20, డిసెంబర్ 2022, మంగళవారం

అంతయు రామున కర్పణము

అంతయు రామున కర్పణము నిశ్చింతగ రామున కర్పణము

నయముగ వందనశీలము గలిగిన నడవడి రామున కర్పణము
భయవిరహితమై హరిస్మరణము గల భావము రామున కర్పణము

జయములు సంతోషంబులు సర్వము చక్కగ రామున కర్పణము
వియచ్చరుల ఆశీర్వచనంబులు విభుడగు రామున కర్పణము

సకలకర్మములు కర్మఫలంబులు సర్వము రామున కర్పణము
అకళంకస్థితి నలరెడు చిత్తం బది నారామున కర్పణము

నలుగురు మెచ్చుచు పలికినచో నా పలుకులు రామున కర్పణము
నలువకు జనకుడు నారామునకే‌ నాజీవిత మిది యర్పణము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.