11, డిసెంబర్ 2022, ఆదివారం

నందరాజు కొడుకు వైతే నాకేమయ్యా

నందరాజు కొడుకు వైతే నాకేమయ్యా నీ కా
నందమైతే కాకుంటే నాకేమయ్యా

చక్కగాను మురళి నూదజాలుదువా నాకేమయ్యా నే
నెక్కడున్న నక్కడుందు వెందుకయ్యా పోవయ్యా
గ్రుక్కెడంత చల్లనైన కొలువ నీకు నాకేమయ్యా నీ
చక్కదనాలనే చూసి సంతసించ నాకేమయ్యా

ఆహా యమునాతీరవిహారివైతే నాకేమయ్యా నీ
మాహాత్మ్యము లెన్నుంటే మాకెందుకు పోవయ్యా
దాహ మంటే చల్లబోసి దప్పిరీర్చ నాకేమయ్యా బహు
మోహనాకారుడవని మనసుపడగ నాకేమయ్యా

ఊరకనే చల్లబోయ నొప్పుకొనగ నాకేమయ్యా నీ
బేరాలకు చల్లబోయ వీలుకాదు పోవయ్యా
నారాయణమూర్తి వైతే నాకు మోక్ష మీవయ్యా మన
సారా నవనీత మంతా సమర్పింతును కన్నయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.