20, డిసెంబర్ 2022, మంగళవారం

రామనౌక కేవులేని రమ్యమైన నౌకరా

రామనౌక కేవులేని రమ్యమైన నౌకరా

నీముందే లంగరేసి నీకోసమె వేచెరా


అద్దరికే చేర్చునట్టి అందాల నౌకరా

వద్దువద్దనక నీవు వచ్చి యెక్కరా

ఇద్దరిక ద్దరికిదే యెన్నదగు నౌకరా

పెద్దనౌకరా భయము వద్దురా యెక్కరా


మునుపు పెద్దలెక్కినట్టి ముచ్చటైన నౌకరా

మనోవేగమున చనెడు మంచినౌకరా

జనుల కందరకు నిదే సరసమైన నౌకరా

ధనికులనుచు పేదలనుచు తలచని నౌకరా


భాగవతోత్తముల కిదే పసందగు నౌకరా

యోగరతుల కనువుగా నుండు నౌకరా

త్యాగధనుల కవశ్యము తగినట్టి నౌకరా

భోగీంద్రశాయి నడుపు పొలుపైన నౌకరా