11, డిసెంబర్ 2022, ఆదివారం

మందంటే మందండీ మన రాముని నామమే

మందంటే మందండీ మన రాముని నామమే
అందరికీ అందుబా టయిన మంచి మందండీ
 
కామాదివికారములు క్రమ్ముకొన్న వేళల
రామనామము తప్ప రక్షించే మందేది
తామసగుణచేష్టచే తలతిరుగుచు నుండగ
రామనామము తప్ప రక్షించే‌ మందేది

ఇంతకన్న చక్కగా ఏమందు పనిచేయు
చింతల పాలుచేయు చీడ కలిజ్వరమున
ఇంతకన్న చక్కగా ఏమందు కుదుర్చును
అంతులేని భవరోగ మనే‌ గొప్ప జబ్బును

మణిమంత్రౌషదముల మనసుకుదుట పడేనా
మన రాముని నామమున మనసు నెమ్మదించునా
వినరండి యింతకన్న విలువైన మందేదీ
కనరాదు వినరాదు కనుక త్వరపడండీ