19, ఆగస్టు 2022, శుక్రవారం

ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు?


 ఈ ధర్మరాజుగారు జూదం ఆడటం ప్రస్తావన వచ్చింది ఒక కష్టేఫలీ బ్లాగుటపా తాలూకు చర్చలో. సరే వచ్చింది. నేనా చర్చలో దూరి (అనవసరంగా అంటారా? కావచ్చును!) ఒక మాట అన్నాను. "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని. ఇది చూసి ఒక వ్యాఖ్యాత గారు "ఇది నాకు తెలియని కొత్తవిషయం. రిఫరెన్స్ ఇవ్వగలరా?" అని అడిగారు.

అలా అడగటాన్ని ఎద్దేవాచేస్తూ మరొకరు "వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే" అన్నారు కాని అది సరైన మాట కాదు.

ఎందుకంటే ఆంధ్రమహాభారతంలో మీకు ఈవిషయానికి సంబంధించిన వివరాలు దొరకవు. అలా ఎందుకో కొంచెం వివరిస్తాను.

సంస్కృతంలో వేదవ్యాసమహర్షి విరచించిన మహాభారతం ముఫ్ఫైలక్షల శ్లోకాల మహాపర్వతం. దానిని మానవమాత్రులు చదవటం మహాదుష్కరం. కాబట్టి మానవలోకంలో కేవలం లక్షశ్లోకపరిమితిగా మహాభారతం ఇవ్వబడింది. కాని కాలక్రమేణా, కలిముదిరి లక్షశ్లోకాల సంగతి అటుంచి సంస్కృతభాషలో ఉన్న ఇతిహాసాన్ని జనసామాన్యం చదవటం అసాధ్యం ఐపోయింది.

కవులు జనభాషల్లోనికి దానిని యధాశక్తిగా తీసుకొని రావటం మొదలైంది. సంస్కృతభారతాన్ని తెలుగులోకన్నా ముందుగా కన్నడంలో అనువాదం చేసారు. ఆచేసినాయన జైనమతస్థుడు. దానితో పాండవులంతా మహాశ్వేత భక్తులైపోయారు. ఇంకా చాలా మార్పులు జరిగి సనాతనధర్మాన్ని ప్రబోధించే మహాభారతం దుర్గతి పాలౌతోందని పెద్దలు వాపోవటం మొదలైంది. అప్పట్లో తెలుగు కన్నడ భాషలింకా పూర్తిగా విడిపోలేదు. మనవాళ్ళు రెండుభాషల్నీ ఆదరించేవారు. దాని వలన తెలుగుదేశంలో భారతాన్ని ఆంధ్రీకరించాలీ అనే ఒక తపన మొదలయ్యింది. నన్నపార్యుడు దానికి పూనుకోవటంతో శ్రీమదాంధ్రమహాభారతం రూపుదిద్దుకోవటం జరిగింది.

ఇది పూర్తికావటానికి బహుకాలం పట్టింది. నన్నయ్య, తిక్కన్న, ఎఱ్ఱన్న అని ముగ్గురు మహాత్ములు శ్రీమదాంధ్రమహాభారతంమనకి అందించారు మొత్తం మీద.

ఈ మహాభారతాంధ్రీకరణం అంటే మూలంలోని లక్షశ్లోకాలనూ ఎలాఉన్నవి అలా తెలుగులోనికి తేలేదు. అక్కడ ఉన్న కధలూ ఉపకథలూ అన్నీ అలాగే తేలేదు. కొంత ప్రణాళికవేసుకొని చేసారు. మనకాలం వారి శక్తికి అనుకూలంగా కొంత క్లుప్తీకరించారు.

గరుత్మంతుడి కథ రెండు చోట్ల వస్తుంది మూలంలో - దాన్ని ఆదిపర్వంలో మాత్రం చెప్పారు. ఇల్లాంటివి చాలానే స్వతంత్రమైన పోకడలు పోయారన్నమాట.

ఇక విషయంలోనికి వద్దాం.

ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసారు. అందరికీ తెలిసిన సంగతే. ఆయాగంలో కృష్ణుడికి అగ్రపూజ చేయటమూ దాన్ని అక్షేపించిన శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించటమూ కూడా అందరికీ తెలిసినదే.

యాగం పూర్తి అయ్యాక దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళారు. చివరగా బయలుదేరినది వేదవ్యాసమహర్షి. ఆయన్ను ఊరిపొలిమేర దాకా పాండవులు సాగనంపారు.

సరిగ్గా ఆసందర్భంలో ధర్మరాజుగారు వేదవ్యాసుల వారిని ఒక ప్రశ్న వేసారు.

ఈ రాజసూయమహాయాగం కారణంగా జనక్షయం అన్నది చెప్పారు కదా. అది ఈ శిశుపాల వధతో తీరిపోయినట్లే కదా అని అడిగారు.

దానికి వేదవ్యాసుడు చెప్పిన జవాబు వినండి. ధర్మరాజా, నీవీ‌ ప్రశ్న అడగకుండా ఉంటేనే బాగుండేదేమో. విను. ఈరాజసూయం తెచ్చే కలహం మాసిపోలేదు శిశుపాలవధతో. అది పదమూడు సంవత్సరాల తరువాత వస్తుంది మహా జనక్షయం జరుగుతుంది. అది నీ నిమిత్తంగా జరుగుతుంది. దానికి దుర్యోధనుడు కారణం అవుతాడు తన అత్యాశతో.

ఈసమాధానంతో ధర్మరాజు గారు హతాశుడయ్యాడు. ఇంటికి పోయి సోదరులతో సమావేశం ఐనాడు. వ్యాసభగవానుడు సెలవిచ్చిన మాటలు చెప్పి దుఃఖపరవశుడయ్యాడు.

హఠాత్తుగా ఒక నిర్ణయం ప్రకటించాడు. కలహానికి దుర్యోధనుడి దుర్బుధ్ది కారణం ఐనా అది నా నిమిత్తంగా వచ్చే‌ ప్రళయం ఐనప్పుడు దానిని శాయశక్తులా నివారించాలి. ఇకమీద దుర్యోధనాదులు ఏమి కోరినా కాదనను. అలా చేస్తే కలహానికి కారణమే ఉండదు కదా. అదే కర్తవ్యం నాకు అని.

దుర్యోధనుడు పాండవశ్రీని ఓర్వలేక తానూ రాజసూయం చేయాలని తలపోసాడు. కాని అది కుదరదు. చక్రవర్తి కాని వాడు చేయరాదనీ  అసలు దుర్యోధనుడు మూర్ధాభిషిక్తుడైన రాజే కాదు కనక కుదరదనీ పురోహితులు తేల్చి చెప్పారు. ఐతే ప్రత్యామ్నాయంగా వైష్ణవం అనే దొడ్డయాగం చేయవచ్చుననీ చెప్పారు.

సరే అని ఆ వైష్ణవయాగం చేసాడు దుర్యోధనుడు. గొప్ప సభాభవనం కూడా కట్టించాడు. పాండవులను ఆహ్వానించాడు. అపైన జరిగినది తెలిసినదే.

ఆవిషయంలో కొంచెంగా చెప్పుకోవాలి ఐనా సరే. పాండవులను సరదాజూదం పేరుతో సర్వవిధాలా అవమానించిన తరువాత ద్రౌపదీదేవి శపిస్తే పుట్టగతులుండవని ధృతరాష్ట్రుడు ఆవిడకు వరాలిస్తాడు. 

అంతేకాక తనంత తానుగా ఆవిడ ధర్మపరాయణత్వానికి ముగ్ధుడై మరొక వరం ఇస్తాడు. ఈ జూదం ముందు ఉన్న స్థితిని పునరుధ్ధరించుతున్నానని ప్రకటించాడు.

కడుపుమండి, దుర్యోధనుడు మళ్ళా జూదం నడిపించి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు.

అదీ సంగతి.

