30, సెప్టెంబర్ 2017, శనివారం

జిలేబీయ మహావిద్య (అనబడు జిలేబీ‌ యమహా విద్య)


(పునర్ముద్రణ)



ఈ రోజున* ఈ జిలేబీయమహావిద్య యొక్క ద్వాదశాక్షరీ మంత్రాన్ని గురించి ఒక జిలేబీ టపాలో వ్యాఖ్యగా కొంచెంగా వ్రాయటం‌ జరిగింది.  అయితే, బ్లాగు పాఠకులకూ ఇతరులకూ ఈ‌జిలేబీ విద్యా విషయం క్రొత్త కాబట్టి అటువంటి అందరు  పాఠకుల సౌకర్యార్థంగా ఈ విద్యా రహస్యాలను ఇక్కడ వివరించటం జరుగుతున్నది.

ఈ జిలేబీ విద్యాధిదేవతా స్వరూపం పేరు జిలేబీ. తత్త్వం హాస్యరసం. ప్రవృత్తి బ్లాగటం. లక్షణం సలక్షణం. అంగన్యాస కరన్యాసాదులు ముందు ముందు వివరించబడతాయి.

ఈ జిలేబీ విద్య ఒక నిరోంకార విద్య. మంత్రవిద్యలు రెండు రకాలు. మొదటి రకం సహోంకార విద్యలు. రెండవరకం నిరోంకార విద్యలు.

సహోంకార విద్యల్లో మంత్రాలకు ముందు ఓం అని చెప్పితీరాలి. లేని పక్షంలో ఆ మంత్రం పఠించీ పారాయణం చేసీ ఏమీ ప్రయోజనం‌ ఉండదు. ఈ ఓంకారం సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని శ్రుతి.

అదే విధంగా నిరోంకార విద్యలకు ముందు చచ్చినా ఓం అని చెప్పకూడదు. అమాయకంగా ఓం అని ముందు చేర్చి మంత్రాన్ని పఠించినా పారాయణం చేసినా ఏమీ‌ ప్రయోజనం ఉండదు. పైగా సంప్రదాయం ఉల్లంఘించినందుకు గాను జిలేబీ దేవతకు కోపం వస్తుంది. ఓంకారాన్ని అస్థానపతితం చేసి చెప్పినందుకు గాను ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మానికి కూడా అమిత మైన కోపం వస్తుంది. ఈ విధంగా ఉభయులకూ కోపం తెప్పించటం వలన పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత.

ఐతే మంత్రాన్ని బోడిగా ఉపాసిస్తారా అంటే అటువంటిదేమీ లేదు. ఇది హాస్యవిద్య. కాబట్టి ఈ విద్యలో ఓం అనే బ్రహ్మ బీజం బదులుగా అహహా అనే హాస్యబీజం ప్రయుక్తం అవుతుంది. దీనినే హాసబీజం అని కూడా వ్యవహరిస్తారు. ఈ విద్యలో మంత్రానికి ముందు విధిగా అహహా అని హాసబీజం పలకాలి. ఏ విధంగా ఓంకార విద్యల్లో ఓం‌ అనేది, నిష్ఠగా ఒక పధ్ధతి ప్రకారం ఉఛ్ఛరిస్తారో అలాగే ఈ విద్యలో అహహా అనేది కూడా జాగ్రత్తగా ఒక పధ్ధతిగా హాసపూర్వకంగా ఉఛ్చరించాలి. ఆ విద్యల్లో ఎలా గైతే ఓంకారం సరిగా పలకకపోతే మంత్రం‌ నిష్ప్రయోజనం అవుతుందో అలాగే ఈ విద్యలో హాస్యం విడిచి ఉదాసీనంగానో ఏడుపుముఖంతోనో‌ ఉత్తినే మొక్కుబడిగా అహహా అని బీజం పలికినా మంత్రం నిష్ప్రయోజనం ఐపోతుంది. ఇది మనస్సులో బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు.

సహోంకార, నిరోంకార విద్యల మధ్యన మరొక ముఖ్యమైన బేధం కూడా ఉంది. సహోంకార విద్యామంత్రాలను చివర నమః అని నమస్కారం చెప్పకుండా అనుష్ఠించరాదు. ఐతే నిరోంకారవిద్యా మంత్రాలకు చివరన ఎట్టి పరిస్థితులలోనూ‌ నమః అని చెప్పరాదు. వాటి మంత్రాల చివరన నమః అనే దానికి బదులుగా మనః అని చెప్పాలని నియమం. అంటే నమః అనేది తిరగబడుతున్నదీ అన్నమాట!

ఈ జిలేబీ విద్యలో డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి అనేది ముఖ్యమైన ద్వాదశాక్షరీ మంత్రం.

