1, నవంబర్ 2022, మంగళవారం

హరిభజన చేదాము రారే

హరిభజన చేదాము రారే జనులార

      అది కదా తరియించు దారి


కలిగాడి ఆగడా లడగించు దారి

       కమలాక్షుని భజన కాదా జనులార

       కమలాక్షుని భజన కాదా

కలుషమ్ము లన్నటిని తొలగించు దారి

       కమలాపతి భజన కాదా జనులార

       కమలాపతి భజన కాదా

       

క్రోధాధిశత్రువుల కొట్టి తరిమెడు దారి

       గోవిందుని భజన కాదా జనులార

       గోవిందుని భజన కాదా

బాధలన్నీపటాపంచలై చను దారి

       పరమాత్ముని భజన కాదా జనులార

       పరమాత్ముని భజన కాదా


తాపత్రయంబును తగ్గించుటకు దారి

       గోపాలుని భజన కాదా జనులార

       గోపాలుని భజన కాదా

శాపంబులన్నియును శాంతించుటకు దారి

       శ్రీపతి భజనయే కాదా జనులార

       శ్రీపతి భజనయే కాదా


భవసాగరము నీది బయటపడుటకు దారి

       భావింప  హరిభజన కాదా జనులార

       భావింప హరిభజన కాదా

వివరింప హరిజేరి విహరించుటకు దారి

        భువిని శ్రీహరిభజన కాదా జనులార

        భువిని శ్రీహరిభజన కాదా


శ్రీరమారమణ యని శ్రీనివాసా యని

        చేయరే హరిభజన నేడే జనులార

        చేయరే హరిభజన నేడే

శ్రీరామరామ యని శ్రీకృష్ణకృష్ణ యని

        చేయరే హరిభజన నేడే జనులార

        చేయరే హరిభజన నేడే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.