30, నవంబర్ 2022, బుధవారం

శ్రీమద్దశరధనందనా హరి

శ్రీమద్దశరధనందనా హరి 
నా మనవి విన వేమయ్యా

నోరారా శ్రీరామా యని నే నుడివిన నవ్వును పరిజనము
కూరిమితో నిను కీర్తించినను గొణిగెద రేమీ రొదయనుచు
కారుణ్యాలయ ఇట్టి బ్రతుకు నే కోరనురా శ్రీరఘురామా
దారిచూపమని వేడుచు నున్నను దయచూపవురా యిదియేమి

ఊహలపల్లకి నూపే యాశల యూడల నెపుడో కోసితిని
దాహము లేదే భోగంబులపై తమకము లేదీ ధరపైన
మోహము లేదీ తనువు పైన మరి పుట్టగ ముచ్ఛటయును లేదు
శ్రీహరి ఈసంసారము చాలును చేయిందించర రామయ్యా




రాముని పొగడెడు చోటునుండి రవ్వంతదూరము జరుగకుము

రాముడు చులకన యగు చోట రవ్వంతసేపును నిలువకుము
రాముని పొగడెడు చోటునుండి రవ్వంతదూరము జరుగకుము

రాముని కాదని రావణు పొగడెడు రాకాసులతో దూరము నెఱపుము
రాముని తప్పులు వెదకుచు పలికెడు పాపాత్ములతో స్నేహము విడువుము
రాముడు లేనే లేడని పలికే రాలుగాయిలకు దూరము నిలువుము
రాముని కన్యుల నెంచుచు పలికే పామరజనులను చేరక యుండుము

ఎవరికి రాముడు నారాయణుడో భువిని వాడెపో సజ్జనుడు
ఎవరికి రాముడు ప్రాణాధికుడో భువిని వాడెపో యుత్తముడు
ఎవరికి రాముడు పతియును గతియో భవిని వాడెపో భక్తుండు
ఎవరికి రాముడు తనవా డగునో భువిని వాడెపో నీవాడు


కుక్షింభరులమయ్య మేము శ్రీరామ గోవింద గోవింద యనము

కుక్షింభరులమయ్య మేము శ్రీరామ గోవింద గోవింద యనము
శిక్షార్హులము గాదె మేము శ్రీరామ చేయెత్తి గోవింద యనము

పదిమంది మముజూచి నవ్వేరు పొమ్మని భజనల జోలికే పోబోము
పెదవిపై నీనామమే పలుక జనులెల్ల వెంగళు లందురని వెఱచేము 
పదుగురు ప్రాజ్ఞులై ధనము లార్జింతురని వార లాదర్శమని యెంచేము
కుదురుగా నుంచక కాలమ్ము కుదుపుచో కొంచె మప్పుడు నిన్ను తలచేము

ఒకవేళ నెవడైన నీనామ కీర్తన మొనరించితే చూచి నగియేము
ఒకవేళ నెవరైన నిను గూర్చి పలికితే నొకచూపునే చూసి పోయేము
ఒకవేళ యేయాపదో వచ్చి పడితేను యొక్కింతగా నీకు మ్రొక్కేము
ఒక పండుగో పబ్బమో వచ్చెనా భక్తి యుప్పొంగ నీగుడికి వచ్చేము

పుట్టిన దాదిగా పుడకల దాకను బుధ్ధిలో ధనములే‌ తలచేము
గట్టిగా యొకనాడు నారాయణా యని గాఢానురక్తితో ననలేము
పట్టుబట్టి మమ్ము భగవంతుడా నీవె పలికించ వలయునో శ్రీరామ
కొట్టి తిట్టి మమ్ము దారిలో పెట్టరా గోవింద గోవింద యనిపించరా


జానకీమనోహరునకు మ్రొక్కని వాని నరజన్మ మేల

సకలలోకములు లేలు జానకీమనోహరు
నకు మ్రొక్కని వాని నరజన్మ మేల

నరజన్మ మెత్తి సంబరపడ నేమిటికి
హరిభక్తి లేకున్న నాజన్మ మెందుకు
నిరతంబును కుక్షింభరుడైన మనుజుడు
పురుగు వంటివాడెపో నేలపై వాడు
 
కల్ల దైవంబుల కాళ్ళ మ్రొక్కుటయును
కల్లగురువుల బోధకఱచి చెడుటయును
గుల్లజేయగ తనువు కల్లజేయగ బ్రతుకు
తల్లడిల్లును గాని తరియించగా లేడు

శ్రీరామ యనకుండ నారాటములు పోవు
శ్రీరామ యనకుండ చిత్తశాంతి లేదు
శ్రీరామ యనక సంసారము వెడలడు
శ్రీరామ నామమే చింతించ వలయును

 

నీకృప రాదేల నీరజనయన

నీకృప రాదేల నీరజనయన నిన్ను

గా కన్యులను దలప గాదు నాకు


వీని వన్నియు కోతివేషాలు రఘురామ

వీనిపై దయజూప వీడేమి యోగ్యుడు

మానుం డనుచు నేడు మారుతి యన్నాడో

వానరుం డామాట పలుకరాదు కద


పెద్దవారల కెదురు వీడు పల్కును రామ

వద్దయ్య దయచూప వద్దు హీనుండనుచు

పెద్దగా నీతో విభీషణుడు పలుకునో

వద్దనవె యామాట వాడనుట తగునె


శరణ మంటే చాలు మరచి మా తప్పులను

కరుణించు ఘనుడవే మరి యొరుల మాటలను

పరిగణించి విడచు వాడవే కావుగా

ధరణిజా రమణ యిక తాత్సార మేలరా



29, నవంబర్ 2022, మంగళవారం

దశరథసుతుడగు శ్రీరామునిగా

దశరథసుతుడగు శ్రీరామునిగా ధరపై శ్రీహరి ప్రభవించె

విరించి మొఱవిని పులస్త్యు మనుమని దురాగతమ్ముల నరికట్ట

బ్రహ్మవరంబుల బరితెగియించిన రావణు విజృంభణ మాప

యజ్ఞరక్షకుడు మునిపుంగవుల యజ్ఞయాగములు కాపాడ

మునిశాపంబున తనవాడే దైత్యునిగా నుండుట గమనించి

అనరణ్యుడు రావణున కొసంగిన ఘనశాపమును పండింప

తన పాదంబుల స్పర్శను గోరెడు మునిసతి తపమును పండింప

తన రాకకునై యెదురుచూచెడు ముని శ్రమణికపై దయగలిగి

హనుమగ శివుడు ధరపై.వెలసి తనకై వేచుట గమనించి

భవతారకమగు సులభమంత్రమును భక్తకోటి కీయగ నెంచి


రేపుమా పనకుండ రామా

రేపుమా పనకుండ రామా నీస్మరణ 
    ప్రియమార చేసెద నేడు


ఉన్నపాటున మృత్యువాలింగనము చేయు
    చున్నపుడు నీస్మరణ మెట్లు


కఫవాతపిత్తములు చనువేళ కంఠమున్
   క్రమ్మగా నీస్మ‌రణ మెట్లు


పోగాలమున దేహబాధ లధికంబైన 
    పొంగుచు నీస్మ‌రణ మెట్లు


చనువేళ చిత్తచాంచల్యంబు గలుగుచో 
    చక్కగా నీస్మ‌రణ మెట్లు


నిదురలో ప్రాణముల్ నిష్క్రమించెడు నెడల 
    నిండార నీస్మ‌రణ మెట్లు


స్పృహలేని స్థితిలోన ప్రాణముల్ దేహంబు 
    విడుచుచో నీస్మరణ మెట్లు


27, నవంబర్ 2022, ఆదివారం

మా కేమీయడు రాముడు

మా కేమీయడు రాముడు మహనీయగుణధాముడు

మణులు మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు మాకీయడే రాముడు

నౌకర్లు చాకర్లు కోలాహలంబుగ మాకీయడే రాముడు

లోకోత్తమములైన భోగాలు భాగ్యాలు మాకీయడే రాముడు

లోకసన్నుత మైన విద్యావివేకాలు మాకీయడే రాముడు

ప్రాకారములు గల భవనాలు పురములును మాకీయడే రాముడు

చేకొని రాజ్యాలనేలు సామర్ధ్యంబు మాకీయడే రాముడు

మాకేల నివియనుచుమ మోక్షమే యిమ్మంటె మాకీయడే రాముడు


నమ్మికొలిచెడు నాజీవనమును నడపు రామనామం

నమ్మికొలిచెడు నాజీవనమును నడపు రామనామం


పాపతి‌మిరసంహారసూర్యక‌రస్పర్శ రామనామం

పాపాటవులను తగులబెట్టు దావాగ్ని రామనామం


భీకరభవవారాన్నిధితారణనౌక రామనామం

శ్రీకంఠాది మహానుభావులు చేయు రామనామం


గర్వితదానవదర్పాపహరణకారి రామనామం

సర్వవిధంబుల సుజనకోటిని సాకు రామనామం


శ్రీయుర్వీసుతప్రాణనాదమై చెలగు రామనామం

వాయుసూనువిభీషణు లెంతో వలచు రామనామం

26, నవంబర్ 2022, శనివారం

చేరవే రసనపై శ్రీరామనామమా

చేరవే రసనపై శ్రీరామనామమా 
ఓ రామనామమా నా రామనామమా

అడవిలోన బోయనోట నమరినట్టి నామమా
పడతికి పతిశాపమును బాపినట్టి నామమా
పుడమిపైన ధర్మమును నడపినట్టి నామమా
ఎడబాయక భక్తకోటి నేలునట్టి నామమా