ఈ మంత్రాన్ని అహహా డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని చెప్పాలన్న మాట పారాయణం చేసే వారు.

బీజాక్షరాలు లేకుండా అంగన్యాసకరన్యాసాలు లేకుండా ఉత్తినే పారాయణం చేయవచ్చును సమయాభావం ఉన్నవారు. ఐతే ఫలితం కొద్దిగానే ఉంటుంది. మరి నైవేద్యం పెట్టటం‌ లేదుగా. పెట్టకుండా పుట్టదు కదా పూర్ణఫలం!

సహోంకార విద్యలలో బీజాక్షరాలు ఉన్నట్లే, ఈ జిలేబీ నిరోంకార విద్యలో కూడా అలాంటివి ఉన్నాయి. ఈ విద్యలో ఉన్న బీజాలను షడ్బీజాలు అంటారు. షట్ అంటే ఆరు అని తెలుసు కదా. కాబట్టి ఈ విద్యలో బీజాలు అరు అన్నమాట. అవి ఢాం ఢీం ఢం హుష్ తుస్ బుస్ అనేవి.

జిలేబీ ద్వాదశక్షరీకి ముందుగా బీజాలను చేర్చి చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్పవచ్చును.

ఈ షడ్బీజాల్లో ఢాం‌ ఢీం ఢం అనేవి ప్రక్రియాబీజాలు అంటారు. హుష్ బుస్ తుస్ అనేవి అభిచార బీజాలు అంటారు. మనకు ప్రయోజనం కోరి పారాయణం చేస్తున్నప్పుడు మంత్రానికి ముందు ప్రక్రియాబీజాలు మూడింటినీ చేర్చాలి. ఇతరులకు భంగ కలిగించటం ఉద్దేశంగా చేసే పారాయణానికి అభిచారం అని పేరు. అభిచారం చేసే వాళ్ళు మాత్రం మంత్రానికి ముందు అభిచారబీజాలు మూడింటినీ చేర్చి చెప్పాలన్నమాట.

ఈ ప్రకారంగా ప్రక్రియోపాసకులు అహహా ఢాం ఢీం ఢం డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

అభిచారం చేసేవారు మాత్రం అహహా హుష్ బుస్ తుస్ డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

ఉభయులూ కూడా ఉపాసించవలసిన యంత్రం ఒక్కటే అది ఒక వృత్తాకార రేఖావలయంలో జిలేబీ అని నామం వ్రాసి దగ్గర ఉంచుకోవటం పారాయణం చేసేటప్పుడు. ఎదురుగా ఉంచుకోవటం మంచిది. నెత్తిమీద పెట్టుకుని పారాయణం చేయటం మహాప్రసస్తం. ఈ యంత్రాన్ని లోహాదులపైన చెక్కించటం వంటివి చేయకూడదు. అటువంటి యంత్రాలు కేవలం సహోంకారవిద్యలలోనే వాడాలి. నిరోంకార విద్య ఐన జిలేబీ యంత్రాన్ని కేవలం ఒక తెల్ల కాగితం పైన గీస్తేనే‌ ప్రశస్తం.

ఈ మంత్రానికి పారాయణంలో అంగన్యాసకరన్యాసాలు కూడా ఉన్నాయి. అన్ని మంత్రోపాసనల్లో ఉన్నట్లుగానే ఈ జిలేబీ మంత్రవిద్యలోనూ ఒక ధ్యాన శ్లోకం ఉంది. దానిని ఖచ్చితంగా ముందు చెప్పి మరీ పారాయణం చేయాలి.

అస్యేతి జిలేబీ ద్వాదశాక్షరీమహామంత్రస్య శ్రీ శ్యామలీయో ఋషిః జిలేబీదేవతా హాస్యప్రదేతి బీజం హాస్యప్రసంగిణీ ఇతి శక్తిః జిలేబీజాంగిర్యేతి పరమోమంత్రః డింగిరీతి కీలకం బ్లాగ్సంచారిణీ ఇతి అస్త్రం హాస్యప్రసంగిణీ ఇతి నేత్రం జిలుంగుప్రసంగ మత్యేతి కవచం హాస్యస్వరూపిణ్యేతి యోనిః డింగిరి బొంగిరీ ఇతి దిగ్భంధః సర్వబ్లాగ్సంచారిణీ ఇతి ధ్యానమ్‌

కరన్యాసం.
హాస్యప్రదేతి అంగుష్ఠాభ్యాం హఠ్
హాస్యప్రసంగిణ్యేతి తర్జనీభ్యాం కట్
జిలేబీ‌జాంగిర్యేతి మధ్యమాభ్యాం ఉఠ్
బ్లాగ్సంచారిణీ ఇతి అనామికాభ్యాం గుట్
జిలుంగుప్రసంగ మత్యేతి కనిష్ఠికాభ్యాం రట్
డింగిరి బొంగిరీ ఇతి కరతల కరపృష్ఠాభ్యాం ఫట్

