26, నవంబర్ 2022, శనివారం

చేరవే రసనపై శ్రీరామనామమా

చేరవే రసనపై శ్రీరామనామమా 
ఓ రామనామమా నా రామనామమా

అడవిలోన బోయనోట నమరినట్టి నామమా
పడతికి పతిశాపమును బాపినట్టి నామమా
పుడమిపైన ధర్మమును నడపినట్టి నామమా
ఎడబాయక భక్తకోటి నేలునట్టి నామమా

భువనంబుల విస్తరించి పొగడబడెడి నామమా
శివదేవుని రసనపైన చెలువొందెడి నామమా
అవనిజాహృదయములో నలరారెడు నామమా
భవతారకనామ మగుచు పరగుచుండు నామమా

నాదు పురాకృతము వలన నాకు దక్కిన నామమా
ఆదరించి నావేదన లణగద్రొక్కు నామమా
కాదనక దీనుజనుల కనికరించు నామమా
మోదముతో నన్ను చేరి మోక్షమిచ్చు నామమా