భువనంబుల విస్తరించి పొగడబడెడి నామమా
శివదేవుని రసనపైన చెలువొందెడి నామమా
అవనిజాహృదయములో నలరారెడు నామమా
భవతారకనామ మగుచు పరగుచుండు నామమా

నాదు పురాకృతము వలన నాకు దక్కిన నామమా
ఆదరించి నావేదన లణగద్రొక్కు నామమా
కాదనక దీనుజనుల కనికరించు నామమా
మోదముతో నన్ను చేరి మోక్షమిచ్చు నామమా

బ్రహ్మానందమె రామనామ మని పాడవె ఓమనసా

బ్రహ్మానందమె రామనామ మని పాడవె ఓమనసా
బ్రహ్మజనకుడే మారాముడని పాడవె ఓ మనసా

శ్రితజనపోషకు డీరాముడని చెప్పవె ఓ మనసా
అతిబలవంతుడు హరి రాముడని అనవే ఓ మనసా
ప్రతివీరుడు మారామున కెవడని పాడవె ఓ మనసా
పతితపావనుడు మారాముడని పాడవె ఓ మనసా

జగదీశ్వరుడని రాముని నిత్యము పొగడవె ఓ మనసా
నగధరుడగు హరి మారాముడని పొగడవె ఓ మనసా
నిగమము లీతని నిశ్వాసమ లని పొగడవె ఓ మనసా
నిగమాంతప్రతిపాద్యబ్రహ్మ మని పొగడవె ఓ మనసా

ధరాసుతాపతి భవతారకుడని పాడవె ఓ మనసా
తరచుగ మదిలో రామనామమే తలచవె ఓ మనసా
పరమాత్ముడె మారామచంద్రు డని పాడవె ఓ మనవే
హరి మారాముడె ఆత్మబంధువని అనవే ఓ మనసా


24, నవంబర్ 2022, గురువారం

మారాడవేమిరా మంగళనామా

ధారాధరశ్యామా దశరథరామా

మారాడవేమిరా మంగళనామా


నీనామరూపములను నేను తలపనా

నీనామవైభవమును నేను పాడనా

నీనామసుధారసము నేను గ్రోలనా

దేనికిరా నీయలుక  దీనబాంధవా


నీభక్తజనుల కథలు నేను మెచ్చనా

నీభక్తజనుల తోడ నేను చేరనా

నీభక్తుల నొకడనై నేను నిలువనా

శోభించదు నీకలుక చూడవయ్యా


తిరిగి చూడవేమని తిట్టుకొంటినా

కరుణలేదు నీకని కసురుకొంటినా

వరములీయ వేమని పలికియుంటినా

పరమపురుష యీయలుక పాడిగాదురా



శ్రీరాముని శుభనామం

ఊరు మిక్కిలిగ మెచ్చిన నామం

నోరు మిక్కిలిగ మెచ్చిన నామం

దారిని చక్కగ చూపే నామం

శ్రీరాముని శుభనామం


భక్తిమార్గమున నడిపే నామం

ముక్తి ద్వారమును తెరిచే నామం

శక్తియుక్తుల నిచ్చే  నామం

రక్తిని గొలిపే రామనామం


శాపాలన్నీ తీర్చే నామం

తాపాలను తొలగించే నామం

పాపాటవులను కాల్చే నామం

తాపసహితమౌ రామనామం


రాతిని నాతిని చేసిన నామం

కోతిని బ్రహ్మను చేసిన నామం

ఆపశుపతి కడు మెచ్చిన నామం

శ్రీపతినామం రామనామం



23, నవంబర్ 2022, బుధవారం

నీలమేఘశ్యాముని నీవెఱుగవా

బాలేందుశేఖరుడు పొగడునట్టి రాముని

నీలమేఘశ్యాముని నీవెఱుగవా


రాము డేలిన గడ్డఫై ప్రభవించియును నీవు

రామునే యెఱుగనన రాదు కదరా

రాముని దేవుడని ప్రతివాడును పొగడునే

రామునే తెలియకుండ రాదు కదరా


మాయదారి గురువుల మాటలు నమ్మితివా

మాయదారి చదువుల మైకమబ్బెనా

మాయదారి కుమతముల మత్తులోన పడితివా

మాయనుదాటించు హరి మాట నెఱుగవు


ఇకనైకను కళ్ళుతెఱచి యెఱిగికొనుము రాముని

ప్రకటించుము సద్భక్తిని బాగుపడెదవు

సకలేశ్వరుని హరిని శరణము వేడకయే

ఒక జీవుడు తరియించుట యుండదయ్యా



21, నవంబర్ 2022, సోమవారం

స్మరణీయం శ్రీహరినామం

 