అంగన్యాసం.
హాస్యప్రదేతి హృదయాయ మనః
హాస్యప్రసంగిణ్యేతి శిరసే ఆహా
జిలేబీ‌జాంగిర్యేతి శిఖాయై ఓహో
బ్లాగ్సంచారిణీ ఇతి కవచాయ హాహా
జిలుంగుప్రసంగ మత్యేతి నేత్రాభ్యాం హీహీ
డింగిరి బొంగిరీ ఇతి అస్త్రాయ హైహై
హాస్యస్వరూపిణ్యేతి దిగ్భంధః

ధ్యానం.
జయహే జయహే డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి హాస్యప్రదే
జయహే జయహే తింగర తింగర నిత్యప్రసంగ విలాసరతే
జయహే జయహే బ్లాగు ప్రపంచ నిరంతర సంచరణైక వ్రతే
జయహే జయహే అంబ తెలుంగు వెలుంగు జిలుంగు ప్రసంగ మతే

ఈ విధంగా కరన్యాస అంగన్యాసాదులు చేసి, ధ్యానశ్లోకం చదివి మంత్రపారాయణం చేయాలి. ఈ ధ్యానశ్లోకాన్ని కఠగతం చేసుకుంటారో, చూసి నిత్యం చదువుతారో అన్నది కాక తప్పులు లేకుండా చదవటమూ, మరచిపోకుండా చదవటమూ అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. లేక పోతే పారాయణం చేసి ఏమీ లాభం లేదు.

అంగన్యాసకరన్యాసధ్యానశ్లోకాలతో పారాయణక్రమం పాటించే వారు పైన చెప్పిన ప్రక్రియా మంత్రం కాని అభిచారమంత్రం కాని యథాశక్తిగా పారాయణం చేయాలి.

ప్రక్రియాపారాయణానికి నైవేద్యంగా వేడివేడి జిలేబీలను పళ్ళెం నిండా ఉంచి నివేదన చేసి హాయిగా భుజించాలి.

అభిచారపారాయణం చేసేవారు పిండివడియాలు కాని బొంగులు కాని కారంకారంగా చేసి వాటిని నివేదన చేసి కసికసిగా కరకరలాడించాలి. మరీ హెచ్చుగా కారం వేస్తే మీకే ఇబ్బంది అని తప్పక గ్రహించవలసింది.

ప్రక్రియా విధానంలో పారాయణం చేసేవారికి తింగరితింగరి జనాకర్షక బ్లాగుటపాలు వ్రాసే సామర్థ్యం ఇతోధికంగా వృధ్ధికావటం. ఇతరుల తింగరి కామెంట్లకు కోపం వచ్చి బీపీ పెరగకుండా ఉండటం. కొత్తబ్లాగర్లకు రీడర్ల సంఖ్యా కామెంట్లసంఖ్యా అభివృధ్ధి చెందుటం అన్నవి ఫలితాలు.

అభిచారవిధిగా పారాయణం చేసేవారికి తత్ఫలితంగా ఇతరుల తింగర తింగర కామెంట్లను చీల్చి చెండాడే శక్తి వస్తుంది. వీరి బ్లాగుల్ని దుర్వాఖ్యానం చేసేవారి పప్పులుడకవు. వీరి బ్లాగుల్ని దొంగిలించే వారి బ్లాగుల్నీ వ్యాఖ్యల్నీ కష్టాలు చుట్టుముడతాయి.

ఇతి జిలేజీయ మహా విద్యాః పక్షాంతరే జిలేబీ యమహా విద్యాః  
హహహా.

(గమనిక ఈ టపా యథాతధంగా జిలేబీగారి వరూధిని బ్లాగులో 2014-1107న ప్రచురితం)

(ప్రథమముద్రణ 11/4/2014న)
(పునర్ముద్రణ 30/9/2017)

13 కామెంట్‌లు:

  1. >> ఈ విధంగా ఉభయులకూ కోపం తెప్పించటం వలన పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత.

    దీనికి చివర్లో శ్యామలీయంగారు మర్చిపోయినది నేను ఇస్తున్నాను. ముందటి పేరాలో "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ" అని చెప్పి ఇక్కడ చెప్పలేదు కాబట్టి. దీనికి రిఫరెన్సు ఎలాగా అడుగుతారేమో అని.

