5, డిసెంబర్ 2022, సోమవారం

తెలియలేరు రామచంద్రుని దివ్యతత్త్వము

తెలియలేరు రామచంద్రుని దివ్యతత్త్వము
తెలియలే రించుకయు తెలియలేరు

సుమశరుని బారినపడి చొక్కియున్న వారు
కుమతులతో చేరి బుధ్ధి కొడిగట్టిన వారు
భ్రమలతో ధనములకై పరువులెత్తు వారు
విమతుల బోధనలు విని వెఱ్ఱెక్కిన వారు

ఎల్ల దేవతల తోడ నితని నెంచు వారు
ఎల్లప్పుడు హేతువాద మెంచి పలుకు వారు
కల్లగురువు లాడు వాక్యములు వినెడు వారు
వల్లమాలిన సంసారవ్యామోహము వారు
 
వైరాగ్యము నిజబుధ్ధికి వచ్చెడు దాక
ఆరాటము లన్నియు నణగిపోవు దాక
శ్రీరామభక్తులతో స్నేహమబ్బు దాక
శ్రీరామకృపామృతము సిధ్ధించు దాక