స్మరణీయం శ్రీహరినామం వి

స్మరణీయం స్మరనామం


సత్యాన్వేషణ సలిపెడు వారికి

సత్సాంగత్యము చాలను వారికి

ధర్మము మేలని దలచెడు వారికి

దైవము నెదలో దలచెడు వారికి

ఇహసౌఖ్యంబుల నెంచని వారికి

కలిమాయలపై కలబడు వారికి

మోక్షార్ధులగు బుధ్ధిమంతులకు

భవతారకమై పరగెడు నామం

శ్రీరఘురాముని చిన్మయనామం


శతకోటి వందనాలు

శతకోటి వందనాలు జానకీమాతకు

శతకోటి వందనాలు జానకీవిభునకు


వందనాలు జగదేకవంద్యకు మాజననికి

వందనాలు జగదేకవంద్యుడు మావిభునకు

వందనాలు భక్తలోకపాలకులకు వందనాలు

వందనాలు క్షిప్రవరప్రసాదులకు వందనాలు


హరిసేవాపరాయణు లందరకు వందనాలు

హరిస్మరణానందులకు వందనాలు వందనాలు

హరిభక్తిప్రచారకు లందరకు వందనాలు

హరిపూజలు చేయువార లందరకు వందనాలు


వందనాలు హరినిపొగడు బ్లహ్మాదిదేవతలకు

వందనాలు హనుమదాది భాగవతోత్తములకు

వందనాలు రఘురాముని భక్తులకు వందనాలు

వందనాలు హరతత్త్వము భావించు విబుధులకు


రామపాదములను విడువరాదే బుధ్ధీ

రామపాదములను విడువరాదే బుధ్ధీ శ్రీ

రామున కన్యమును తలపరాదే బుధ్ధీ


పతితపావనుడు వాడు భగవంతుడే బుధ్ధీ

వ్రతముగా సేవింపు మతని పాదాబ్జములు


భూమిజనుల సేవించుచు చెడిపోకే బుధ్ధీ

పామరులను సేవించుట యన పాపమే కద


శివుడు బ్రహ్మేంద్రాదులు పొగడు చిన్మయు బుధ్ధీ

సవినయముగ సేవించవలె చక్కగ నీవు


హనుమదాదుల సేవలందు హరినే బుధ్ధీ

క్షణము విడువక సేవింపవలె చక్కగ నీవు


ఇంతకన్న హితములేదే యిలలో బుధ్ధీ

చెంతనున్న నారాయణుని సేవించవలె


భవతారకము రామపాదద్వయమే బుధ్ధీ

భవబంధకరము లన్యవస్తువులు మనకు



19, నవంబర్ 2022, శనివారం

కొండనెత్తెను గోవిందుడు

కొండనెత్తెను గోవిందుడు కను

పండువ చేసె గోవిందుడు


మునిగెడు గిరిని మూపున దాల్చెను

పెనుతాబేలై గోవిందుడు

కనుగొన గిరి కొమ్మునను తానే

మొనకెక్కె నిదే ముకుందుడు


జనులను గోవుల సంరక్షించగ

కొనగోట నిదే గోవిందుడు

మునుకొని గోవర్ధన మెత్తెనుగా

మునుపటి వలెనే ముకుందుడు


కొండల వలె నాకుండు కష్టములు

బెండులు కావా వెన్నునకు

అండ గాక కోదండరాము డను

మొండి యయ్యెనే ముకుందండు


18, నవంబర్ 2022, శుక్రవారం

రావణు డక్కడ రాము డిక్కడ

రావణు డక్కడ రాము డిక్కడ యిక

రావణుని చంపెడు దేవు డెక్కడ


పట్టమును గట్టుకొని బంగారుగద్దెపై

పట్టమహిషి ధరణిజ ప్రక్కన మెఱయ

పట్టుపీతాంబరము గట్టి రాము డుండిన

వట్టిదే రావణుని వధియించుట


మునివేషధారియై వనములలో జొరబడి

ధనదుని తమ్మునిపై దాడిచేయు నని

మును నీవు చెప్పనది ముదుసలి బ్రహ్మయ్యా

కనుగొన వట్టిమాట యనిరి సురలు


తప్పునా హరిమాట తప్పునా నావ్రాత

తప్పకుండ దాశరథి తరలును వనికి

కుప్పలుగ రక్కసుల గూల్చు రావణుజంపు

తప్పదనుచు పలికె తా బ్రహ్మయ్య



రామనామము నిన్ను రక్షించును

రామనామము నిన్ను రక్షించును శ్రీ

రామనామమె నిన్ను రక్షించును


కామాదిరిపులపై ఖడ్గమ్ము జళిపించి

తామసత్వవ్యాధి ధాటిని తగ్గించి

ప్రేమతో దుష్కర్మపీడ లడగించి

ఆముష్మికముఫైన ననురక్తి కలిగించి


భవచక్రఖండనపారీణమై యొప్పి

భవవార్ధిదాటించు పడవయై యొప్పి

భవరోగశమన దివ్యౌషధంబై యొప్పి

భవలతల్ కోయు కరవాలమై యొప్పి


కలిసర్పవిష మూడ్చు గట్టిమంత్రం బగుచు

వెలలేని సుఖమిచ్చు వేదమంత్రం బగుచు

బలవృధ్ధి కలిగించు భవ్యమంత్రం బగుచు

జలజాక్షు దరిజేర్చు సత్యమంత్రం బగుచు


రామనామమున రుచికలుగుటకు

 రామనామమన రుచికలుగుటకు ప్రాప్త ముండవలెను


ప్రాప్తమున్న దొక శప్తవనితకు రామనామమున రుచికలిగె

ప్రాప్తమున్న దొక బోయవానికి రామనామమున రుచికలిగె

ప్రాప్తమున్న దొక కోయవనితకు రామనామమున రుచికలిగె

ప్రాప్తమున్న దొక వానరమునకు రామనామమున రుచికలిగె


ప్రాప్తములేదా సిరు లెన్నున్నను రామనామమున రుచిలేదు

ప్రాప్తములేదా చదు వెంతున్నను రామనామమున రుచిలేదు

ప్రాప్తములేదా ప్రజ్ఞలు గలిగియు రామనామమున రుచిలేదు

ప్రాప్తములేదా వేదాంతికియును రామనామమున రుచిలేదు


రామనామమున రుచికలుగుటకు నేమి చేయవలె నెవడెఱుగు

ఏమి దానములు నేమి ధర్మముల నెంతచేసిన రుచికలుగు

రామనామమున రుచికలుగుటకు రాముని దయయే కారణము

రామునిదయ సంప్రాప్తంబైన రామనామమున రుచికలుగు


17, నవంబర్ 2022, గురువారం

మధురమధురమౌ రామనామం

మధురమధురమౌ రామనామం మదిలో దలచండీ


విధిగా మీరీ రామనామం విడువక చేయండీ

సదమలమగు ఈ రామనామం చక్కగ చేయండీ

బుధజనహితమౌ రామనామం పొంగుచు చేయండీ

నిధులకునిధియౌ రామనామం నిక్కుచు చేయండీ

మేలొనరించే రామనామం మీరు మరువకండీ

కాలాతీతము రామనామం చాలు మాకనండీ

ప్రొణాధికమీ రామనామం వదలబో మనండీ

బ్రహ్మానందం రామనామం వదలబో మనండీ

ప్రణవం తానే రామనామం వదలబో మనండీ

కథలను నిండిన రామనామం ఘనముగ చాటండీ

విధిశంకరనుత రామనామం విరివిగ చాటండీ

అందరు మెచ్చగ రామనామం అవనిని చాటండీ

భవహరమని ఈ రామనామం.ప్రజలకు చాటండీ



హే రామ పౌలస్త్యమృగసింహ

హే రామ పౌలస్త్యమృగసింహ

నారాయణాచ్యుత నరసింహ


నీలమేఘశ్యామ నిరుపమాకార కరు

ణాలవాల యోగిరాజసంపూజ్య


ఘోరపాతకవన క్రూరకుఠార సం

సారపారావార తారణనౌక


నిగమాంతసంవేద్య నిస్తులతత్త్వ ప

న్నగరాజపర్యంక జగదేకశరణ


దానవవిషవనదహనదావాగ్ని ముని

మానసకాసార విహరణహంస


భర్గశక్రవిరించిభావితభావ అప

వర్గప్రద విశ్వవందితచరణ


పరికల్పితానేకబ్రహ్మాండభాండ శ్రీ

ధరణీజాహృద్గగనపరిలసచ్చంద్ర


భయమేల శ్రీరామభద్రుని గుడిచిలుక

భయమేల శ్రీరామభద్రుని గుడిచిలుక
భయమేలనే నీకు చిలుకా

రామచంద్రయ్య నిను రక్షించు చున్నాడే 
    ఏమీ భయములేదు చిలుకా నీ
    కేమీ భయములేదు చిలుకా
ఏమీ  భయములేదు ఈరాము డుండగ
   ఎవడే కొట్టేవాడు చిలుకా ని
   న్నెవడే కొట్టేవాడు చిలుకా

ఏవేటకాడు వచ్చి ఏబుట్టలో పెట్టి
     ఎట్లా గెత్తుకుపోవు చిలుకా ని
     న్నెట్లా గెత్తుకుపోవు చిలుకా
నీవేమొ రామయ్య గుడిగూటి లోపలను
      నిక్షేపముగ నుండ చిలుకా యిక
      నీకేమి భయమే చిలుకా

భోగాశతో నీవు పోయేవొ గుడివిడిచి
      పోగాలమే నీకు చిలుకా అది
      పోగాలమే నీకు చిలుకా
ఈగూటినే విడిచి ఈకొమ్మ కాకొమ్భ
      కెగురకుంటే చాలు చిలుకా నీ
      వెగురకుంటే చాలు చిలుకా

కాలుడైతే నేమి గీలుడైతే నేమి
     ఏలాగు నినుబట్టు చిలుకా వా
     డేలాగు నినుబట్టు చిలుకా
వాలయముగ రామభద్రుని గుడిలోన
     భద్రంబుగా నున్న చిలుకా బహు
     భద్రంబుగా నున్న చిలుకా

16, నవంబర్ 2022, బుధవారం

నరసింహ శ్రీరామ

నరసింహ శ్రీరామ నారాయణాచ్యుత

కరివరదా నను కావవయా


పరమేశ జగదీశ బ్రహ్మాండాధిప

తరణికులోద్భవ ధర్మావతార

ధరణీసుతావర దశముఖవిదార

కరుణించరా నన్ను ఘనశ్యామా


దాసపోషక దైత్యదమన రఘువీర

వాసవాదిసురనుత భాసురవిక్రమ

నీసరి వారెవ్వరు నీరేజాక్షణ

గాసిల్లుచుంటిరా ఘనశ్యామా


జయరామ శ్రీరామ జానకీరామ

భయవిదారక రామ పావననామ

రయమున నన్నేల రావేమి రామ

దయచూప వేలరా దశరథరామ



నీనామమే మందురా

నీనామమే మందురా నిజము భవరోగమునకు 

నీరూపమే విందురా నిజము రెండుకన్నులకు


నీనామరూపములే నిరుపమానములు రామ

నీనామరూపములే నిత్యసత్యములు పృథివి

నీనామరూపములే నిత్యమఖిల జగములేలు

నీనామరూపములే నిత్యానందములు నాకు


నీనామరూపములే ధ్యానించు యోగిగణము

నీనామరూపములే ధ్యానించు సదాశివుడు

నీనామరూపములే ధ్యానించు వాయుసుతుడు

నీనామరూపములే మానక నన్నేలు రామ


నీనామరూపములే దీనకల్పవృక్షములు

నీనామరూపములే జ్ఞానులకు సర్వస్వము

నీనామరూపములే నిర్మోహులు మోహింతురు

నీనామరూపములే జానకీశ నేసేవింతు



రామనామము పలుకనీ

రామనామము పలుకనీ ప్రతిచోట ప్రతినోట

రామభజనలు సాగనీ ప్రతియింట ప్రతిపూట


జయజయ శ్రీరామ జగదభిరామ యని

జయజయ రఘురామ జానకిరామ యని

జయజయ రమణీయశాంతవిగ్రహ యని

జయజయ మమ్మేలు స్వామి రామా యని


జయజయ శ్రీరామ జననుతచరిత యని

జయజయ విశ్వేశ సాకేతరామ యని

జయజయ జగదేక సత్యవిక్రమ యని

జయజయ మారామచంద్ర మహాత్మ యని


జయజయ శ్రీరామ జయజయ దేవ యని

జయజయ సర్వేశ జయజయ రామ యని

జయజయ లోకేశ జయము.శ్రీహరి యని

జయజయ పరమాత్మ సదానందా యని



శ్రీరామనామమే కలివారకం

శ్రీరామనామమే కలివారకం శ్రీరామనామమే భవతారకం

శ్రీరామనామమే మనకు స్మరవారకం శ్రీరామనామమే మనకు శుభకారకం

శ్రీరామనామమే సకలభయవారకం శ్రీరామనామమే నిత్యజయకారకు

శ్రీరామనామమే ఐశ్వర్యకారకం శ్రీరామనామమే అభివృధ్ధికారకం

శ్రీరామనామమే చిత్తశాంతిప్రదం శ్రీరామనామమే క్షిప్రవరదాయకం

శ్రీరామనామమే కరుణాప్రవాహం శ్రీరామనామమే సౌఖ్యప్రవాహం

శ్రీరామనామమే పరమం పవిత్రం శ్రీరామనామమే దుష్కృతలవిత్రం

శ్రీరామనామమ రక్తిముక్తిఫ్రదం శ్రీరామనామమే సత్యస్వరూపం

శ్రీరామనామమే మనకు దివ్యౌషధం శ్రీరామనామమే మనకు సర్వస్వం


శ్రీరామ యనరా

శ్రీరామ యనరా శ్రీరామ యనరా 

     శ్రీరాము డీయనన్నది లేదురా


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు నానందము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు నారోగ్యము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు నైశ్వర్యము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చురా విజయము