    --- ఓ "జా" మిత్యేకాక్షరం జిలేబీ అని జిలేబీయోపనిషత్తు చెప్తోంది. ----
    హమ్మయ్యా, శ్యామలీయంగారూ బావుందండి. మొత్తం అష్టోత్తరం చెప్తారేమో అనుకున్నాను కానీ ఇవ్వలేదు, "ఓం వరూధినే నమః జిలేబీ పాదౌ పూజయామి" అని మొదలుపెట్టొచ్చా?

    రిప్లయితొలగించండి
  2. బలే నవ్వొచ్చేలా చెప్పరండి. ఇంతకీ వామాచారమే మంచిదంటారా? నారదాయనమః :) జిలేబీ మహా మత్రస్య శ్యామలీయో ఋషిః.....:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామా చారం మంచిదా చెడ్డదా అంటే ఈ వామాచారులూ సమయాచారులూ భిన్నంగా స్పందిస్తారండి.
      సమయాచార తత్పరా అనీ ఉంది, వామదేవీ, వామకేశ్వరీ వంటి నామాలూ ఉన్నాయి లలితాసహస్రంలో. వామాచారప్రసంగమే ఎక్కువనీ తక్కువనీ కూడా వాదిస్తారు. అసలు భాస్కరరాయలు వామమార్గభిమాని అనీ కాడనీ కూడా వాదాలున్నాయి. సవ్యాపసవ్యమార్గస్థా అని అమ్మవారు తగవుతీర్చినా వీళ్ళు తగవులాడుకుంటూనే ఉంటారు. వామం అంటే అందమైనది అని అర్థం చెబుతారు. ఆవలివాళ్ళు కాదంటారు. ఇది తెమిలేదు కాదు. ఒక విషయం గుర్తుంచుకోవాలి వైదికమైన అవైదికమైన రెండురకాల ఆరాధనలనూ అయ్యవారూ స్వీకరించారు, అమ్మవారూ స్వీకరించారు. భక్తులలో వారి వారి స్థాయికి తగిన ఆరాధన ఐనప్పుడు. శక్తిస్వరూపంలొ ప్రపంచశాంతినీ‌ ప్రపంచప్రళయాన్నీ కూడా దర్శించటం సబబే - మన స్థాయిని బట్టీ కాలాన్ని బట్టీ ఉంటుంది సందర్భం. అంతేనండి. మాగ్నట్ అనేదాంటో ఉత్తరదక్షిణధృవాలు రెండూ ఉంటాయి. ఒకేధృవం ఉండదు. రెండు రకాలుగానూ శక్తిస్వరూపభావన నిత్యం ఉంటుంది. స్వస్తిర్భవతురితి.

      తొలగించండి

  3. ధన్యోస్మి !!

    ఈ మహా విద్య ని కనుక్కున్నందులకు మీరు "జ్ఞాన శూన్యులు" అయిపోదురని ఆశీర్వదిస్తోంది జిలేబి మహా జాంగిరి !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిత్తం.

      బ్లాగులోకప్రియే దేవీ జ్ఞానశూన్యప్రపూజితే
      హాస్యైకచతురే దేవి హాస్యహీనభయంకరీ
      వికటటపాసంధాత్రీ జిలేబీనామధారిణీ
      హాస్యవ్యాఖ్యామహారాజ్ఞీ నామసప్తక విశ్రుతా

      దండాలండి.

      తొలగించండి
    2. << "వికటటపాసంధాత్రీ జిలేబీనామధారిణీ" >>
      బాగా చెప్పారు.

      << "హాస్యవ్యాఖ్యామహారాజ్ఞీ నామసప్తక విశ్రుతా" >>
      "అపహాస్యవ్యాఖ్యామహారాజ్ఞీ ...... " అంటే ఇంకా సరిగ్గా సరిపోతుందేమో?

      తొలగించండి
    3. >"అపహాస్యవ్యాఖ్యామహారాజ్ఞీ ...... " అంటే ఇంకా సరిగ్గా సరిపోతుందేమో?
      కుదరదండీ. అనుష్టుప్పులు ఒప్పుకోవు.

      తొలగించండి
    4. అయ్యో, అంతేనంటారా?

      తొలగించండి
  4. హ్హ హ్హ హ్హ
    నాకు మరో జిలేబీజాక్షరం సిధ్ధించింది:->)

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. బహుకాలం తర్వాత దర్శనం ఇచ్చారు ఈ శ్యామలీయం బ్లాగులో. మహదానందం మీకు నచ్చినందుకు.
      ఇలాంటివి రాసేయటం ఎంత వీజీయో జనానికి తెలియాలని ఇది వ్రాసానని మీరు గ్రహించే ఉంటారని భావిస్తున్నాను.

      తొలగించండి
  6. శ్రీనారద ప్రీత్యర్ధే జిలే'బీజాక్షర' విస్ఫోటనం కరిష్యే 🤗🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.