11, డిసెంబర్ 2022, ఆదివారం

రామ రామ యంటే ఆరాటము లుడిగేను

రామ రామ యంటే ఆరాటము లుడిగేను
కామితార్ధ మైన ఆ కైవల్య మబ్బేను

పుట్టినదాదిగ నీవీ భూములని పుట్రలని
పట్టుబట్టి తిరుగుతుంటే పగలే మిగిలేను
చెట్టజేసి పదిమందికి చీచీ యనిపించుకొని
వట్టిచేతులతో నరిగెడు పనియే యయ్యేను

కనులు తెరచినది మెదలు కాసులని కాంతలని
మనసుచెదరి తిరుగుతుంటే దినములు గడిచేను
మనసారా హరి యనని మనిషి వనిపించుకొని
తనువు విడచి యమపురికి తరలుట అయ్యేను

అన్యదైవముల గొలిచి ఆశపడి చెడుటేల
అన్యమంత్రముల చదివి ఆయాసపడు టేల
పుణ్యమేల పాపమేల పుట్టువే వలదనే
ధన్యుడవై రామా యంటే తరించు టయ్యేను