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు పరివారము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు రాజ్యమ్ములు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు భోగమ్ములు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చురా పూజ్యత


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు సత్కీర్తిని

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు సర్వస్వము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు నాయుష్యము

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరా 

    ఆరాముడే యిచ్చు నపవర్గము

నీవెంత చేసితివి చూడూ

నీవెంత చేసితివి చూడూ లంకేశ 

    నీలంక యిక వల్లకాడు

నీవెంత అరచినా చూడూ ఓసీత 

    నీరాము డిచ్చటకు రాడు


రాడు రాడంటేను నీవూ రావణా

    రాముడూ రాకుండ పోడు

వాడు వచ్చుట సర్వకల్ల ఓసీత

    వచ్చి ననుజంపుట కల్ల


నిన్ను జంపుట కల్లకాదూ ఓదైత్య

    నన్ను కాచుట కల్లకాదు

ఎన్నాళ్ళు పాడేవు సీతా ఈపాట

    ఎన్నటికి నట్లు కాబోదు


అట్లేల కాదురా మూర్ఖా రాముడే

    ఆదినారాయణుడు మూర్ఖ

అట్లు ప్రశంసించి సీతా నీవు న

    న్నెట్లు బెదిరింతువే సీతా


బెదిరించుచుంటిరా దుష్టా నీకునై

    నుదయించినట్టి మృత్యువును

అదియును చూచెదను సీతా ఏమైన

    వదలబోనే నిన్ను నేను


నీవు వదిలెడి దేమి పోరా రాముడే

    వదిలించు నీచెఱను రేపు

ఈవాదనల కేమి సీతా చూదాము

    నీవాక్యమందు సత్యమ్ము



చిట్టివింటి నెక్కుపెట్టి శ్రీరాముడు

చిట్టివింటి నెక్కుపెట్టి శ్రీరాముడు ఇదె

   కొట్టెద రక్కసులనను బాలరాముడు


నవ్వుచు నొక బాణమేసి శ్రీరాముడు ఇది

   నారాయణాస్త్ర మనును బాలరాముడు


బాణమొకటి మంత్రించి శ్రీరాముడు ఇది

   బ్రహ్మాస్త్రము పొమ్మనును బాలరాముడు


పలువంకల పుడక దీసి శ్రీరాముడు ఈ

    బాణము నాగాస్త్రమను బాలరాముడు


విరివిగ బాణములు వేసి.శ్రీరాముడు అరి

    వీరులందరు చచ్చిరను బాలరాముడు


తన్ను మెచ్చు తమ్ములతో శ్రీరాముడు నా

    కన్ప వీరు డెవ్వడనును బాలరాముడు


విల్లుడించి చిరునగవుల శ్రీరాముడు 

    విజయము నాదేననును బాలరాముడు


15, నవంబర్ 2022, మంగళవారం

తనవారని పెఱవారని దశరథసుతు డెంచునా

తనవారని పెఱవారని దశరథసుతు డెంచునా

తనపాదము లంటగనే తప్పక కరుణించును


అదిశుచియని  ఇదికాదని అగ్నిదేవు డెంచునా

వదలక తననంటుదాని పట్టి బూది చేయును


సజ్జనులకె పూలు సువాసనలు వెదజల్లునా

పజ్జకెవరు వచ్చినను పరీమళము చిమ్మును


పాము మంచిచెడుల నెంచి పట్టి కాటువేయునా

తామసమున నెదుటనున్న దాని దంష్ట్రకిచ్చును


యోగ్యులకే దప్పికను యుదకములు తీర్చునా

యోగ్యతల నెంచకయే ఊరట కలిగించును


వయసుచూచి వేటగాడు బాణముతో కొట్టునా

దయచూపక దేనినైన తప్పక వధియించును


మంచివారి రోగములకె మందులు పనిచేయునా

అంచితముగ గ్రోలువారి కారోగ్యము నిచ్చును


నియమముగా పొగడవయా నీరాముని

నియమముగా పొగడవయా నీరాముని ని
       ర్భయముగా పొగడవయా నీరాముని


రయముగాను పొగడవయా నీరాముని ఆ
       ర్భాటముగా పొగడవయా నీరాముని

సర్వసంపదలనిచ్చు నీరాముని నీకు
       సర్వత్రా జయమునిచ్చు నీరాముని

వివేకివై పొగడవయా నీరాముని నీవు
       వినయముతో పొగడవయా నీరాముని

భవారణ్యదవానలుని నీరాముని సర్వ
        భువనభవనసంరక్షకు నీరాముని

పదేపదే పొగడవయా నీరాముని నీవు
        పవలురేలు పొగడవయా నీరాముని

అన్నిచోట్ల పొగడవయా  నీరాముని నీవు
        అందరిలో పొగడవయా నీరాముని



జయజయ రామ జానకిరామ

జయజయ రామ జానకిరామ

భయహర శుభకర పావననామ


దనుజవిరామ జనహితకామ

మునిమఖరక్షకఘననామ 


గగనశ్యామ కరుణాధామ

అగణితశోభనగుణధామ


సుందరనామ సురుచిరనామ

సుజనగణార్చితశుభనామ


వికుంఠధామ వీరలలామ

సకలాగమసన్నుతనామ 


రవికులసోమ భవనుతనామ

భవవార్నిధితారకనామ


చేయెత్తి దీవించరాదా

చేయెత్తి దీవించరాదా శ్రీరామ

నాయందు దయజూపరాదా


చింతలువంతలు చేరవు నన్నని

సంతోషము నాస్వంతంబగు నని


సత్సంగత్వము సలిపెద నేనని

దుస్సంగత్వము దూరము నాకని


మరువను నీనామము నెన్నడని

నరులను కొలుచుట నాకు కలుగదని


నీభక్తులలో నిలచెద నేనని

ఏభయములు నాకెన్నడు లేవని


తాపత్రయముల తగులను నేనని

పాపము నాకన బహుదూరంబని


అరిషడ్వర్గము లంటవు నన్నని

పరమార్ధంబును మరువను నేనని


హాయిగ సంపద లమరెడు నాకని

మాయ నాకడకు మరియిక రాదని


పామరు లిక నను భాధపెట్టరని

భూమిని నాకిక పుట్టువు లేదని


14, నవంబర్ 2022, సోమవారం

రఘువర తప్పెంచకు

పరమపురుష శ్రీహరి పురుషోత్తమ

కరుణాకర రఘువర తప్పెంచకు


నమ్మిన వారల నమ్మకములను

వమ్ముచేయవని యిమ్మహి పెద్దలు

నమ్మబలికి రని నమ్మితిరా నిను

నమ్ముట తప్పా కిమ్మనవేరా


వింటినిలే నీబిరుదము లెన్నో

వింటి నీకథలు వింతలువింతలు

వింటిని నీభక్తవీరుల కథలును

అంటి నమ్మితినని అదినా తప్పా


తప్పా తనువుల దాల్చుట యనునది

తప్పా ననుమాయ గప్పుట యననది

తప్పా నిన్నే తలచుట రామా

తప్పా నీకై తహతహ లాడుట



12, నవంబర్ 2022, శనివారం

ఇంతకన్న మంచిమందీ యిలలో లేదండీ

ఇంతకన్న మంచిమందీ యిలలో లేదండీ

చింతించక యెంతోకొంత యిచ్చి కొనండీ


చేదుమందు కాదండీ చెప్పరాని తీపండీ

వేదనలు తొలగించే పెద్దమందండీ

పేదలనీ ధనికులనీ వివక్షేమీ లేదండీ

ఆదుకొనే యీమందు అందరిదండీ


మీరు డబ్బులిస్తే మందు మేమివ్వ లేమండీ

గోరంతైనా డబ్బుతొ కొనలేరండీ

కూరిమి మీదగ్గరుంటే కొంచెమిస్తే చాలండీ

కోరుకున్నంత మందు కొంచుపొండీ


ఈమందును తిన్నారో యికమీద పుట్టరండీ

ఏమందూ యీహామీ నీయలేదండీ

ఈమందే మంచిమందు ఇదే నాల్కనుంచండీ

రామనామమనే మందు రవ్వంతైనా



నీదయచే కలిగినది నీరజాక్ష యీతనువు

నీదయచే కలిగినది నీరజాక్ష యీతనువు
నీదయచే నిన్నినాళ్ళు నిలిచియున్నది

నీదయచే కొంచెముగా నేర్చినది వివేకము
నీదయచే దానినట్లే నిలుపుకొన్నది
నీదయచే దొఱకినది నీనామము దానికి
నీదయచే చేయు నదే నిత్యస్మరణము

