17, డిసెంబర్ 2022, శనివారం

ఏమరక చేయండి రామనామము

ఏమరక చేయండి రామనామము మీకు

  కామితార్ధముల నొసగు రామనామము


దశరథునకు ప్రియమైన రామనామము ఆ

  దశముఖునకు వెగటైన రామనామము

పశుపతి కతి ప్రియమైన రామనామము నర

   పశువుల తరియింపజేయు రామనామము


సుజనుల మది నేలుచుండు రామనామము కడు

   కుజనునైన కరుణించే రామనామము

విజనుల కతి భయదమౌ రామనామము హరి

   భజనపరుల కమృతమౌ రామనామము


రాతినైతి నాతిజేయు రామనామము ఒక

  కోతినైన బ్రహ్మజేయు రామనామము

ప్రీతి భక్తకోటి పలుకు రామనామము వి

   ఖ్యాతిగ ముజ్జగములేలు రామనామము


లోపములను తొలగించు రామనామము సం

  తాపములను తొలగించు రామనామము

శాపములను తొలగించు రామనామము బహు

  పాపములను తొలగించు రామనామము


భక్తిమీఱ పలుకవలయు రామనామము ఆ

  సక్తిమీఱ పలుకవలయు రామనామము

ముక్తినొసగు మంత్ర మీ రామనామము మీ

  శక్తికలది చేయవలయు రామనామము



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.