15, డిసెంబర్ 2022, గురువారం

మౌనులా గోపికలా మాయెదుట నున్నది

మౌనులా గోపికలా మాయెదుట నున్నది

ఈనాడు వీరి కేమి జ్ఞానోదయ మాయె


గొల్లపిల్లలకు మేము క్రొత్తగా నుంటిమో

ఎల్లరకును నేడు మానల్లన వెగటో

ఫుల్లాబ్జాక్షులకు నేడు మురళిపాట చేదో

వల్లవిక లెవరు మాతో పలుకాడరే


మొన్న నిన్న ఆటలతో మురళిపాట లేదని

అన్నులమిన్న లందరు అలిగినారో

ఎన్నిపాట లైన గాని ఇదే పాడు నీమురళి

చిన్నిచిన్ని కోపాలును చింతలు వద్దు


వెన్నెలకే మురళిపాట వినిపించును కృష్ణుడు

కన్నియల కోపాలే కరుగకుంటే

పొన్నలును యముననీళ్ళు విన్నదే చాలును

విన్న చాలు పిల్లగాలి వేడుకమీఱ