19, డిసెంబర్ 2022, సోమవారం

నీ నామమే రామ నీ నామమే

నీ నామమే రామ నీ నామమే నా
కేనాడును దీనత రానీయదు

మాన కీభూజనులు మితిమీరి హింసింప
బూని విషవాగ్బాణములు చాల విసరగా
వానిచే నే గాసిబడకుండ రక్షించ
నీ నామమే కవచమై నాకు కలిగె

మేను దాల్చినదాది మీఱి రిపుషట్క మిదే
దానవుల రీతిగ నిర్దాక్షిణ్యము గాను
బూని కత్తులు దూసి  పొడచుచు చుండగా
నీ నామమే డాలుగా నాకు కలిగె

నేను నిను జేరగా లోనెంచి యుండగా
పోనీక బంధించు హీనభవలతలను
పూని ఖండించు సర్వోత్తమాయుధమన
నీనామమే ఖడ్గమై నాకు కలిగె