25, జులై 2021, ఆదివారం

కొండలతో ఆటలాడు గొప్పవాడు వీడు

కొండలతో ఆటలాడు గొప్పవాడు వీడు
కొండలంత ఆపదలైన గోటమీటు వాడు

మునిగిపోవు కొండనరసి మొత్తుకొను సురాసురుల
కనులజూచి నవ్వుకొనుచు కమఠమై వీడు
తనవీపున పెనుకొండను దాల్చినాడే
మనవాని బలమునెన్న మాటలున్నవే

పెద్దచిన్న కొండలన్ని వీనిపేరు విన్నంతనే
ముద్దుముద్దుగా నొదిగిపోయెనే వెన్న
ముద్దలట్లు కపుల హస్తములను రాముడు
ముద్దరాలికై సాగరమును కట్టువేళ

వానకాదు రాళ్ళవాన వచ్చి మీదపడిన వేళ
తాను కొనగోటను గిరిని దాల్ఛెనే వీడు
వీని యండనున్న చాలు విచ్చిపోవును
కాని సోకదే భక్తుని కష్టమెన్నడు