2, డిసెంబర్ 2022, శుక్రవారం

ఎఱుగరో శ్రీరామచంద్రుని

ఎఱుగరో శ్రీరామచంద్రుని

ఎఱుగరో ఈరఘుకులేశుని

ఎఱుగరో ఈదివ్యతేజుని

ఎఱుగరో హరిని


ఎఱుగరో శివధనువు విరచిన

మరపురాని మధురమూర్తిని

ఎఱుగరో రావణుని జంపిన

తిరుగులేని వీరమూర్తిని


ఎఱుగరో ఎవ్వానిబాణము

తిరుగులేని దట్టి రాముని

ఎఱుగరో శరణన్న వారిని

క‌రుణ నేలే ఘనచరిత్రుని


ఎఱుగరో పరమేష్టి స్వయముగ

హరివి నీవని పొగడు రాముని

ఎఱుగరో ఈశ్వరుడు స్వయముగ

హరివి నీవని పొగడు రాముని


ఎఱుగరో సద్భక్తకోటికి

వరములిచ్ఛే ప్రాణనాధుని

ఎఱుగరో మోక్షార్ధు లందరు

నెపుడు మ్రొక్కే విష్ణుమూర్తిని