నీదయచే నిత్యమును నిన్ను భావించునది
నీదయచే భావనలో నిన్నే చూచును
నీదయచే రామచంద్ర నిన్ను సేవించునది
నీదయచే నిన్ను విడచి నిముషముండదు

నీదయచే నీసన్నిధి నిత్యమును కోరునది
నీదయచే అన్యంబుల నాదరింపదు
నీదయచే నిను గూర్చి నిత్యమును పాడునది
నీదయచే నాపాటలు నిలచును గాక


తప్పు లెన్నవద్దు రామా

తప్పు లెన్నవద్దు రామా మాతప్పు లెన్నవచ్చిన నవి కుప్పలు తెప్పలు సుమా

భలేవాడివయ్య రామా నీ వేవేవే పాతలెక్కలు బయటకు తీసే వేల
కాలాంబుదశ్యామ రామా యేకాలములో జరిగినవో కానీ ఆతప్పులనగ

నిర్మలుడవు నీవు రామా దుర్మార్గులము మావిదుష్కర్మ లిన్ని యన్ని కావు
కర్మలు విడనాడ రామా మాయజ్ఞానము సామాన్యము కాదుకదా సార్వభౌమ

నీవు కోపపడకు రామా మాజీవులము దుర్బలులము నిజముగానె యల్పులము
నీవు తలచుకొన్న రామా ఆఠావులన్ని చింపివేసి నిందలన్ని బాపగలవు

భవజలధి నీద రామా మాసత్తువెంత చెప్పవయ్య వదలక రక్షించవలయు
ఎవరింక దిక్కు రామా మాతప్పులెన్నకుండ నీ వింకనైన కావవయ్య
 

11, నవంబర్ 2022, శుక్రవారం

హరే జానకీశా శ్రీహరే రుక్మిణీశా

హరే జానకీశా శ్రీహరే రుక్మిణీశా
హరే  పార్వతీశవినుత హరే‌ జగదీశా

హరే భుజగశయనా శ్రీహరే కమలనయనా
హరే శ్రీనివాసా శ్రీహరే సంనివాసా
హరే పుష్కరాక్షా శ్రీహరే నీరజాక్షా
హరే భువనజనకా శ్రీహరే మదనజనకా
 
హరే దేవదేవా శ్రీహరే వాసుదేవా
హరే దీప్తమూర్తీ శ్రీహరే మహామూర్తీ
హరే రావణారీ శ్రీహరే కంసవైరీ
హరే జ్ఞానగమ్యా శ్రీహరే భక్తిగమ్యా
 
హరే లోకబంధో శ్రీహరే దీనబంధో
హరే భక్తపోషా శ్రీహరేభువనపపోషా
హరే ధనుర్ధారీ శ్రీహరే చక్రధారీ
హరే రామచంద్రా శ్రీహరే యదుకులేంద్రా
 

హరి హరి హరి హరి యందుమయా

హరి హరి హరి హరి యందుమయా శ్రీ
హరికీర్తనలే విందుమయా

హరిక్షేత్రంబుల నుందుమయా శ్రీ
హరిభక్తులతో నుందుమయా
హరిదీక్షలతో నుందుమయా శ్రీ
హరిభక్తులమై యుందుమయా

హరిమార్గంబున నుందుమయా శ్రీ
హరినెల్లడల కందుమయా
హరిచరితములే విందుమయా శ్రీ
హరినామములే విందుమయా
 
హరియే రాముం డందుమయా శ్రీ
హరియే కృష్ణుం డందుమయా
హరి మావాడని యందుమయా శ్రీ
హరి తోడిదె బ్రతు కందుమయా


శ్రీరామ నామస్మరణ మీరేల చేయరు

శ్రీరామ నామస్మరణ మీరేల చేయరు సం
సారము తరియింప చక్కని మార్గమే
 
మారుని స్నేహము మరిగి మానితిరో ని
స్సారదుర్మతప్రచారప్రభావని
వారితులై వదలి భ్రష్టులైనారో 
శ్రీరాముని మరచి చెడిపోవుచున్నారు

కాసుల వేటలో కాలము గడపుచు ను
దాసీనులై హరిని తలచుట మానుచో
సంసారమును దాటు చక్కని పడవను
కాసులు కొనిపెట్టగాలేవు తెలియుడు

తనువు శాశ్వతమని తలపోయుచున్నారో యీ
తనువన్న చాలరంధ్రములున్న పడవయే
మునుగుట తధ్యమ్ము మునుకొని హరినామ
మును పడవగా చేసికొవలె తెలియుడు 
 

రామచంద్రునకు విద్యలు నేర్పగ

రామచంద్రునకు విద్యలు నేర్పగ రమణీమణులకు తగవులు కలిగె
భామామణులు తగవులుపడగ రాముడు నవ్వుచు చూచుచు నుండె

ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
    నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే పూజలు వ్రతములు
    నారాము డివికావు నేర్చుకోవాలే వీరాధివీరుని చేసెడి విద్య
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య


వీరవనితవే కైకమ్మా కడు శూరవనితవే కైకమ్మా
    నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే విల్లంబుల విద్య
    నారాము డివికావు నేర్చుకోవాలే నరవరేణ్యునిగ చేసెడి విద్య
    నేరుపుమీఱగ నేర్పు సుమిత్ర శ్రీరామునకు చాల చక్కని విద్య


చారుశీలవే సుమిత్రా వరనారీమణివే సుమిత్రా
    నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే దానాలు ధర్మాలు
    నారాము డివికావు నేర్చుకోవాలే ధీరవరిష్టుని చేసెడి విద్య
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య


వారిజాక్షి ఓ‌కైకమ్మా శుభచరితవైన ఓ‌ కైకమ్మా
    నీరాముడైతే నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే దండనీతు లెల్ల
    నారాము డివికావు నేర్చుకోవాలే దయతో చక్కగ పాలించు విద్య
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు తల్లి చక్కని విద్య
    
    
ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
    నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే శాస్త్రపాఠములు
    నారాము డివికావు నేర్చుకోవాలే శూరకులమ్మెల్ల మెచ్చెడి విద్య
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య


వారిజాక్షి ఓ‌కైకమ్మా శుభచరితవైన ఓ‌ కైకమ్మా
    నీరాముడైతే నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే రాజనీతికథలు
    నారాము డివికావు నేర్చుకోవాలే ధారుణిపై పేరు నిలిపెడి విద్య
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు తల్లి చక్కని విద్య
 

ధీరవనితవే కౌసల్యా బహుధీరవనితవే కౌసల్యా
    నీరాముడైతేను నీవేమి నేర్పేవు నేర్పేవు లేవే ధర్మసూక్షములు
    నారాము డివికావు నేర్వాలి చాలా నారాయణు డంతవాడు కావాలే
    నేరుపుమీఱగ నేర్పును చూడవె శ్రీరామునకు కైక చక్కని విద్య


నారాముడంటేను నారాముడనుచును

నారాము డంటేను నారాము డనుచును నవ్వుచు పోట్లాడిరి
గారముచేయుచు శ్రీరాముబుగ్గల గట్టిగ ముద్దులు పెట్టుచును

బంగారుకొండను నవమాసమ్ములు భరియించి కంటిని నేనని కౌసల్య
అంగనామణీ పుత్రకామేష్టి యందిచె నపురూపఫలమని నరపతి
చెంగునగెంతే చిలిపిబాలకుని శ్రీరామచంద్రుని చంకనజేర్చుచు

నానోములపంట నాకొడుకువీడే నన్నెత్తుకోనీవె యనును కౌసల్య
ఈనల్లనయ్య నాకొడుకు కాడా యెత్తుకోనీవమ్మ యనును కైకమ్మ
కానీవె పిలిచితే యెవరిచంకెక్కునొ కనుగొందమిర్వువ మదియిప్పు డని

కంటిని చూడవె నాకంటివెలుగును యింటికి వెలుగును ఈకొడుకు నను పతి
వింటినిబట్టుట నేర్పెద నేనని ఇంటికి వెలుగును చేసెద నని కైక
మింటిమానికెపుటింటికి వెలుగై మెఱిసే రాముని చంకనజేర్చుచు

10, నవంబర్ 2022, గురువారం

మాయ సంగతి తెలియుడు జనులార మాయ సంగతి తెలియుడు

మాయ సంగతి తెలియుడు జనులార మాయ సంగతి తెలియుడు
మాయ సంగతి నెఱిగితే తనువులు మనకుండవని తెలియుడు

మాయచే ప్రభవించును తనువిది మాయలోనే పెరుగును
మాయలోనే తిరుగును తనువిది మాయలోనే‌ యొరుగును
మాయలో తాబుట్టి మాయలోనే పెరిగి మాయలోనే తుదకు
మాయమై పోయేది మాయదారి తనువు మనకెందు కంటాను

మాయదారి తనువున కలుగును మాయదారి బుధ్ధులు
మాయదారి బుధ్ధుల కలుగును మాయదారి కర్మలు
మాయదారి కర్మల కలుగును మాయదారి జన్మలు
మాయదారి కర్మలు మాయదారి తనువు మనకెందు కంటాను

మాయ సంగతి తెలిసిన మనుజుడు మాయలో తానుండక
మాయను దాటేందుకు రాముని మానక ప్రార్ధించును
మాయను శ్రీరాముడు దయగొని మాయము చేయగను
మాయాప్రభావమును మాయదారి తనువు మనకుండ దంటాను

