22, డిసెంబర్ 2022, గురువారం

రామనామము చాలని పరాకులేక

రామనామము చాలని పరాకులేక జిహ్వపై
నామ మెప్పుడు తిరుగునట్టుల నడుచుకొనవలెరా

రామనామము వలన గలుగును భూమిపై సకలార్ధములును
రామనామము వలన గలుగును భూమిజనులకు సేమము
రామనామము వలన గలుగును రక్తియైనను ముక్తియైనను
రామనామము కంటె సంపద యేమిగలదని యెంచవలెరా

రామచంద్రుని సద్గుణంబులు రామచంద్రుని ధర్మవీరము
రామచంద్రుని దివ్యచరితము రామనామము నెన్నుచు
రామచంద్రుని కరుణబడసిన రామభక్తుల గాధలెన్నుచు
రామచంద్రుడు మెచ్చురీతిగ భూమిపై తానుండవలెరా

రామనామపు రుచినెఱుంగని పామరులను దూరముంచుచు
రామభక్తుల తోడచేరుచు రామభజనలు చేయుచు
రాముడే తన పతియు గతిగా ప్రేమమీఱగ లోన నెంచుచు
రామచంద్రుని సేవలో తనరారుచును తానుండవలెరా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.