4, నవంబర్ 2022, శుక్రవారం

హరినే కీర్తించరే అయ్యలారా

హరినే కీర్తించరే  అయ్యలారా
పరులను కీర్తించే పనియే లేదు
 
కోరితే సిరులన్నీ గోవిందు డిచ్చు గాని
మీరు వాటి కన్యులను కోర నేల 
వారిచ్చు సిరులన్నీ వారికెవ రిచ్చినవో
నారాయణడా సిరికి నాథుడు కాదె

కోరితే మోక్షమది గోవిందు డిచ్చు గాని
మీరు దాని కన్యులను కోర నేల
వారైహికము లేవో ప్రసాదించ గలరేమో
నారాయణుడే యిచ్చు నరులకు ముక్తి
 
శరణన్న వారికెల్ల సర్వసంపదల నీయ
సిరిమగడే రాముడై ధరకు వచ్చె
నరులార వేడరే సిరులైన మోక్షమైన
హరిని మీరు కీర్తించి యన్ని విధముల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.