17, నవంబర్ 2022, గురువారం

భయమేల శ్రీరామభద్రుని గుడిచిలుక

భయమేల శ్రీరామభద్రుని గుడిచిలుక
భయమేలనే నీకు చిలుకా

రామచంద్రయ్య నిను రక్షించు చున్నాడే 
    ఏమీ భయములేదు చిలుకా నీ
    కేమీ భయములేదు చిలుకా
ఏమీ  భయములేదు ఈరాము డుండగ
   ఎవడే కొట్టేవాడు చిలుకా ని
   న్నెవడే కొట్టేవాడు చిలుకా

ఏవేటకాడు వచ్చి ఏబుట్టలో పెట్టి
     ఎట్లా గెత్తుకుపోవు చిలుకా ని
     న్నెట్లా గెత్తుకుపోవు చిలుకా
నీవేమొ రామయ్య గుడిగూటి లోపలను
      నిక్షేపముగ నుండ చిలుకా యిక
      నీకేమి భయమే చిలుకా

భోగాశతో నీవు పోయేవొ గుడివిడిచి
      పోగాలమే నీకు చిలుకా అది
      పోగాలమే నీకు చిలుకా
ఈగూటినే విడిచి ఈకొమ్మ కాకొమ్భ
      కెగురకుంటే చాలు చిలుకా నీ
      వెగురకుంటే చాలు చిలుకా

కాలుడైతే నేమి గీలుడైతే నేమి
     ఏలాగు నినుబట్టు చిలుకా వా
     డేలాగు నినుబట్టు చిలుకా
వాలయముగ రామభద్రుని గుడిలోన
     భద్రంబుగా నున్న చిలుకా బహు
     భద్రంబుగా నున్న చిలుకా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.