22, ఆగస్టు 2022, సోమవారం

ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు - 2.


ఈ విషయం గురించి మొన్న వ్రాసిన  వ్యాసంలో తగిన విధంగ వివరణ ఇచ్చినప్పటికీ ఒకరి నోటి దురుసుకు గురికావలసి వచ్చింది. ఆవిషయంలో చింత లేదు. మంధరా పాపదర్శినీ అని వాల్మీకి మహర్షి సెలవిచ్చినట్లుగా కొందరు కేవలం దోషాన్వేషణాతత్పరు లుంటారు. వారికి మీరు ఎదురు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక మాటపడటం తప్పదు. కాబట్టి ప్రాజ్ఞతవహించి నిబ్బరంగా ఉండటం మంచిది.

నేను అన్న "దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం" అన్న మాట వలన రగడ కేవలం అనవసరమైనది. సరే, ఎవరికైనా ఉపయుక్తంగా ఉండే సమాచారం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ధర్మరాజు జూదం ఎందుకు ఆడినట్లు అన్న వ్యాసాన్ని వెలువరించాను. ఐనా నోటిదురుసు వారు ఏదో ఒక విధంగా విరుచుకు పడటం మానలేదనుకోండి.

నా మాటలకు ఋజువు భారతం సభాపర్వంలో ఉంటుందనీ. వ్యాసమహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ఈవిషయం గురించి ప్రస్తావించలేదనీ చెప్పాను. ఐతే ఇందులో ఆంధ్రీకరణం చేసిన కవిత్రయం దోషం ఏమీ ఎన్ననవసరం లేదు. లక్షశ్లోకాల మహాభారతాన్ని తెలుగు చేసేటప్పుడు అది తెలుగులో మరింత పెద్ద గ్రంథం అవుతుంది. అంత విస్తృతమైన పరిథిలో తెలుగుసేత అభిలషణియం కాదన్న ఉద్దేశంతో‌ అంధ్రీకరణంలో కొన్నికొన్ని చోట్ల సంక్షిప్తం చేయటం తప్పనిసరి ఐనది. ఈవిషయం గురించి కూడా ముందటి వ్యాసంలో ప్రస్తావించాను.

ఇప్పుడు పాఠకులకు మరింత సౌలభ్యం కోసం బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహాభారతతత్త్వకథనము అనే‌ గ్రంథం నుండి ప్రమాణాలు చూపుతున్నాను. ఈ గ్రంథం పెద్దది. ఆరు సంపుటాలుగా ఉంది. ప్రస్తుతం చూపుతున్న పేజీలు నాలుగవది ఐన పాండవనిందానిరాకరణము అన్న భాగం లోనివి.


 

ఈపైన చూపినది గ్రంథ సంపుటం లోని మొదటి పేజీ. ఇందులో గ్రంథం గురించిన ముఖ్యవివరా లున్నాయి. ఇక మనకు కావలసిన సమాచారం ఉన్న పేజీలు రెండింటిని చూపుతున్నాను.


ఇక్కడ శాస్త్రి గారు సంస్కృతంలో ఉన్న మూల గ్రంథం వ్యాసుల వారి మహాభారతం నుండి శ్లోకాలను ఉటంకించి వివరించారు. గమనించగలరు.

ఈవిధంగా ఋజువు చూపినా సంతుష్టిపొందని వారుంటారా అంటే తప్పక ఉండవచ్చును. భర్తృహరి సుభాషితం ఉంది కదా!

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు 
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు 
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు 
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
 
అందుచేత తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళనే వారు తప్పకుండా ఉంటారు. ముందే అనుకున్నట్లు అటువంటి వారి విషయంలో చింత అనవసరం. అటువంటి వారికి ఒక నమస్కారం పెట్టి వాదనకు పోకుండా ఊరుకుందాం. ఇదంతా వారికోసం కానే కాదు. ఈఋజువులు విషయగ్రహణపారీణులైన పాఠకుల కోసం.