24, డిసెంబర్ 2022, శనివారం

మంగళం మంగళం


మా రామచంద్రునకు మంగళం మంగళం

మారకోటిసదృశునకు మంగళం మంగళం


రావణాదిదుష్టదైత్యప్రాణాపహారికి సమ

    రాంగణవరవిహారికి మంగళం మంగళం


అంగన సీతమ్మ గూడి యందగించు రామునకు

    గంగాధరవినుతునకు మంగళం మంగళం


వాసవాదిసురముఖ్యుల వందనముల నందుకొను

    బంగరు తండ్రి రామునకు మంగళం మంగళం

    

అంచితముగ సద్భక్తుల కన్ని సౌఖ్యముల గూర్చు

   మంచివాడు రామయ్యకు మంగళం మంగళం


మంచివారి కెల్లపుడు మంగళంబులను గూర్చు 

    మంగళాకారునకు మంగళం మంగళం


అఖలలోకముల నేలు నాదిదేవునకు ధర ని

    స్సంగుల మది నుండు హరికి మంగళం మంగళం


పొంగుచు యోగీంద్రు లెపుడు పొగడు దేవదేవునకు

    అంగజగురుడైన హరికి మంగళం మంగళం

    

బంగారు గద్దె మీద వాసిగా నుండు ఖగతు

    రంగుడైన రామయ్యకు మంగళం మంగళం


11 కామెంట్‌లు:

  1. మంగళం బాగుంది.
    అలాగే …. ఉబోస అనుకోండి మరేమన్నా అనుకోండి గానీ …. కొన్ని కొన్ని బ్లాగుల్లో కామెంట్ వ్రాయాలనే మీ ఉబలాటానికి కూడా మంగళం పాడితే ఉత్తమం కదా? ప్రయత్నించరాదూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటికే కామెంట్స్ వ్రాయటం బాగా తగ్గించానండీ. ఉబలాటానికి పాడాలి మీరన్నట్లు మంగళం మంగళం అని.

      తొలగించండి
    2. విన్నకోట వారూ ఎందుకు అలా అంటారు ?. ఇంకో అభిప్రాయం ఎప్పుడూ మంచిదేగా. కొందరికి నచ్చకపోవటం మూలాన అది సరియైనది కాదని అనుకుంటే ఎలా!

      తొలగించండి
    3. అవునండీ ఇదే మంచిది‌. మూస అభిప్రాయాలే రాసు కుంటూ పోతూంటే దానికి అంతూ పొంతూ లేకుండా వుంటుంది.

      తొలగించండి
    4. తమకు నచ్చని నాయకుల గురించి విమర్శ చేసేవారు తమ అభిమాన నాయకుల గురించి పల్లెత్తు మాట అనరు. కేవలం విమర్శ మాత్రమే కాకుండా చేసిన మంచిని కూడా మెచ్చుకున్నప్పుడే విమర్శకు విలువ ఉంటుంది.

      తొలగించండి
    5. వారు మారతారని మీరు ఆశించడం - వారు మారడం!? కాస్తంత సాధ్యపడే విషయం చెప్పండి అజ్ఞాత25 డిసెంబర్, 2022 3:37 PM మాస్టారు. ప్రస్తుతం నడుస్తున్నది బోయీల కాలం, వాజ్పేయీల కలం కాదని గుర్తుంచుకో మనవి.

      తొలగించండి
    6. ఎవరిలోనైనా మంచీ చెడూ రెండూ ఉంటాయి. వారంటే ఇష్టమయిన వారు వారి మంచిని గురించి ఎక్కువగా చెబుతారు ఇష్టం లేని వారు వారి చెడుని గురించి మాట్లాడతారు. ఇది మానవ నైజం. దీన్ని తప్పుపడితే ఎట్లా !

      తొలగించండి
    7. మీరన్నది సత్యమే లక్కరాజు గారు, కానీ పైన వారన్నది ఇష్టాఇష్టాల గురించి కాదు, మంచీ చెడుల గురించి. అవతలి వారి తప్పు ఎత్తి చూపించే ధర్మ గుణం కలవారు, ఇవతలి గారు తప్పు చేస్తే ఖండించే సచ్చీలత కూడా కలిగి ఉండొద్దా అని. ఆపై మీ తీర్పు.

      తొలగించండి
  2. లక్కరాజు వారు, “అజ్ఞాత” గారు,
    ఇంకో అభిప్రాయం కూడా ఉంటే మంచిదేనని ఎదుటివారు కూడా అనుకోవాలిగా? అలా కాకుండా ఇతర కారణాల వలన వితండవాదం చేసే అలవాటున్నవారని తెలిసిన తరువాత కూడా అటువంటివారి జోలికి వెళ్ళడం తగిగించుకోమన్నది నేను శ్యామలీయం గారికిచ్చిన ఉబోస భావం.

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడ ఎంతో చర్చ జరుగుతోంది. ఐతే ఈటపా లోని విషయం శ్రీరామచంద్రుల వారిని గురించిన మంగళకీర్తనం. ఆవిషయం గురించి చర్చారంభంలో విన్నకోట వారు బాగుంది అన్నముక్క ఒకటి మినహాయించితే మరొక చిన్నమాట ఐనా ఎవరూ వ్రాయలేదు. అంటే రామకీర్తనం గురించిన ఆసక్తి లేదు ప్రజలకు అనిపిస్తోంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే.వ్యాఖ్య లు వ్రాసిన వారు అందరూ రామ కీర్తన చదివి ఉండక పోవచ్చు.

      మీరు కూడా కొన్ని బ్లాగులలో పోస్టు గురించి కాక వ్యాఖ్యలకు స్పందించిన సందర్భములు కలవు.

      బ్లాగులను రచ్చబండ లాగా ముచ్చట్ల కోసం ఉపయోగించడం కూడా తరచుగా జరుగుతుంది.

      అసలు పోస్టును పట్టించుకోకపోతే కొంత అసంతృప్తి కలగడం సహజం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.