27, డిసెంబర్ 2022, మంగళవారం

రామా నీకెదే మంగళం (సీతారామకళ్యాణం)

రామా నీకెదే మంగళం రాజీవనయన రామా నీకిదే మంగళం
రామా నీకెదే మంగళం నయనాభిరామా రామా నీకిదే మంగళం
 
కొదమసింగపు ఠీవి మెఱయగ గురువు వెంటను నడచి వచ్చిన   ।రామా। 
ముదమునను మిథిలాపురమునకు కదలివచ్చిన ప్రథితయశుడా    ।రామా।
 
రాజునకు మునిరాజు నీదు పరాక్రమమోన్నతి తెలుప మ్రొక్కిన    ।రామా। 
రాజలోకపు పొగరునణచిన రాజశేఖరు వింటి నరసిన          ।రామా।
 
భక్తితో శ్రీహరుని వింటికి బహువిధంబుల మ్రొక్కి నిలచిన       ।రామా।
శక్తి మెఱయగ దివ్యమగు నాచాపమును నిలబెట్టి మించిన      ।రామా।
 
హరుడు దాల్చిన దివ్యచాపము నంత సులువుగ దాల్చి నిలచిన   ।రామా।
నరసహస్రము చూడ నారిని హరశరాసనమునకు దొడగిన       ।రామా। 
 
అంతటను హరువింటి నాకర్ణాంతముగ పూరింప జూచిన       ।రామా।
అంతలో పెనుమ్రోతతో ధను వపుడు విరుగగ జనులు కూలిరి    ।రామా।
 
నడిమికి శివధనువు విరుగగ పిడుగులు పడినట్టు లాయెను      ।రామా।
పుడమిఱేడును మునియు మీరును జడియకుండిరి నిబ్బరంబుగ  ।రామా।
 
ప్రీతితో శ్రీరామునకు నే సీతనిచ్చెద ననియె జనకుడు         ।రామా।
సీత చెలియలు యూర్మిళను చేపట్టు లక్ష్మణు డనియె జనకుడు  ।రామా।
 
భరతశత్రుఘ్నులకు నాసోదరుని కన్యామణులు కలరనె         ।రామా।
పరమమంగళ వార్త నంతట పంపిరి మీతండ్రిగారికి           ।రామా।
 
సురల పుష్పవృష్టి మధ్యను చూడచక్కని పెండ్లివేడుక         ।రామా।
జరుగుచుండగ నాకమం దప్సరస లంతట నాట్యమాడిరి       ।రామా।
 
మునులు వేదములను పఠించిరి మ్రోగె దుందుభు లంబరంబున   ।రామా।
కనుమదే గంధర్వులును నీఘనత నెన్నుచు పాడుచుండిరి       ।రామా।
 
జనకపుత్రీపాణిగ్రహణము కనులపండువగా నొనర్చిన           ।రామా।
మునులు సురలును భూమిజనులును మోదమందగ పెండ్లియాడిన  ।రామా।
 
లోకమాతను భూమిజాతను స్వీకరించిన లోకనాయక           ।రామా।
ప్రాకటంబుగ జగములేలెడు ప్రభుడవై వెలుగొందుచుండెడి         ।రామా।
 
రామా నీకెదే మంగళం త్రైలోక్యనాథా రామా నీకిదే మంగళం
రామా నీకెదే మంగళం సీతాసమేతా రామా నీకిదే మంగళం 


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.