30, నవంబర్ 2022, బుధవారం

జానకీమనోహరునకు మ్రొక్కని వాని నరజన్మ మేల

సకలలోకములు లేలు జానకీమనోహరు
నకు మ్రొక్కని వాని నరజన్మ మేల

నరజన్మ మెత్తి సంబరపడ నేమిటికి
హరిభక్తి లేకున్న నాజన్మ మెందుకు
నిరతంబును కుక్షింభరుడైన మనుజుడు
పురుగు వంటివాడెపో నేలపై వాడు
 
కల్ల దైవంబుల కాళ్ళ మ్రొక్కుటయును
కల్లగురువుల బోధకఱచి చెడుటయును
గుల్లజేయగ తనువు కల్లజేయగ బ్రతుకు
తల్లడిల్లును గాని తరియించగా లేడు

శ్రీరామ యనకుండ నారాటములు పోవు
శ్రీరామ యనకుండ చిత్తశాంతి లేదు
శ్రీరామ యనక సంసారము వెడలడు
శ్రీరామ నామమే చింతించ వలయును