29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

లోకము శోకము నీకేలాలోకసంసర్గమే శోకసంసర్గము
లోకము శోకము నీకేలా వినుము

పదివేలమారులు పరువిడి యటునిటు
వదలించుకొన లేక వ్యామోహము
హృదిని విషయవిష మది నించెదవు
తుదిని శోకంబున దోయిలింతువు

నీ సత్యమగు స్థితి నీవెఱుగగ లేక
మోసపోదువు దేహమోహమున
వేసరి తుదకెల్ల విషయము లూడ్చి
చేసిన పనుల నెంచి చింతించెదవు

తనకర్మంబే తనదైవంబని
మనసున నెఱిగక మసలెదవు
వినుమే కామితమును లేకుండిన
కనుగొన నొక శోక మనునది లేదు


2 కామెంట్‌లు:

 1. >> కామితమును లేకుండిన శోక మనునది లేదు

  ఎవరెంత చెప్పినా మరి కుక్కతోక మనసు ఎలా మారుతుందంటారు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అహమిక ఉన్నంతవరకూ కామితం అనేది ఉంటుందండి. అది అణగాలంటే భగవంతునకు శరణాగతుడు కావటమే దారి. కామితం ఉన్నంతవరకూ లోకసంసర్గమూ తప్పదూ శోకసంసర్గమూ తప్పదు.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.