11, డిసెంబర్ 2022, ఆదివారం

కొంచెము రుచిచూడరా మంచిమందురా

కొంచెము రుచిచూడరా మంచిమందురా బలే 
మంచిమందురా ఇదే మంచిమందురా
 
కలిజ్వరమును తగ్గించే ఘనమైన మందురా
బలసంపద నందించే పసందైన మందురా
వెలకట్టలేని తీయని వేడుకైన మందురా
నిలువెల్లా అమృతమై యలరించే మందురా

భూవలయము నందు పేరు పొందినట్టి మందురా
పావనాతి పావనమై పరగునట్టి మందురా
దేవతలకు కూడ పునరుత్తేజ మిచ్చిన మందురా
భావింపగ బ్రహ్మకైన బలమిచ్చే మందురా

రామనామ మనే మందు రమ్యమైన మందురా
భూమిని హరిభక్తకోటి భుజియించే‌ మందురా
పామరులకు పండితులకు భవరోగపీడ నణచి
ప్రేమమీఱ స్వస్వరూపవరమిచ్చే మందురా