28, ఆగస్టు 2022, ఆదివారం

వాదవివాదాల గురించి...


చ. వినయము లేని వారు నవివేకులు మూర్ఖులు దుష్టబుధ్ధులుం
బనిగొని యేమి పల్కిన నవశ్యము ధీరులు శాంతచిత్తులై 
వినని ప్రకారమే జనుట వేయివిధంబుల మేలు వారితో 
ననయము వ్యర్ధవాదముల నక్కట చిక్కుట కంటె చూడగన్

ఇది నా పద్యమే. ఇప్పుడే వ్రాసినదే. అదటుంచి యీ పద్యం వెనుక ఉన్న సంగతిసందర్భాలను గురించే యీ వ్యాసం.

నిన్న నా యీ బ్లాగు శ్యామలీయానికి రమారమి నాలుగువందల వీక్షణలు వచ్చాయి. అంటే జనం చదువుతున్నారు అని అర్ధం అవుతోంది.

ఈరోజున తెలుగు బ్లాగుల్లో కనిపిస్తున్న వారి సంఖ్య బహుస్వల్పంగా ఉంది. ఐనా శ్యామలీయం బ్లాగుకు తగినంత ఆదరణ ఉండటం ఆనందించవలసిన విషయమే‌ నాకు.

నాకున్న వ్యక్తిగతమైన పరిమితుల కారణంగా శ్యామలీయం బ్లాగులో అంత చురుకుగా ఉండటం కుదరటం లేదు నాకు. ఐనా నేను ఏమీ వ్రాయని రోజుల్లో‌ కూడా రెండువందల చిల్లర వీక్షణలు వస్తూనే ఉన్నాయి. 

బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం నేను ఎప్పుడో తగ్గించివేసాను. తగిన సందర్బం ఉన్నా నాకు వీలవక వ్యాఖ్యలు ఉంచలేదు చాలా సార్లు.

ఈమధ్యన కష్టేఫలీ‌ బ్లాగులో నేను చేసిన ఒక వ్యాఖ్యబోలెడంత చర్చకు దారితీసింది!
 
అచర్చ నిజానికి ఒక ఆరోగ్యకరమైన చర్చలా కాక ఒక రగడలా నడిచింది. అ రగడకు ప్రధాన సూత్రధారి Chiru Dreams అనే ఆయన అని నా ఉద్దేశం. ఆయన "పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు" అన్న అభిప్రాయం చెప్పటమూ దానికి సమాధానంగా  నేను "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని నావ్యాఖ్యలో చెప్పటం జరిగింది. 
 
చిరు గారు రిఫరెన్స్ కావాలన్నారు. మంచి కోరికే. ఐతే విపులంగా చెప్పటానికి ఒక వ్యాసం వ్రాసి ఈశ్యామలీయంలో ఆ "ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు" అన్న వ్యాసాన్ని ప్రచురించాను. 

నిజానికి చర్చ ఇక్కడితో‌ ముగిసిపోవాలి. 

కాని "మీరుచెప్పిన విషయం మహాభారతంలో ఎక్కడ వ్రాయబడి వున్నదనే" ప్రశ్న చిరు గారి నుండి వచ్చింది అంటే ఆయనకు మహాభారతం గురించిన కనీస అవగాహన లేదనే అనుకోక తప్పదు. కాని ఆయన మొదటనే "పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు" అన్న మాట ఎలా అనగలిగారూ? పొరపాటు మాట కదా?
 
అక్కడికీ ఓపిగ్గా ఇదంతా సభాపర్వంలోనికి వస్తుంది అని చెబితే ఒక అనామకుడి వ్యాఖ్య చూడండి "ఏ లైనో ఎన్నో పేజీయో చెబ్తే ఏమన్నా సొమ్ములు పోతాయా ? అంతా పండితుల పైత్యం కాదా యిది?" అని!

దీనికి ఏమనాలి? ఈధోరణి చూస్తే చర్చ కన్నా రగడకే కొందరు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. కనీసం నాకలా అనిపిస్తోంది.

