22, డిసెంబర్ 2022, గురువారం

రామునకు మ్రొక్కరే రమణులార

రామునకు మ్రొక్కరే రమణులార సీతా
రామునకు మ్రొక్కరే రమణులార
 
చారెడేసి కన్నులున్న శ్యామలాంగుడే  సం
సారభయాపహుడైన సారసాక్షుడే
కోరినట్టి వరములిచ్చు గోవిందుడే మన
సార మీరు మ్రొక్కరే సకియలార
 
దేవతలే చేరి మ్రొక్కు దేవదేవుడే ఆ
భావజుని కన్నతండ్రి పరమాత్ముడే
భావింప బ్రహ్మకైన వశముకాని ఈ
దేవునకు మ్రొక్కరే లావుగాను

కోరి కొలుచువారి కితడు కొంగుబంగరే మీ
కోరికలను చెప్పుకొనరె గోవిందునకు
నోరునొవ్వ కీర్తించరె చేరి మ్రొక్కరె ఓ
సారసాక్షులార రామచంద్రమూర్తిని