30, నవంబర్ 2022, బుధవారం

నీకృప రాదేల నీరజనయన

నీకృప రాదేల నీరజనయన నిన్ను

గా కన్యులను దలప గాదు నాకు


వీని వన్నియు కోతివేషాలు రఘురామ

వీనిపై దయజూప వీడేమి యోగ్యుడు

మానుం డనుచు నేడు మారుతి యన్నాడో

వానరుం డామాట పలుకరాదు కద


పెద్దవారల కెదురు వీడు పల్కును రామ

వద్దయ్య దయచూప వద్దు హీనుండనుచు

పెద్దగా నీతో విభీషణుడు పలుకునో

వద్దనవె యామాట వాడనుట తగునె


శరణ మంటే చాలు మరచి మా తప్పులను

కరుణించు ఘనుడవే మరి యొరుల మాటలను

పరిగణించి విడచు వాడవే కావుగా

ధరణిజా రమణ యిక తాత్సార మేలరా