11, నవంబర్ 2022, శుక్రవారం

శ్రీరామ నామస్మరణ మీరేల చేయరు

శ్రీరామ నామస్మరణ మీరేల చేయరు సం
సారము తరియింప చక్కని మార్గమే
 
మారుని స్నేహము మరిగి మానితిరో ని
స్సారదుర్మతప్రచారప్రభావని
వారితులై వదలి భ్రష్టులైనారో 
శ్రీరాముని మరచి చెడిపోవుచున్నారు

కాసుల వేటలో కాలము గడపుచు ను
దాసీనులై హరిని తలచుట మానుచో
సంసారమును దాటు చక్కని పడవను
కాసులు కొనిపెట్టగాలేవు తెలియుడు

తనువు శాశ్వతమని తలపోయుచున్నారో యీ
తనువన్న చాలరంధ్రములున్న పడవయే
మునుగుట తధ్యమ్ము మునుకొని హరినామ
మును పడవగా చేసికొవలె తెలియుడు