి వాదంబులతో కాలముపుచ్చిన కలదే ఫలము
తరచుగ నితరుల మెప్పుల కొఱకై తడవిన కలదే ఫలము
హరిగుణగానము చేయని నాలుక యాడియు శూన్యము ఫలము
నరుడు శరీరము విడచెడు నప్పుడు నాలుకపస నిష్ఫలము
హరికై

నరులందరకును దారిచూపుటకు పరమాత్ముండగు హరియే
ధరపై నరుడై తద్దయుప్రేమను దశరథసుతుడై వెలిసె
నరులారా శ్రీరామచంద్రుని నామామృతమును గొనరే
పరమభక్తులై యన్యభావనల వదలరె రామా యనరే
హరికై


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.