1, నవంబర్ 2022, మంగళవారం

భగవంతుని శుభనామము పలికే భాగ్యము మనకు కలిగినది

భగవంతుని శుభనామము పలికే భాగ్యము మనకు కలిగినది
జగదీశ్వరుని కరుణను పొందే చక్కని దారియె దొరకినది  
 
కలిలో భగవన్నామస్మరణము కన్నను మార్గము లేదనుచు
పలికెద రార్యులు భగవన్నామము పలుకుట కైనను తత్కృపయే
తొలుత కలుగక పలుకవలయు నని తోచదు నరులకు నేడిటుల
పలుకుచు నుంటిమి భగవన్నామము భాగ్యము కాక మరియేమి

నామస్మరణము కలుషాంతకమని నానాపురాణములు పలుకు
నామస్మరణము శుభకారకమని నరులందరకును నమ్మకము
నామస్మరణము నరకాంతకము నరులకు మోక్షప్రదాయకము
నామస్మరణము చేయుచుంటి మింకేమి భాగ్య మిక కావలెను
 
హరేరామ యని యనుచుంటిమిగా అదృష్టమంటే మనదేగా
హరేకృష్ణ యని యనుచుంటిమిగా అదృష్టమంటే మనదేగా
హరి మనకిచ్చును పరమపదంబని భావించుడు సంశయమేలా
పరాత్పరుని శుభనామము పలికే భాగ్యమె ధరలో భాగ్యముగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.