అక్కడికీ నేను ఆ కొనసాగుతున్న రగడలో "వ్యాసులవారి మహాభారతం తెలుగులిపిలో గీతాప్రెస్ వారి వద్ద లభిస్తుంది" అనీ "అందరికీ కవిత్రయాన్ని చదువమని నాసూచన. ఆతరువాత వీలైతే విశేషాంశాలను మూలం నుండి గ్రహించండి. లేదా తెలిసిన వారి నుండి గ్రహించండి. మేము ఏమీ చదువుకోము. కాని ప్రశ్నలు వేస్తాము. అన్నిటినీ వినికిడి కథల (సినీమాలూ నాటకాలూ బుర్రకథలూ బాలల బొమ్మల పుస్తకాలూ టీవీ సీరియళ్ళూ వగైరా) మాధ్యమాల ఆధారంగా చర్చలు చేస్తాం అంటే ఎలాగు? " అనీ అన్నాను. అసలు ఇంక ఏమీ మాట్లాడకుండా ఉండవలసింది! కాని ఉబోస ఇచ్చినందుకు చిరు గారు చేసిన పరాభవం చూడండి

"బాబూ శ్యామలీయం! నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఏమీ చదవడు అనే కుతినుబంచి బయటకురా ముందు. సమాధానం చెప్పలేక దాటేసేవేశాలు నీదగ్గర, నీలాంటోల్ల దగ్గర చాలా చూశాం. "

ఇదే మన్నా బాగుందా? ముఖ్యంగా ఏకవచనంలోని దిగి ఏమిటా మాటలు అని?

కొంచెం నచ్చజెప్పటానికి యత్నించి, మరింత భంగపడి, "నేను మాత్రం దేవిడీమన్నా చేస్తున్నాను" అని ప్రకటించాను.

ఐనా చిరు గారు ఇకనుండి శ్యామలీయం లోనికి వద్దన్నా వ్యాఖ్యలను పంపటం మొదలు పెట్టారు. ఆయనకు దేవిడీమన్నా అంటే తెలియలేదేమో. దానికి నేనేమీ చేయలేను. నేను మాత్రం చిరు గారు వ్యాఖ్యలను ప్రకటించటం లేదు. ఆయనకు ఊరకే వాదిస్తూ కూర్చోవటం ఒక హాబీ కావచ్చును కాని నాకు తీరదే.

నా భాగులోనే దరిమిలా ఒక వ్యాఖ్యలో  "అసమంజసులు ఎవరైనా ఒకవేళ సరైన ప్రశ్ననే వేసినా, వారికి జవాబు చెప్పటం ద్వారా అడుసుత్రొక్కటం అవుతుందని తెలుసుకొని - అటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత వహించటమే పరిష్కారం అనిపిస్తోంది." అని చెప్పాను.

ఇక హరిబాబు గారు రంగప్రవేశం చేసారు. అయనకు నేను ఇతిహాసాలు రెండే కదా అనటం నచ్చలేదు. ఆపైన నేను వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గ్రంథం మహాబారతతత్వకథనము archive.org సైటులో లభిస్తుంది అని చెప్పటం నచ్చలేదు. ఆపుస్తకానికి లింకు ఇవ్వచచ్చు కదా అని చెడామడా వాయించారు. అయనకు నేను బాధ్యతారహితంగా మాట్లాడుతున్నానని అనిపించింది పైగా. చదువరులే ఈవిషయంలో ఆలోచించి గ్రహించ ప్రార్థన. ఐనాఓపిగ్గా మరొక వ్యాసం వ్రాసి ఈ archive.org సైటులో పుస్తకాన్ని ఎలా సంపాదించాలీ అని చెప్పాను. ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడికి ఇదంతా నిజంగా చెప్పవలసిన అవసరం ఉందా చెప్పండి?

ఇక చిరు గారు వ్యాఖ్యలను శ్యామలీయానికి వద్దన్నా పంపుతున్నారు కదా. ఒక వ్యాఖ్యలో ఆయన "రెండవజూదంలో కూడా పాండవులు తమరాజ్యాలుకోల్పోయారు. తర్వాతనే అరణ్య,అజ్ఞాతవాసాలపాలయ్యారు" అని అభిప్రాయపడి తదనుగుణంగా తీర్పు చెప్పారు. కాని అనుద్యూతంలో రాజ్యాలను పందెంగా ఒడ్డటం జరుగలేదు. కనీసం ఆంధ్రమహాభారతంలో చూసినా ఈసంగతి తెలుస్తుంది, కాని చదవరే! వ్యాఖ్యలు మాత్రం బుధ్ధికుశలతతో చేసేస్తారు. 
 
