13, డిసెంబర్ 2022, మంగళవారం

ధారాళమైనది దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుని సత్కృప

ధారాళమైనది దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుని సత్కృప

సురల వెతల దీర్పగ వైకుంఠమును వీడి నరుడైన శ్రీహరి సత్కృప
ధర్మమార్గంబును ధరమీద స్థాపించు నిర్మలంబైనట్టి సత్కృప
సమయము కాదని మారీచుని పట్టి చంపక విడచిన సత్కృప
కౌశికమునిరాజు యాగమ్ము రక్షింప గడగిన ధృఢమైన సత్కృప
రాయిగా నుండిన గౌతముని పత్నిని రమణిగ మార్చిన సత్కృప
సీరధ్వజుని గుండెబరువును డించగ శివధనువు నెత్తిన సత్కృప
రంకెలువేసిన భార్గవరాముని జంకించి వదలిన సత్కృప
అపరాథి కాకాసురు కన్నుగొని వదిలిన యద్భుతం బైనట్టి సత్కృప 
పక్షి జటాయువు సేవ కొనియాడి వెంటనే మోక్షమ్ము నిచ్చిన సత్కృప
కబంధుని పాతిబెట్టి శాపావసానమును గావించి మించిన సత్కృప
శబరి యాతిధ్యము స్వీకరించి మోక్షసామ్రాజ్య మిచ్చిన సత్కృప
వాయుపుత్రుని పేరుపెట్టి పిలిచి తన బంటుగ గైకొన్న సత్కృప
రవిసుతుని వెతలణచి సామ్రాజ్యమిచ్చిన రవికులతిలకుని సత్కృప
ఆంజనేయుని భావిబ్రహ్మగా దీవించి యాదరము చూపిన సత్కృప
శుకసారణుల గూఢచారుల జంపక చూచిపొండని నట్టి సత్కృప
సురవైరి తమ్ముడు శరణమ్ము వేడిన సొంపుగ బ్రోచిన సత్కృప
పాపి రావణు డలయ జంపక విడచుచు రేపురమ్మన్నట్టి సత్కృప
పౌలస్త్యు బ్రహ్మాస్త్రమున జంపి వైరమ్ము వదలితి నన్నట్టి సత్కృప
పడిన రావణు జూచి యిక వీడు నాకును బ్రాతృసముడన్నట్టి సత్కృప
వనవాసమును దీర్చి సాకేతమును చేరి ప్రజలనేలిన యట్టి సత్కృప
మూడులోకములకు శాంతిసౌఖ్యములను వేడుకతో నొసగిన సత్కృప
భక్తకోటిని సర్వవిధముల రక్షించి వరముల నిచ్చెడి సత్కృప 
కోరిన వారికి కోరిన ఫలముల కురియుచు నుండెడి సత్కృప
కూరిమితో సుజనకోటికి నిత్యమ్ము కొంగుబంగరైన సత్క్పప
యోగీంద్రహృదయాంతరంగంబు లెప్పుడు నొప్పుగ చింతించు సత్కృప
రామదాసులకు రక్షాకవచంబుగా రాజిల్లు చుండెడి సత్కృప
మోక్షకారకమగుచు ముముక్షువుల కెప్పుడు సాక్షాత్కరించెడు సత్కృప