రామచంద్రునకు విద్యలు నేర్పగ రమణీమణులకు తగవులు కలిగె
భామామణులు తగవులుపడగ రాముడు నవ్వుచు చూచుచు నుండె
ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే పూజలు వ్రతములు
నారాము డివికావు నేర్చుకోవాలే వీరాధివీరుని చేసెడి విద్య
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య
వీరవనితవే కైకమ్మా కడు శూరవనితవే కైకమ్మా
నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే విల్లంబుల విద్య
నారాము డివికావు నేర్చుకోవాలే నరవరేణ్యునిగ చేసెడి విద్య
నేరుపుమీఱగ నేర్పు సుమిత్ర శ్రీరామునకు చాల చక్కని విద్య
చారుశీలవే సుమిత్రా వరనారీమణివే సుమిత్రా
నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే దానాలు ధర్మాలు
నారాము డివికావు నేర్చుకోవాలే ధీరవరిష్టుని చేసెడి విద్య
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య
వారిజాక్షి ఓకైకమ్మా శుభచరితవైన ఓ కైకమ్మా
నీరాముడైతే నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే దండనీతు లెల్ల
నారాము డివికావు నేర్చుకోవాలే దయతో చక్కగ పాలించు విద్య
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు తల్లి చక్కని విద్య
ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే శాస్త్రపాఠములు
నారాము డివికావు నేర్చుకోవాలే శూరకులమ్మెల్ల మెచ్చెడి విద్య
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య
వారిజాక్షి ఓకైకమ్మా శుభచరితవైన ఓ కైకమ్మా
నీరాముడైతే నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే రాజనీతికథలు
నారాము డివికావు నేర్చుకోవాలే ధారుణిపై పేరు నిలిపెడి విద్య
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు తల్లి చక్కని విద్య
ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే ధర్మసూక్షములు
నారాము డివికావు నేర్వాలి చాలా నారాయణు డంతవాడు కావాలే
నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.