7, నవంబర్ 2022, సోమవారం

పలుకరే హరినామము ప్రజలారా మీరు

పలుకరే హరినామము ప్రజలారా మీరు
కులుకుచు తిరుగుటలు చాలు కువలయంబున

పుడమిని తిని యురక మీ పొట్టలను పెంచుచులో
విడువక భామినుల వెంటవెంట తిరిగి యాడుటలో
గడిపినచో కాలమెల్ల గడచుటెట్లు భవవార్నిధి
విడువక హరిభక్తి మీరు కడు నిష్ఠతో నిక

పలుకరె యీ హరికంటెను బంధు వెవ్వ డున్నాడని
పలుకరె యీ హరికంటెను ప్రాణమిత్రు డెవ్వడని
పలుకరె యీ హరికంటెను లేడధికు డొక్కడని
పలుకరే యీ హరియే పరమపూరుషుడని

పలుకరె శ్రీరామ యని పలుకరె శ్రీకృష్ణ యని
పలుకరె శ్రీధర యని పలుకరె గోవింద యని
పలుకరె పాపాంధకార భాస్కరా హరి యని
పలుకరే జగన్నాథ పాహి పాహి పాహి యని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.