నమ్మదగిన వాడనియే నమ్మితిని రాముని

నమ్మదగిన వాడనియే నమ్మితిని రాముని 
నమ్మితిని దేవుడనే నమ్మితిని
 
నమ్మితిని రాముడే నారాయణుండని
నమ్మితిని వాడే నాపతియు గతియని
నమ్మితిని రాముడే నన్నుధ్ధరించునని
నమ్మకము నాదెన్నడు వమ్ముకాదు

నమ్మిన సుగ్రీవుని నమ్మకమును నిలిపెను
నమ్మిన విభీషణుని నమ్మకమును నిలిపెను
నమ్మిన సీతమ్మకు నమ్మకమును నిలిపెను
నమ్మకమును నిలుపడా నాది కూడ

నమ్ముకొన్న శబరికి మోక్షమ్మునే యిచ్చెనే
నమ్ముకొన్న హనుమను బమ్మనుగా చేసెనే
నమ్ముకొన్న నాకేమి నాస్వామి యీయడో
నమ్ముకొందు నన్యులను నమ్మనేల

9, నవంబర్ 2022, బుధవారం

హరిమెచ్చితే చాలు

హరిమెచ్చితే చాలునండీ మాకు సర్వే

శ్వరుడిమెప్పు చాలదే పదివేలండీ


మంచివాడవురా నీవు మరల పుట్టవద్దని

కొంచెము దయచూపి మమ్ము గోవిందుడే

అంచితముగ మెచ్చి దీవించి తలయూచుటకు

మించిన దేముండును మీరే చెప్పండీ


కొఃచెపు సొమ్ములకై కొరగాని వారిని కడు

మంచి వారలనుచు పోగడ మాకేమిటికి

మంచి ఆత్మతృప్తి నేమి మరి మోక్షధనమేమి

ఎంచి హరి యిచ్చు నింకేమి కావాలండీ


నానామము పలికినదే నాకు చాలని రాముడు

నానామము భవతారక నామ మన్నాడే

ఏనాడును మరువకుండ ఆనామ స్మరణమే

ప్రాణముగా నుందు మన్య భావన లేలండీ


చిత్తగించవయ్య మనవి సీతాపతీ

చిత్తగించవయ్య మనవి సీతాపతీ ప్ర
త్యత్తరముగ నీదయ నాకొప్పెడు గాక
 
మనసు పాడదలచు నీ మంగళకర కీర్తనలు
తనువు పాడ సామర్ధ్యము తనకు లేదనును
తనివాఱగ పాడలేని దాయె నయ్య నాబ్రతుకు
వనజాక్ష మన్నింపగ వలయును నీవు
 
మనసు నీనామస్మరణ మానక తానుండగ
పనవు గాని లౌకికమగు పనులు తప్పకుండు
తనివాఱగ నామమైన తలచలేని దాయె బ్రతుకు
కనుగొని మన్నింపవే కమలాక్ష నీవు
 
మనసు నీక్షేత్రంబుల మసలుచుండ గోరగ
అనువుగాని గృహస్థితి వెనుదీయుచుండు
తనివాఱగ కనుల నిను దర్శించని దాయె బ్రతుకు
ఇనకులేశ రామ ఇంకేమి చెప్పుదును


ఎత్తులు వేసి నాకోదండరాముని చిత్తుచేయగలేవు

ఎత్తులు వేసి నాకోదండరాముని చిత్తుచేయగలేవు మాయా నా
చిత్తములోనున్న సీతాపతిని నీవెత్తుకుపోలేవు మాయా

కామాది సర్పాలు బుసకొట్టగానె నే కళవళపడనే ఓ మాయా ఆ
కామక్రోధముఖ సర్పాలేమి చేయు రామభక్తులనో మాయా శ్రీ
రాముడే శెషాహిశయనుడౌ వైకుంఠధాముడే ఓ పిచ్చి మాయా ఆ
రాముడే కృపతోడ ఈ నాహృదయమందిరంబున నున్నాడే మాయా

తాపత్రయాగ్నుల దండిగ మండించి దడిపించలేవే ఓ మాయా ఆ
తాపత్రయంబుల  జ్వాలలు చేరవు శ్రీపతిభక్తుల మాయా ఈ
తాపాలు శాపాలు పాపాలు కోపాలు ఏపాటివే పిచ్చి మాయా భవ
తాపాంతకుడు రామచంద్రుడు కొలువైన స్థానంబునే సోక మాయా

పతితపావనుడైన కోదండరాముని భక్తుని హృదయ మోమాయా అది
అతిపవిత్రంబైన హరికోవెలయె గాని యన్యంబు కాదే ఓమాయా అం
దతిశయముగ రామచంద్రు డుండును సీతాపతి యతనితో పిచ్చి మాయా నీ
వతిచేసి చెడవద్దు అతిదూరముగ నుండు టది మంచిదే నీకు మాయా


ఘనులార హరిభక్తిధనులారా

ఘనులార హరిభక్తిధనులారా పరమ స
జ్జనులారా రామభజన చేయుదమా

మునులెల్ల పరమసుగుణశీలుడని పొగడు
యినకులతిలకుని జనకసుతావరుని
మనమెంతో భక్తిగ మనసారపూజించి
వినయమొప్పంగ కీర్తనలను పాడుచు

ఈరేడుజగముల నారాటపెట్టిన
ఆరావణుని దురాచారు చోరుని
పోరాడి జంపిన భూరిపరాక్రము
శ్రీరామచంద్రుని నోరార కీర్తించి 

తలచి వలచి తన్ను కొలిచిన వారిని
పిలిచి ముక్తినీయ నిలమీద వెలసిన
జలజాప్తకులతిలకు జలజాక్షు నలయక
కులుకుచు పలుకుచు పలుమరు కీర్తించి
 

8, నవంబర్ 2022, మంగళవారం

రామపాదము సోకెను ఒక రాయి రమణిగ మారెను



 
రామపాదము సోకెను ఒక రాయి రమణిగ మారెను
రామనామము పలికెనా ఆ రాయిలోగల మానసం

రాయిగా అటులుండెనా ఒక రమణి వేల యేండ్లుగా
రాయిగా ఒక రమణిని అటు చేయ నేర్చిన దెవ్వరో
ఆ యుదంతము నంతయును బ్రహ్మర్షి తెలిసియె తెచ్చెనా
ఈ యమోఘపాదపద్ముని ఈమహాత్ముని రాముని
 
ఏమి మౌని చంద్రమా యిదియేమి చిత్రము తెలుపుమా
రామపాదము సోకుటేమిటి రాయి రమణిగ మారుటేమిటి
ఈమె రూపమునన్ తపస్విని ఈమె తేజమునన్ యశస్విని
ఈమె రాయిగ నుండుటే మని యినకులేశుడు వగచెను

మౌని విశ్వామిత్రు డంతట మందహాసము చేసెను
చాన ఈమె అహల్య గౌతమమౌని సాధ్వి రఘూత్తమా
మౌని తొందరపడుట వలన మానిని శిలయైనది
మేన నీపదస్పర్శ సోకి మేలుజరిగె ననె ముని


 
( ఈ టపాలో ఇచ్చిన చిత్రం వికీపీడియా లోనిది.  )

దేవదేవుని గూర్చి

దేవదేవుని గూర్చి తెలియని వారెవ్వరు

భావించి హరికీర్తి పాడని వారెవ్వరు


ఐనను వారందరిలో ఆతనిదౌ దివ్యమహిమ

మానుగాను తెలిసినట్టి మహానుభావు లెందరు

ఆ నలువకైన తెలియ నతని మహిమ దుర్లభము

గాన చక్కగ నెఱిగి పాడగలమే మాంబోంట్లము


ఐనను వారందరిలో ఆతని నిజతత్త్వంబును

లోనెఱిగిన మహాత్ములీ లోకములో నెందరు

ఆనీలకంఠు డెఱుగు నత డొక్కడే యెఱుగు

గాన నతని తత్త్వమెఱుగ నౌనా మాబోంట్ల కిలను


ఐనను వారందరిలో అపవర్గము నందుకొని

శ్రీనాథుని సన్నిధికి చేరుకొను వారెందరు

గాని మాభక్తి యన్నది కాదు కదా యసత్యము

కాన రామ కృష్ణ యనుచు గానము చేసేము



శ్రీరామనామమే శ్రీరామనామమే

శ్రీరామనామమే శ్రీరామనామమే

ఆరాటములు తీర్చు నట్టిసాధనము


కడుదుష్టు డైనట్టి కలితోడ పోరాడి

బడలుచుండిన యట్టి వారి కెల్లరకు


కామాదివైరివర్గము తోడ నిక పోరగా

లేమని భయపడు భూమిజనుల కెల్ల


తాపత్రయంబుతో తహతహలాడుచును

యోపక దుఃఖించుచున్న వారల కెల్ల


ప్రారబ్ధవశమున వ్యాధులాధులు వచ్చి

ఆరళ్ళుపెట్టగా నరచు వారల కెల్ల


మాయ తెఱలను చించు మంచిమార్గంబును

రోయుచు బహుడస్సి రోజువారల కెల్ల


భవచక్రమున చిక్కుబడి చాల తిరుగుచు

చివికి యాక్రోశించు జీవు లందరకును


7, నవంబర్ 2022, సోమవారం

శ్రీరామనామము చిన్నమంత్రమా

శ్రీరామనామము చిన్నమంత్రమా భవ
తారకమని చెప్పగా తగిన మంత్రమా

రాయినుండి రమణినే రప్పించిన మంత్రనే
బోయనుండి మహామునిని పుట్టించిన మంత్రమే
మాయనుండి నరజాతిని మరలించే మంత్రమే దీ
ర్ఘాయువిచ్చి దీవించెడు నట్టిమంత్రమే

