9, నవంబర్ 2022, బుధవారం

ఎత్తులు వేసి నాకోదండరాముని చిత్తుచేయగలేవు

ఎత్తులు వేసి నాకోదండరాముని చిత్తుచేయగలేవు మాయా నా
చిత్తములోనున్న సీతాపతిని నీవెత్తుకుపోలేవు మాయా

కామాది సర్పాలు బుసకొట్టగానె నే కళవళపడనే ఓ మాయా ఆ
కామక్రోధముఖ సర్పాలేమి చేయు రామభక్తులనో మాయా శ్రీ
రాముడే శెషాహిశయనుడౌ వైకుంఠధాముడే ఓ పిచ్చి మాయా ఆ
రాముడే కృపతోడ ఈ నాహృదయమందిరంబున నున్నాడే మాయా

తాపత్రయాగ్నుల దండిగ మండించి దడిపించలేవే ఓ మాయా ఆ
తాపత్రయంబుల  జ్వాలలు చేరవు శ్రీపతిభక్తుల మాయా ఈ
తాపాలు శాపాలు పాపాలు కోపాలు ఏపాటివే పిచ్చి మాయా భవ
తాపాంతకుడు రామచంద్రుడు కొలువైన స్థానంబునే సోక మాయా

పతితపావనుడైన కోదండరాముని భక్తుని హృదయ మోమాయా అది
అతిపవిత్రంబైన హరికోవెలయె గాని యన్యంబు కాదే ఓమాయా అం
దతిశయముగ రామచంద్రు డుండును సీతాపతి యతనితో పిచ్చి మాయా నీ
వతిచేసి చెడవద్దు అతిదూరముగ నుండు టది మంచిదే నీకు మాయా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.