మరొక వ్యాఖ్యలో చిరు గారు "మంచిగా వ్యాఖ్యచేస్తే, దాన్ని ప్రచురించకుండా మిమ్మల్ని తిట్టాను అని రాసుకున్న మీరు భాధ్యతారాహిత్యాల గురించి మాట్లాడడం కామెడీ" అన్నారు. ఆయన రెండవజూదంలో కూడా పాండవులు తమ రాజ్యాలు కోల్పోయారు అని అభిప్రాయపడటం పొరపాటు అని నేను జవాబు చెప్పటం అడుసు త్రొక్కటమే అని చదువరులకు వేరే చెప్పాలా? మేమేమీ చదువం వినం తెలుసుకోం చర్చలు మాత్రం నిరంతరాయం చేస్తాం అనే వారికి జవాబు చెప్పినా ఉపయోగం ఉండదు కదా. అదీ కాక నేను చిరు గారికి దేవిడీమన్నా చెప్పాను కాబట్టి ఆయనకు జవాబులు చెప్పను. కుదరదు.
 
చిరు గారయ్యేది మరెవ రయ్యేది మంచి విషయం లేవనెత్తి నప్పుడు నాకు వీలైనంత వరకూ నాబ్లాగులో నేను దాని గురించి వ్రాస్తాను. అందుకే ధర్మరాజు జూదం గురించి వ్రాస్తున్నాను. అదీ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గ్రంథం ఆధారంగా. వీలైన చోట తెలుగుభారతం నుండి కూడా చూపుతున్నాను.

ఇప్పుడు పాఠకులకు విజ్ఞప్తి. ఈవ్యాసం మొదట చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకొనవలసింది.

3 కామెంట్‌లు:

 1. బ్లాగు మనదైతే, చదివేవాడు మనోడితే ఎంతసుఖమోకదా! అవతలివాడు అనని వ్యాఖ్యని అనేశాడు అనేసి రాసుకోని శునకానందపడిపోవచ్చు. వృధ్ధజంబూకం అనే పదం గుర్తొస్తోంది. ఇప్పుడుకూడా.. ఈవ్యాఖ్య(ప్రచురించకుండా)లో మీగ్గావలిసినముక్కనిమాత్రం జనాలకి చెప్పి అలా తుత్తిపడిపోదాం. మనికి సిగ్గా?.. ఎగ్గా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాఠకులారా,
   ఈ చిరుగారి వ్యాఖ్యలను నేను ప్రచురించేది లేదు కాని, ఆయనకు దేవిడీమన్నా చెప్పినా పుంఖానుపుంఖాలుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన నైజం మీఅందరికీ వెల్లడి కావలసి ఉందన్న దృష్టిలో one off క్రింద ఆయన పంపిన ఈ తాజా వ్యాఖ్యను ప్రచురించాను. ఆయన నిందాలాపాలనూ నీచసంబోధనలనూ గమనించగలరు.

   ఇకపై ఈచిరు గారి వ్యాఖ్యలను ప్రచురించకపోవటమే కాదు కనీసం చదవకుండానే తొలగించుతాను.

   అయ్యా చిరు గారూ,
   "వినయము లేని వారు నవివేకులు మూర్ఖులు దుష్టబుధ్ధులు" అంటూ ఈటపా ఎత్తుగడలో వ్రాసిన పద్యం సార్ధకం అని నిరూపించేలా ఉంది మీ వ్యాఖ్య. మీకు దేవిడీమన్నా అంటే తెలియదో తెలియనట్లు నటిస్తున్నారో కాని ఆపదానికి అర్ధం "మీకు ప్రవేశం నిషేధించటమైనది" అని. తెలిసింది కదా. ఇంక మీరు వ్యాఖ్యలను పంపకండి. ఒకవేళ మీరు పంపినా అవి బుట్టదాఖలు అవుతాయని గమనించండి

   తొలగించండి
 2. ఇంత చెప్పినా చిరు గారు "నిషేధాలువిదిస్తున్నారా మీపూర్వీకు(క్క)ల్లాగా" అంటూ నిందాలాపాలతో ఒక వ్యాఖ్యనూ మరలా అజ్ఞాతగా "ఆపాత కామెంట్లు ప్రచురిస్తేకదా ఇద్దరి అస్సలురంగు బయటపడేది." అంటూ మరొక వ్యాఖ్యనూ పంపారు. ఒకవేళ నేను ఈ ట్రాప్ లోపల పడి జవాబులను చెప్పటం మొదలు పెడీతే అది అనంతంగా కొనసాగుతుంది కాని తెగేది కాదు కదా. అదీ కాక ఆయన తీరూ భాషా చూస్తున్నారు కదా అటువంటి ఆతతాయిలకు కూడా జవాబులను ఇవ్వటం అవసరమా? పోనీయండి. ఇకపై ఆయన ప్రసక్తి వదిలేద్దాం.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.