2, జూన్ 2021, బుధవారం

చూడరే బాలుని శోభనాకారుని

చూడరే బాలుని శోభనాకారుని
వాడప్పుడే విల్లు పట్టెనదే చూడరే

బొమ్మవిల్లు చేతబట్టి మురిసిపోవుచున్న వాని
అమ్మముందు నిలిచి దాని అందమును చూపు వాని
నెమ్మదిగ వంచి గుణము నిమ్ముగాను సంధించి
అమ్మా బాణాలు కావాలమ్మా యనే వానిని

నారి తొడుగు ఒడుపు జూచి నాతి కౌసల్య నవ్వె
చేరి బాణాలనడుగ చిన్నగా సుమిత్ర నవ్వె
రారా నావద్ద గలవు రామచంద్ర బాణాలు
తీరైన విండ్లు నీవు కోరినన్ని యనె కైక

అవును కైకమ్మ బలే యస్త్రవిద్యావేత్తరా
సవినయముగ అమ్మవద్ద చక్కగా నేర్వరా
రవికులోత్తమ యనుచు రాము నెత్తి కౌసల్య
సవతి చేతి కందించగ చాల నవ్వె సుమిత్ర



4 కామెంట్‌లు:

  1. ఆహా! ఎంత చక్కటి ఊహా...
    కీర్తనలా లేదు...దృశకావ్యంలా ఉంది.
    కళ్ళకు కట్టినట్లుగా...వర్ణన బహు బాగుంది.
    నమో నమః శ్యామలీయంగారు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతి గారు, మీకు నచ్చినందుకు చాలా సంతోషం. అన్నట్లు ఇది 1200వ రామకీర్తన.

      తొలగించండి
  2. ఓహో...
    గతంలోనే చెప్పాను - మీరు శ్రీరామునికి చేస్తున్న "అక్షరార్చన" అద్భుతం అని.
    అభినందనలు శ్యామలీయంగారు.
    మరెన్నో కీర్తనలు మీనుండి రావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంతోషం భారతి గారు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రాముడు వ్రాయిస్తే ఎన్నైనా వస్తాయండీ.నాదే ముంది. పదిమందదీ ఈరామానుగ్రహాన్ని పంచుకోవాలని కొంచెం పేరాశ అంతే.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.