1, డిసెంబర్ 2022, గురువారం

పదరా యిక నరకమునకు పాపి రావణా

పదరా యిక నరకమునకు పాపి రావణా
వదల‌రా సమవర్తి నాకొక పాప మింకేది

అతిశయంబుగ పాపకార్యము లాచరింతితివి
బ్రతికియున్నన్నాళ్ళు నీవో రావణాసురుడ
ప్రతిగ నీకు ఘోరనరక వాసమే శిక్ష
గతమునందు కలిపి దర్పము కద‌లి రావలెరా

రామవైరి నైనదాదిగ నామనంబు నందున
రామనామము విడువకుంటినిరా సమవర్తి
రామచంద్రుని దివ్యబాణము లంటెరా నన్ను
పామరత్వము పోయినది నాపాపములు పోయె

రామధ్యానము రామనామము రామబాణముల
నీమనోబుధ్ధులును తనువు నిండిపోయినవా
ఏమిపాపము కలదురా యిక యేగరా దివికి
రామమహిమాతిశయము నాస్వర్గమున చాటరా