ఈ కథాక్రమంలో నన్నయ్య గారు తెలుగు చేయకుండా వదిలిన ఘట్టాల్లో ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా విరోధాన్ని నివారించటానికి పెట్టుకున్న ఒట్టు విషయం ఒకటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఐనది. ధర్మరాజు అలా ఒట్టు పెట్టుకోక పోతే జూదానికి ఒప్పుకోవలసిన అగత్యం ఉండేది కాదు. కలహ నివారణకోసం పెట్టుకున్న ఒట్టే కలహానికి బీజం వేసింది!

6 కామెంట్‌లు:

  1. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఈ సందేహం తీర్చండి. అన్నింటికీ 'ఇంక ధుర్యోధనాదులు ఏమడిగినా కాదనను' అన్న పెద్ద మనిషి పదమూడేళ్ళ తర్వాత యుద్ధానికి ఎందుకు సిద్ధపడ్డాడు? సూదిమొన అంత భూమి కూడా ఇవ్వను అని చెప్పి, సంజయ రాయబారం చేత పరోక్షంగా చెప్పించాడు కదా? తాను చేసిన ప్రతిజ్ఞ అప్పుడు గుర్తురాలేదా? లేకపోతే వ్యాసులవారు చెప్పినది మర్చిపోయేడా? సరే జనం చావకూడదు కదా అందుకే మీరు చెప్పినట్టూ ఒట్టుపెట్టుకున్న పెద్ద మనిషి సంజయుడు చెప్పినట్టూ భిక్షం ఎత్తి ఎందుకు జీవించలేదు? ఒరే అబ్బాయిలూ నేనిలా ఒట్టుపెట్టుకున్నా యుద్ధం వద్దే వద్దు అనలేదేం?

    కర్మ అనేది జరిగితీరుతుంది. లేకపోతే ధర్మరాజంతటివాడు కళ్ళు మూసుకుని తమ్ములనీ పెళ్ళాన్నీ కూడా జూదంలో ఎలా పెట్టాడు? ఏదో వెధవ పనిచేసే మనకి కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటిది జీవితంలో. అరే నేనెందుకు అలా చేసాను అనిపించడం సర్వ సాధారణం. భారతంలో మొదటి సారి అన్నీ పోయిన ధర్మరాజు రెండోసారి జూదానికి పిలిస్తే ఎందుకు వెళ్ళాడు? వెళ్ళాడు సరే ధుర్యోధనుడి సంగతి తెలియదా? ఓడిపోతానని తెలియదా? ఇదీ పందెం అనగానే అబ్బే రాజ్యం ప్రజలది నేను దాన్ని పందెం కాయలేను అని ఎందుకు చెప్పలేకపోయేడు? దీనికన్నా మిగతా విషయాలున్నాయి. సారపు ధర్మమున్ అంటూ ఎలుగెత్తి చెప్పాడు కృష్ణుడు సభలో. అయినా పరశురాముణ్ణే ఎదురించగల్గిన భీష్ముడూ, గురువైన ద్రోణుడూ కూడా మేము ఈ యుద్ధం చెయ్యం దిక్కున్న చోట చెప్పుకోండి అని మనవడితో ఎందుకు అనలేదు? బలరాముడు రుక్మీ అనగా లేనిది వీళ్లకేమొచ్చింది? కర్మ నెత్తి మీద తంతూ ఉంటే బుద్ధి అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. నిజంగానే మేమింత గొప్పవాళ్లం, మాకింత విలువిద్య ఉంది అనే అహంకారం పోలేదు కాబోలు మనసులోంచి. అవతల పాండవుల వైపు సాక్షాత్తూ భగవంతుడు లీలామానుష రూపంలో ఉన్నాడని తెల్సినా. అశ్వథ్థామ వేసిన నారాయణాస్త్రం, భగదత్తుడు అర్జునుడిమీద వేసిన శక్తీ - విశ్వాలనన్నింటినీ పుట్టించి ప్రభవించి లయం చేసే భగవంతుడి ముందా? జ్ఞానాన్ని అహంకారం కమ్మితే అలాగే జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  2. "పదమూడేళ్ళ తర్వాత యుద్ధానికి ఎందుకు సిద్ధపడ్డాడు?" అని అడుగుతున్నారు. ఆయన ఒట్టువేసుకొన్నది కలహాన్ని సాధ్యమైనంత వరకూ నివారించటానికి. కలహం రానే వచ్చింది. ఇక యుధ్ధానికి వెనుదీయవలసిన అగత్యం ఏముందీ? అక్కడికీ ఆయన ఏదో విధంగా సంధి చేసుకోవాలీ జనహననాన్ని నివారించాలీ అని ప్రయత్నించినా అది దుర్యోధనుడు కుదరనీయలేదు.

