14, డిసెంబర్ 2022, బుధవారం

పలుకకుండు టెటుల వాడు పలుకరించితే

పలుకకుండు టెటుల వాడు పలుకరించితే వాని
పలుకరింపునకే మేను పులకరించితే
 
కనులారా వానిని గని కరుగని మనసుండునా
మనసులోన నిండియున్న మాధవు డెదురైతే
మనకెందుకు లెమ్మనుచు మాటలాడకుండగ
మనవశమా లేనిపోని మాటలెందుకే
 
మత్తుజల్లి మాటలలో మనల ముంచి పోవునే
ఉత్తుత్తి మాటలేనే ఊదడే వేణువును
మెత్తనైన మాటలతో చిత్తుచేయ నీయక
యిత్తరి మనమున్నామో యేల నూదడే

మేను పులకరించితే నేనేమి చేసేదే
మౌనముగా దూరముగా మసలండే మీరు
తాను లేని చోటేదే నేను దూర ముండగ
మానవతీ మనసుండిన మార్గముండునే