2, డిసెంబర్ 2022, శుక్రవారం

చేయెత్తి మ్రొక్కిన చాలురా

చేయెత్తి మ్రొక్కిన చాలురా మనసంతా
      హాయితో నిండిపోవురా

ధర్మస్వరూపునకు దానవాంతకునకు
      దశ‌రథతనయునకు మన రామునకు

నిర్మలచరితునకు నీరేజనేత్రునకు
      ని‌రుపమగుణనిధికి మన రామునకు

కరుణాలవాలునకు కమనీయగాత్రునకు
      గగనఘనశ్యామునకు మన రామునకు

పరమేష్టివినుతునకు పరమశివవినుతునకు
      వరవిక్రమశాలికి మన రామునకు

దరహాసవదనునకు పరిహసితమదనునకు
      సరిలేని వీరునకు మన రామునకు

సురవైరిదమనునకు సురదుఃఖశమనునకు  
      నరనాథశ్రేష్ఠునకు మన రామునకు

సదాశుభదమూర్థికి సమస్తలోకనేతకు
      మదాదివర్గధ్వంసికి మన రామునకు

పదద్వయప్రభాజితభాస్కరశశికోటికి
     ముదంబున మననేలు మన రామునకు