తగదు తగదు రాఘవ నగుమోము నిటుదాచ తగదు నీకిది రాఘవ
శ్రీకర రామ సుధాకరోపమవదన నాకేల నీదయ రాకుండు నీవేళ
నీకు భక్తుడ నగుచు నిన్నే నమ్మియుండ నాకు ప్రసన్నుడవు గాకుందు వీవేళ
సాకేతాధిప రామ సమరరంగ భీమ సద్భక్తునకు మోము దాచుట యీవేళ
నీకన్య మెఱుగని సేవకుండను నేను లోకవార్తలు తెలుప నరుగుదెంచిన వేళ
గిరిజేశ వినుతుడవు పురుషోత్తముడ వీవు మరి నీదు భక్తుని మన్నింప వీవేళ
పరమాత్ముడవు నీవు పతితపావనుడవు ప్రభు నీదు భక్తుని మన్నింప వీవేళ
దరిజేరి నిలచితిని దాసానుదాసుడను దయమాలి నీమోము దాచుట యీవేళ
అరకొర దరిసెన మిదియేమి మరియాద నరనాథ నీమోము దాచుట యీవేళ
నీనామస్మరణంబు వదలకుండెడు నేను నీకరుణనే కోరి నిలచియుండిన వేళ
నీమ్రోల వినయముగ నిన్ను కీర్తించుచు నీభక్తుడను నేను నిలచి యుండిన వేళ
ఆనందముగ నీవు పలుకరించెద వనెడు నాశతో నీముందు నేనున్న శుభవేళ
కరిరాజ వరదుడవు కరుణాలవాలుడవు సరసత నిజభక్తు మన్నింప వీవేళ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.