30, నవంబర్ 2022, బుధవారం

కుక్షింభరులమయ్య మేము శ్రీరామ గోవింద గోవింద యనము

కుక్షింభరులమయ్య మేము శ్రీరామ గోవింద గోవింద యనము
శిక్షార్హులము గాదె మేము శ్రీరామ చేయెత్తి గోవింద యనము

పదిమంది మముజూచి నవ్వేరు పొమ్మని భజనల జోలికే పోబోము
పెదవిపై నీనామమే పలుక జనులెల్ల వెంగళు లందురని వెఱచేము 
పదుగురు ప్రాజ్ఞులై ధనము లార్జింతురని వార లాదర్శమని యెంచేము
కుదురుగా నుంచక కాలమ్ము కుదుపుచో కొంచె మప్పుడు నిన్ను తలచేము

ఒకవేళ నెవడైన నీనామ కీర్తన మొనరించితే చూచి నగియేము
ఒకవేళ నెవరైన నిను గూర్చి పలికితే నొకచూపునే చూసి పోయేము
ఒకవేళ యేయాపదో వచ్చి పడితేను యొక్కింతగా నీకు మ్రొక్కేము
ఒక పండుగో పబ్బమో వచ్చెనా భక్తి యుప్పొంగ నీగుడికి వచ్చేము

పుట్టిన దాదిగా పుడకల దాకను బుధ్ధిలో ధనములే‌ తలచేము
గట్టిగా యొకనాడు నారాయణా యని గాఢానురక్తితో ననలేము
పట్టుబట్టి మమ్ము భగవంతుడా నీవె పలికించ వలయునో శ్రీరామ
కొట్టి తిట్టి మమ్ము దారిలో పెట్టరా గోవింద గోవింద యనిపించరా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.