ఆరూఢిగ జనులు కొలుచునట్టి మహామంత్రమే
కోరికలను తీర్చునట్టి గొప్పదైన మంత్రమే
కోరితే మోక్షమే చేకూర్చునట్టి మంత్రమే సం
సారులకు శాంతినొసగు సత్యమంత్ర్రమే

ఇంతకన్న మంచిమంత్ర మింకొక్కటియే లేదే
ఇంతకన్న భవతారక మింకొక్కటి లేదే
చింతించు లోలోపల శివుడీ మంత్రంబునే యిక
చింతించి మీరెల్లరు సిధ్ధిపొందుడు


ఏమి చేయలేదయ్యా రామనామము

ఏమి చేయలేదయ్యా రామనామము నీ కేమి యొసగలేదయ్యా రామనామము

చాల దుఃఖమైన వేళ రామనామము మనశ్శాంతిని కలిగించును రామనామము
పాపమంటినట్టి వేళ రామనామము పరమపవిత్రత కలిగించును రామనామము
రాయివలె నున్నవేళ రామనామము నీకు రామస్పర్శ కలిగించును రామనామము
బోయవలె నున్నలేళ రామనామము నీకు రామకథ నెఱిగించును రామనామము
మాయచెఱ నున్నవేళ రామనామము నీకు రామని యెఱిగించును రామనామము
కుమతులు నిను దిట్టువేళ రామనామము నీకు గొప్పగెలుపు నిచ్చును రామనామము
దీనుడవై యున్నవేళ రామనామము నీకు ధీరత కలిగించును రామనామము
చులనయయై యున్నవేళ రామనామము కార్యశూరునిగ చేయు నిను రామనామము
సంపదలు చెడినవేళ రామనామము నీకు సర్వసంపదలిచ్చు రామనామము
అయినవారు పొమ్మంటే రామనామము నీకు అండయై నిలబడును రామనామము
లోపమేమి కలుగకుండ రామనామము నిన్ను కాపాడు నెల్లప్పుడు రామనామము
కాలు డేతెంచువేళ రామనామము నిన్ను కాచి పరమపద మిచ్చు రామనామము

పలుకరే హరినామము ప్రజలారా మీరు

పలుకరే హరినామము ప్రజలారా మీరు
కులుకుచు తిరుగుటలు చాలు కువలయంబున

పుడమిని తిని యురక మీ పొట్టలను పెంచుచులో
విడువక భామినుల వెంటవెంట తిరిగి యాడుటలో
గడిపినచో కాలమెల్ల గడచుటెట్లు భవవార్నిధి
విడువక హరిభక్తి మీరు కడు నిష్ఠతో నిక

పలుకరె యీ హరికంటెను బంధు వెవ్వ డున్నాడని
పలుకరె యీ హరికంటెను ప్రాణమిత్రు డెవ్వడని
పలుకరె యీ హరికంటెను లేడధికు డొక్కడని
పలుకరే యీ హరియే పరమపూరుషుడని

పలుకరె శ్రీరామ యని పలుకరె శ్రీకృష్ణ యని
పలుకరె శ్రీధర యని పలుకరె గోవింద యని
పలుకరె పాపాంధకార భాస్కరా హరి యని
పలుకరే జగన్నాథ పాహి పాహి పాహి యని

కనులార నిను నేను కాంచుటయే భాగ్యము

కనులార నిను నేను కాంచుటయే భాగ్యము
మనసార నిను నేను వినుతించుటె భాగ్యము

పరాత్పర నీనామము పలుకుటయే భాగ్యము
హరి నీదు సేవ నాకబ్బుటయే భాగ్యము
పరమపురుష నీకీర్తిని పాడుటయే భాగ్యము
నరవర శ్రీరామచంద్ర నాభాగ్యమె భాగ్యము

తరచు నీక్ష్తేత్రంబుల తిరుగుటయే భాగ్యము
హరి నీకు బంటునై యమరుటయే భాగ్యము
మరువక నీభక్తులతో మసలుటయే భాగ్యము
పరమాత్మ రామచంద్ర భాగ్య మిదే భాగ్యము

హరి నిన్ను తలచి మేనుమరచుటయే భాగ్యము
హరి నిన్ను చేరుకొన నాశించుటె భాగ్యము
హరి నీదు పాదరేణు వైయుండుట భాగ్యము
నిరంజన రామ యిదే నిరుపమాన భాగ్యము


వేళాయె సభకు


వేళాయె సభకు రామవిభుడు వెడలుటకు

బాలికలార త్వరపడరే మీరు


హరి కలదరె మంచి యంగరాగములను

హరికి తొడగరె స్వర్ణాభరణములను

హరి తల నుంచరే అనర్ఘరత్నమకుటము

హరి కందించరే ఆరాజదండము


మేదిని నేలినట్టి పాదులకను దెచ్చి

మోదముతో హరికి మ్రొక్కుచు దొడగరె

వేదమయున కనుమోదముగ మంగళ

వాదనలు వీణియల పలికించ రమ్మా


హరి కెదురుగ రారె యది మంచిశకునము

హరి వెంట నడువరె యనతిదూరము

హరి దారిలో మీరు విరులను జల్లరే

హరిణేక్షణలార త్వరపడరమ్మా


6, నవంబర్ 2022, ఆదివారం

రార హరి శ్రీరామచంద్రా రార మము రక్షించరారా

రార హరి శ్రీరామచంద్రా రార మము రక్షించరారా

రామచంద్రా రామచంద్రా రార పరమానందకంద
రామచంద్రా రాఘవేంద్రా రార కరుణారససాంద్ర
రామచంద్రా శ్యామలాంగా రార తరణివంశమండన
రామచంద్రా కోమలాంగా రార కుమతివర్గఖండన
రామచంద్రా భక్తపోషా రార విబుధలోకతోష
రామచంద్రా విశ్వపాలా రార మహితగుణవిశాల
రామచంద్రా పూర్ణకామా రార భర్గవినుతనామ
రామచంద్రా ఖరవిరామా రార భవవిరామనామ
రామచంద్రా జగన్నాథా రార సీతాహృదయనాథ
రామచంద్రా జ్ఞానగమ్యా రార సర్వయజ్ఞఫలద
రామచంద్రా సత్యసంథా రార సర్వేశ్వర ముకుంద
రామచంద్రా దేవదేవా రార దివ్యమునీంద్రప్రస్తుత
 

5, నవంబర్ 2022, శనివారం

నారచీరలు కట్టినామో పిన్నమ్మ

నారచీరలు కట్టినామో పిన్నమ్మ
కారడవుల కిక మేము కదలేదా

నారలను గట్టితిని నమ్మకము కలిగెనా
క్రూరవనముల నింక గ్రుమ్మరుదును
ఈరాముని వాక్యమన నెప్పుడును సత్యమే
వారాసు లడుగంటవచ్చును గాక

నారచీర లిదే కట్టినాడు సౌమిత్రియును
నారలనే కట్టితి నాసీతకును
తీరుగను మునివేషధారులముగ నుంటిమి
చేరెదము మేము వన సీమల కింక

కోరి దేవత లేమి కోదండ రాముని
నేరుపుగ వనములకు నడపినారో
వారి కది యింక నావలన సిధ్ధించనీ
కోరికలు నీవియును కొనసాగనీ
 

తనువు చినచెఱసాల ధర పెద్దచెఱసాల

తనువు చినచెఱసాల ధర పెద్దచెఱసాల

కనుగొన నిజమింతే కాదటయ్యా


కొంద రీచెఱలపై కూరిమితో నుందురు

కొంద రివి యహిత మనుకొను చుందురు

ఎందరివి దాటపో నెంచెదరు చెప్పుమా

వందితాఖిలమునిబృంద రాఘవా


మునుకొని నీనామమును నూతగా గొని

మనుజుడీ చెఱలు రెండును దాటును

వనజాక్ష జానకీవల్లభా రఘురామ

తనకు వేఱొక దారి యన నున్నదా


చెఱసాల కాని దీసృష్టిలో నున్నదా

హరి సన్నిధాన మొక టనునది గాక

మరి హరేరామ యను మంత్రమే కాక

చెఱలువిడు సాధనము జీవికి కలదా


అదియేమి బ్రతుకయ్యా అదినాకు వలదయ్యా

అదియేమి బ్రతుకయ్యా అదినాకు వలదయ్యా
వదలక నీయెడనుండే బ్రతుకిమ్మా రామయ్యా
 
మనసారా హరిభజన మొనరింపనిది బ్రతుకా
తనివారా హరిపూజలను చేయనిది బ్రతుకా
దినదినము హరియశము గొనియాడనిది బ్రతుకా
కనులారా హరిరూపమును జూడనిది బ్రతుకా
మనసిజమోహనుపైన మనసుపడనిది బ్రతుకా
వినుతించి హరిలీలలను పాడనిది బ్రతుకా 
అణకువతో హరిభక్తులను చేరనిది బ్రతుకా
మునిజనవంద్యునిచరితమును చదువనిది బ్రతుకా
తనువిది శ్రీహరిసొమ్మే యని పలుకనిది బ్రతుకా
మనసే శ్రీహరినిలయ మనజాలనిది బ్రతుకా
వనజాక్షుపదయుగళమున వ్రాలనిది బ్రతుకా
ననుబ్రోవుమోరామా యనివేడనిది బ్రతుకా

