మీరు సరిగ్గానే చదివారు.
ఈ మహాపాకం పేరు ద్రాక్షబూరెలే.
బోల్డన్ని కబుర్ల లలిత గారికి వాగ్దానం చేసినట్లుగా ఈ స్వీటు గురించి వ్రాస్తున్నాను.
చాలా సంవత్సరల క్రిందట ఏదో ఒక సందర్భంలో మాఅత్తవారి తరపు ఇండ్లలో విందు కార్యక్రమం జరుగుతున్నది.
మా పెద్దబావమరది మాచిరాజు గారి భార్య కీ.శే. మీనాక్షి గారు, మరొకరూ (పేరు గుర్తుకు రావటం లేదిప్పుడు) కలిసి బూరెలు వేస్తున్నారు.
అక్కడ డైనింగ్ టేబుల్ మీద రకరకాల పండ్లు కూడా ఉన్నాయి.
ఏదో ఒక పనిమీద నేను వంటగది లోనికి వెళ్ళాను.
ఇంక బూరెలు ఐపోతే వంట పూర్తయినట్లే అని కాబోలు అన్నారు మీనాక్షి గారు.
పనిలోపనిగా ద్రాక్షపండ్లతో కూడా బూరెలు వేసెయ్యండి. పూర్ణం బూరెల కన్నా సులువుగా వచ్చేస్తాయి అని సలహా ఇచ్చాను.
పేలవూ అని ప్రశ్న వచ్చింది.
పేలవు అని నా నమ్మకం. ఆ మాటే చెప్పాను.
నా ప్రోద్బలం మీద కొన్ని ద్రాక్షపండ్లను (అవన్నీ శుభ్రంగా కడిగి పళ్ళెంలో పెట్టినవే లెండి) తీసుకొని చోవిలో ముంచి నూనెలో వేసారు. చక్కగా వేగాయి. పిండి కూడా వాటిమీద బాగానే పట్టింది.
చిన్నగా గుండ్రంగా గోళీల్లాగా ఈబూరెలు భలే బాగా వచ్చాయి చూడ్దానికి.
తినటానికీ బాగానే ఉన్నాయని అందరూ సంతోషపడ్డారు, మరీ అంత ఎక్కువ తీపి ఉండవూ చప్పగానూ ఉండవు. బాగున్నాయవి.
ఆరోజు బోలెడన్ని ద్రాక్షబూరెలు చెల్లిపోయాయి.
మామూలు పూర్ణం బూరెల కైతే పూర్ణం ముద్దను తయారు చేసుకోవటం. దానికోసం బెల్లంతో కొంచెం పని. మళ్ళా ఏలకులో మరేవో వేయకపోతే బాగుండవు. కొబ్బరి కూడా వేసుకోవచ్చును. ఇదంతా కొంచెం పెద్దపనే చివరికి.
అదే ద్రాక్షబూరెలైతే ద్రాక్షపండ్లు ఒక సైజుగ ఉన్నవి పుష్టిగా ఉన్నవి తీసుకోవాలి. చిన్నచితకా వదిలెయ్యండి. వడిలిపోయినవీ వదిలెయ్యండి. యధాప్రకారం బాగా కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ బూరెలకోసం గింజలు లేని ద్రాక్షపండ్లు మాత్రమే వాడాలి. కారణం స్పష్టమే. అవెలా ఉంటాయో వెబ్ నుండి గ్రహించిన ఒక బొమ్మ చూపుతున్నాను ప్రజాసౌకర్యార్ధం.
చోవి పిండి తయారు చేసుకొని ఈమంచి ద్రాక్షలతో బూరెలు వేసెయ్యటమే.
మహాసుళువు కదా.
ఆసక్తి ఉన్నవాళ్ళు తగుజాగ్రతలు తీసుకొంటూ తప్పక ప్రయత్నించి చెప్పండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.