    పునర్ద్యూతాన్ని నిరాకరించటానికి ధర్మరాజు ఏమి చేయగలడు? ఆడనని చెప్పటం ఇంక కుదరదు కదా. పిరికితనం అనుకుంటుంది లోకం. ఏకారణం చెప్పి ద్యూతం తప్పు అని అన్నా అది ఓటమి భయం తోనే అంటారు కదా.

    రాజుకు ప్రజ శరీరము అని భారతంలో ఒకచోట సూక్తి ఉన్నమాట నిజమే కాని, రాజ్యం ప్రజలది నేను దాన్ని పందెం కాయలేను అని రాజులు అనరండీ. నలుడు కూడా రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోలేదా పూర్వం. ఐతే పుష్కరుడు దమయంతిని పందెం కాయమనే సరికి చీ అని లేచిపోయాడు. పుష్కరుడు కూడా నలుణ్ణి అడవులకు తరిమేశాడు.

    బలరాముడు స్వతంత్రుడు - ఆయన ఇష్టపడలేదు - భీమార్జునులు ఇద్దరూ తన శిష్యులే - ఇరువర్గాల వాళ్ళూ తనకు బంధువులే. వద్దన్నా యుధ్ధం చేస్తున్నారు. తనకు మనస్కరించక తీర్ధయాత్రలకు వెళ్ళిపోయాడు.

    రుక్మి పాపం ఇరుపక్షాల వాళ్ళకూ సహాయం చేస్తానని వెళ్ళాడు కాని ఎవరూ రావయ్యా రా అని ఆహ్వానించలేదు.

    భీష్మద్రోణులు హస్తినవారి ఉప్పుతింటున్నారు. కాబట్టి వారి తరపున యుధ్ధం చేయవలసి వచ్చింది. విడచిపెట్టి పోతే పక్షపాతం అంటారు జనం. పాండవపక్షం పట్ల ప్రీతి ఉన్నా అకీర్తికరమైన ఆపని చేయలేరు పాపం.

    మీకు వీలైతే వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వ్రాసిన మహాభారత తత్త్వకథనము అన్న గ్రంథం చదవండి. archive.org సైటులో ఉచితంగా download చేసుకోవచ్చును.

    రిప్లయితొలగించండి
  3. శర్మ గురువుగారి బ్లాగ్ లో జరిగిన ధాంధూమ్లకు "వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే" అన్న అనామకం వ్యాఖ్య సరియే అనిపిస్తోందండి గురువుగారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కావచ్చునండీ. అనవసరమైన చర్చ అదంతా. ఏం చేస్తాం. ఒక్కోసారి అటువంటి పరిస్థితులు వస్తాయి. అసమంజసులు ఎవరైనా ఒకవేళ సరైన ప్రశ్ననే వేసినా, వారికి జవాబు చెప్పటం ద్వారా అడుసుత్రొక్కటం అవుతుందని తెలుసుకొని - అటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత వహించటమే పరిష్కారం అనిపిస్తోంది.

      తొలగించండి
    2. అటువంటి పొరపాటు చేయకుండా -
      meerila anadam idi enno sarantaru saru?

      తొలగించండి
    3. స్వభావో దురతిక్రమః అంటాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.