శ్రీమద్దశరధనందన రామా చిత్తశుధ్ధితో కొలిచెదను
నీమము గలిగి నీశుభనామము నేమర కేను భజించెదను
శ్రధ్ధాభక్తులతో నీచరితము చక్కగ నిత్యము చదివెదను
బుధ్ధిమంతులగు నీభక్తులతో పొందుగలిగి వర్తించెదను
మానక నెప్పుడు నీపూజలను మనసా చేయుచు నుండెదను
ధ్యానములో నీశుభరూపంబును లోనారయుచు నుండెదను
నీవే తల్లివి నీవే తండ్రివి నీవే పతివని తలచెదను
నీవే గురుడవు నీవేదైవము నీవేగతి యని తలచెదను
కౌసల్యాసుఖవర్ధన నిన్నే కావుమనుచు నే వేడెదను
నీసరి లేరని త్రిభువనములలో నిన్నే శరణము వేడెదను నీవే కరుణాసాగరుండవని నీకటాక్షమును కోరెదను
నీవే పురుషోత్తముడవు గావున నిన్నే శరణము వేడెదను
నీవే సృష్టిస్థితిలయములను నియమింతువని నమ్మెదను
నీవే భవనాశకుడవు గావున నిన్నే శరణము వేడెదను
నీవే మోక్షప్రదాతవు గావున నీపదయుగళము లంటెదను
నీవే సర్వేశ్వరుడవు గావున నిన్నే శరణము వేడెదను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.