22, డిసెంబర్ 2022, గురువారం

ఎందుకో శ్రీరామ యనలేకుందు రిలను కొందరు

ఎందుకో శ్రీరామ యనలేకుందు రిలను కొందరు
ముందుముందా యమునిముందే మందురో వారందరు

కాసులా నిలకడగ నవి తమకడనె కుదురుగ నుండునా
దాసులై ఆ కాసులకు మరి దారితప్పుట చేతనే
కాసుల నార్జించకుండిన గడువదను నొక భీతియో
కాసులకునై భువిని కొందరు వేసరుచు నిను మరతురో

కాంతల సౌందర్యములు తమ కన్నులను భ్రమపఱచగ
నింతులను సేవించుచును నిన్నెంతకును స్మరియించరో
అంతకంతకు నింతలంతలు వింతకోర్కెల నింతులు
పంతగించగ వారికొఱకై సంతరించుచు మరతురో

పరువులిడుచును పదవులకునై మరచెదరు నిను కొందరు
పరులసేవల మునిగితేలుచు మరచెదరు నిని కొందరు
పరమతంబుల బోధనలతో వదలుదురు నిను కొందరు
విరసులై యిటు లెందరెందరొ నరులు బ్రతుకుచుందురు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.