1, నవంబర్ 2022, మంగళవారం

మ్రొక్కేము మ్రొక్కేమురా దేవుడా

మ్రొక్కేము మ్రొక్కేమురా దేవుడా నీకు 
            మ్రొక్కేమురా స్వామి మారాముడా
            

ఎల్లవేళలను మాపిల్లలను పాపల
             చల్లగ జూచుచు నుండేవురా
ఇళ్ళువాకిళ్ళను బంధుబలగమును కో
             కొల్లలుగ దయచేయుచున్నావురా

భోగభాగ్యములు మాకిచ్చేవురా మంచి
             బుధ్ధిని నీవు మాకిచ్చేవురా
రోగాలు రొచ్చులు లేకుండగా ఆ
              రోగ్యభాగ్యము కూడ నిచ్చేవురా

నీపైన భక్తిని నిండించి మాలోన
          నీవారిగా చేసుకున్నావురా
కాపుండి మాకెపుడు కష్టాలు రాకుండ
          కరుణతో మమ్మేలు చున్నావురా

శ్రీరామ యన్నాక చింతలే యుండవని
      నోరార నీపేరు పలికేమురా
శ్రీరామనామమే తారకనామమని
       చిత్తశుధ్ధిగ నమ్ముచున్నామురా

ఉదయమైనది మొదలు పడక నెక్కేదాక
          వదలక నీపేరు తలచేమురా
 వదలక నీపేరు నిదురలో నైనను
           పలుమారులే కలువరించేమురా

మాయిండ్లలో నీవు మరువక కొలువుండి
         మానోళ్ళలో నీనామమే కొలువుండి
మాయదారి మయ మమ్మంటుకొన కుండి
         నీయాన మేము తరియించేమురా