1, మే 2013, బుధవారం

మీనంబవై యబ్ధిలోన

సీ. మీనంబవై యబ్ధిలోన డాగిన సోమ
      కుని పరిమార్చిన ఘనుడ వీవె
కమఠంబవై పాలకడలిలో మంధ
      మును దాల్చి నిలిపిన ఘనుడ వీవె
యజ్ఞవరాహదివ్యాకృతి నిల బ్రోచి
      కనకాక్షు జంపిన ఘనుడ వీవె
నరమృగాకృతి హిరణ్యశిపు జీల్చి లో
      కంబుల బ్రోచిన ఘనుడ వీవె
తే.గీబలిని యాచించి యణచిన వటువు వీవె
రాచకులమును బలిగొన్న రాముడవును
ఆది నారాయణుండవు నరయ నీవె
రావణాంతక నా తండ్రి రామచంద్ర

(వ్రాసిన తేదీ: 2013-4-27)

3 కామెంట్‌లు:


  1. రామచంద్ర, నా తండ్రి, రావణాంతక ,

    నరయ నీవే ఆది నారాయణుండవు !

    రిప్లయితొలగించండి
  2. హమ్మయ్యా మొత్తానికి సీసం బయటకొచ్చింది. సంతోషం. నేనడిగినందుకే రాసారా? అయితే మరింత సంతోషం. :-)

    ఇంట్లోచేసిన జిలేబీ నీవే, కొట్లో కొన్న జిలేబీకూడా నీవే
    కామెంటు నాదే మీర్రాసిన పద్యానికి స్ఫూర్తి కాదే నేను
    ...
    ...
    పూరించండి మరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు సంతోషమైనందుకు ఆనందించ వలసినదే. అయితే కేవలం మీరడిగారని సీసం వ్రాయలేదు. వివరిస్తాను.

      సాధారణంగా చెప్పే విషయానికి పద్యం నిడివి సరిగా సరిపోవాలి. లేకపోతే భావాన్ని కుదించి అసంతృప్తితో ముగించ వలసి రావటమో వ్యర్థపదాలతో యెక్కువైన పద్యభాగాన్ని పూరించటమో‌ చేయవలసి రావటమో‌ తప్పదు.
      రెండు విధాలుగానూ పద్యం చెడటమే గతి. కవులు యీ విషయంలో చాలా జాగరూకులై ఉండాలి.

      ఇక్కడ విషయం రామావతారమూ దానికి ముందుగల అవతారాలనూ ఒకే పద్యంలో ప్రస్తావించాలి. ఉపజాతులైన ఆటవెలది, తేటగీతులు మరీ చిన్నవి. జాతిపద్యం అయిన కందం మరింత చిన్నది కబట్టి బొత్తిగా లాభం లేదు. వృత్తాలు కూడా ఇంత పెద్ద ప్రస్తావనను భరించేంత నిడివి గలవి కావు. కాబట్టి ఒకే పద్యంలో‌ చెప్పాలనుకోవటం వలన సీసపద్యాన్ని యెంచుకోవటం జరిగింది. దీని నిడివి తగినంత యెలాగూ ఉండటం వలన కొంచెం చమత్కారాన్నీ జోడించటానికి వీలు కుదిరింది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.