11, డిసెంబర్ 2022, ఆదివారం

దినదినమును రామ రామ

దినదినమును రామ రామ క్షణక్షణమును రామ రామ

మనసార రామ రామ మాకెపుడును రామ రామ


కుడుచుచును తిరుగుచును నుడువునది రామ రామ

పడక పైన నొరుగుచును పలుకునది రామ రామ

నడిరేయిని మధ్యాహ్నము నడచునదే రామ రామ

అడుగడుగున రామ రామ యన్ని చోట్ల రామ రామ


మనసులోన మమతలోన మసలునదే రామ రామ

కనులలోన కలలలోన కదలునదే రామ రామ

అనువుగాని చోటులందు ననవరతము రామ రామ

యునికి చెడిన వేళలందు నుల్లమందు రామ రామ


భోగములను రోగములను పలుకు నెపుడు రామ రామ

భాగవతుల మధ్య నుండి పలుకు నెపుడు రామ రామ

యోగనిష్ఠ నుండి తలచు నుల్ల మెపుడు రామ రామ

రాగమొప్ప బలుకు నెపుడు రామ రామ రామ రామకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.