29, డిసెంబర్ 2022, గురువారం

రామచంద్రుని నామము

రామచంద్రుని నామము బహురమ్యమైన హరినామము


బుధులకు రుచియగు నామము ఇది పురుషోత్తముని నామము

మధురతమంబగు నామము ఇది మంగళకరమగు నామము


మునిజనమోహననామము ఇది దనుజభయంకరనామము

ధనదమిత్రప్రియనామము ఇది మనసిజజనకుని నామము


తాపత్రయహరనామము ఇది ధశరథతనయుని నామము

శాపాంతకమగు నామము ఇది సర్వాభీష్టదనామము


భవభయహరమగు నామము ఇది పట్టాభిరాముని నామము

రవికులతిలకునినామము ఇది పవనసుతార్చితనామము


పరమమనోహరనామము ఇది పాపవిదారక నామము

సురుచిరసుందరనామము ఇది సురగణపూజిత నామము


శోకవినాశకనామము ఇది శుభముల గూర్చెడు నామము

లోకారాధితనామము ఇది లోకేశ్వరుని నామము