4, నవంబర్ 2022, శుక్రవారం

హరినే కీర్తించరే అయ్యలారా

హరినే కీర్తించరే  అయ్యలారా
పరులను కీర్తించే పనియే లేదు
 
కోరితే సిరులన్నీ గోవిందు డిచ్చు గాని
మీరు వాటి కన్యులను కోర నేల 
వారిచ్చు సిరులన్నీ వారికెవ రిచ్చినవో
నారాయణడా సిరికి నాథుడు కాదె

కోరితే మోక్షమది గోవిందు డిచ్చు గాని
మీరు దాని కన్యులను కోర నేల
వారైహికము లేవో ప్రసాదించ గలరేమో
నారాయణుడే యిచ్చు నరులకు ముక్తి
 
శరణన్న వారికెల్ల సర్వసంపదల నీయ
సిరిమగడే రాముడై ధరకు వచ్చె
నరులార వేడరే సిరులైన మోక్షమైన
హరిని మీరు కీర్తించి యన్ని విధముల


సీతారాముల కొలువని దొక జీవిత మందురా

సీతారాముల కొలువని దొక జీవిత మందురా
మీతాతలు ముత్తాతలు మీవంశకర్తల వలె

నిలువరించి రావణుని కొలిచె నొక పక్షియును
తెలియబరచి సీతజాడ కొలిచె నింకొక పక్షి
పులుగులైన సీతారాముల నిట్లు కొలిచెనే
ఇలమీద మనిషివై కొలువని దొక బ్రతుకా
 
కొలిచినవే కోతులును కోరి సీతారాములను
కొలిచె కొండమ్రుచ్చులును గొప్పగా వారిని
కొలిచినదొక యుడుతయు కోదండరాముని
కొలువకున్న మనిషివై ఘోరమా బ్రతుకనగ

తినితిరుగుటె జీవితమని యనుకొంటే పందులును
తినితిరుగును మరి నీవో మనుజుడ వైనావే
మనుజుడవై పుట్టి హరిని మసలక సేవించక
ఘనత యేమి నిమ్నజీవి కన్న నీబ్రతుకునకు
 
 

ఆరాముడు హరియని యనుకొనలేదా

ఆరాముడు హరియని యనుకొనలేదా
ఈరోజే తెలిసినది యెంతో సంతోషం

సీత నపహరించుట చిన్నతప్పు కాదు
ఆతడే హరియైతే నంతే నేమో
కోతినే పంపె వాడు సీత వద్దకు
కోతి కాదులే వాడు జాతవేదుడు

రాకాసులకు ముప్పు రాముడు హరియైన
రాకాసులకే‌ కాదు రావణునకును
నీకాంతా మోహమే నీకు ముప్పాయెను
శ్రీకాంతుడే నన్ను చెనకవచ్చెను
 
అహరి విరోధి కదా ఆనందమేల
అహరి నను జంపుచో‌ నపవర్గమే
ఊహింపరాదు నీ యోటమి పై ప్రీతి
దేహిని మోక్షముపై దృష్టి నిలిపితి


3, నవంబర్ 2022, గురువారం

తగదు తగదు రాఘవ నగుమోము నిటుదాచ

 

తగదు తగదు రాఘవ నగుమోము నిటుదాచ తగదు నీకిది రాఘవ

శ్రీకర రామ సుధాకరోపమవదన నాకేల నీదయ రాకుండు నీవేళ
నీకు భక్తుడ నగుచు నిన్నే నమ్మియుండ నాకు ప్రసన్నుడవు గాకుందు వీవేళ
సాకేతాధిప రామ సమరరంగ భీమ సద్భక్తునకు మోము దాచుట యీవేళ
నీకన్య మెఱుగని సేవకుండను నేను లోకవార్తలు తెలుప నరుగుదెంచిన వేళ
గిరిజేశ వినుతుడవు పురుషోత్తముడ వీవు మరి నీదు భక్తుని మన్నింప వీవేళ
పరమాత్ముడవు నీవు పతితపావనుడవు ప్రభు నీదు భక్తుని మన్నింప వీవేళ
దరిజేరి నిలచితిని దాసానుదాసుడను దయమాలి నీమోము దాచుట యీవేళ
అరకొర దరిసెన మిదియేమి మరియాద నరనాథ నీమోము దాచుట యీవేళ
నీనామస్మరణంబు వదలకుండెడు నేను నీకరుణనే కోరి నిలచియుండిన వేళ
నీమ్రోల వినయముగ నిన్ను కీర్తించుచు నీభక్తుడను నేను నిలచి యుండిన వేళ
ఆనందముగ నీవు పలుకరించెద వనెడు నాశతో నీముందు నేనున్న శుభవేళ
కరిరాజ వరదుడవు కరుణాలవాలుడవు సరసత నిజభక్తు మన్నింప వీవేళ

2, నవంబర్ 2022, బుధవారం

కోరిక లెట్టివి కోరేరో వారికి ఫలితము లట్టివగు

కోరిక లెట్టివి కోరేరో వారికి ఫలితము లట్టివగు
కోరదగిన దిల నొక్కటే యని కొందరె లోలో నెఱిగేరు
 
కోరుకొందురు లోకమున కొందరు భోగభాగ్యములు
వారు ధనముల కన్యంబులను వ్యర్ధంబులని తలచెదరు
పేరాశలతో ధనములను పేర్చి పట్టుకొని పోయేరా
వారందరును పుట్టిచచ్చుచు బ్రతికే రిట్లే నిక్కముగా

కోరుకొందురు లోకమున కొంద‌రు కీర్తిప్రతిష్టలను
కీరితి కలిగిన స్వర్గమున క్రీడించెదమని తలచెదరు
ధారుణి కీరితి నిలిచేనా వారిభోగమును చెడిపోదా
వారందరును మరల భూమికి వచ్చిచేరరా నిక్కముగా

కోరుకొందురు లోకమున కొందరు రాముని కరుణనే
కో‌రదగినది కేవ‌ల మదియే కువలయ మందని తలచెదరు
శ్రీరఘురాముని కృపగోరి చిత్తశుద్ధితో కొలచుటచే
తీరని కోరిక లుండవుగా వారిక మరల పుట్టరుగా


కలగంటి నయ్యా నేను కలగంటి నయ్యా నిన్నే

కలగంటి నయ్యా నేను కలగంటి నయ్యా నిన్నే
కలలోన నీవు నాతో‌ కబురులాడగ గంటి 

బిరుదులు కలిగినవాడ బింకము కలిగినవాడ
పరమసుకుమారుడ సరసిజ నయనుడ
కరుణతొ నాతోడ కమ్మగ పలుకువాడ 
చిఱుచిఱు నగవులవాడ సీతాహృదయేశుడ

ఏళ్ళాయె పూళ్ళాయె నేమైతి విన్నినాళ్ళు
కళ్ళు కాయలుకాచె కలనైన కనరావు
భళ్ళున ఘడియలోన తెల్లవారు ననగ
చల్లగ నిచ్చితి వొక్క స్వప్నదర్శనంబును

కనిపించితే నిన్ను కడిగివేయుదమని
యనుకొంటినే నిన్ను కనుచు మురిసితిని
మనసులో తాపమే మటుమాయ మొనరించి
కనుల నవ్వుచు నీవు కనుమరుగైనావు
 
 

1, నవంబర్ 2022, మంగళవారం

భగవంతుని శుభనామము పలికే భాగ్యము మనకు కలిగినది

భగవంతుని శుభనామము పలికే భాగ్యము మనకు కలిగినది
జగదీశ్వరుని కరుణను పొందే చక్కని దారియె దొరకినది  
 
కలిలో భగవన్నామస్మరణము కన్నను మార్గము లేదనుచు
పలికెద రార్యులు భగవన్నామము పలుకుట కైనను తత్కృపయే
తొలుత కలుగక పలుకవలయు నని తోచదు నరులకు నేడిటుల
పలుకుచు నుంటిమి భగవన్నామము భాగ్యము కాక మరియేమి

నామస్మరణము కలుషాంతకమని నానాపురాణములు పలుకు
నామస్మరణము శుభకారకమని నరులందరకును నమ్మకము
నామస్మరణము నరకాంతకము నరులకు మోక్షప్రదాయకము
నామస్మరణము చేయుచుంటి మింకేమి భాగ్య మిక కావలెను
 
హరేరామ యని యనుచుంటిమిగా అదృష్టమంటే మనదేగా
హరేకృష్ణ యని యనుచుంటిమిగా అదృష్టమంటే మనదేగా
హరి మనకిచ్చును పరమపదంబని భావించుడు సంశయమేలా
పరాత్పరుని శుభనామము పలికే భాగ్యమె ధరలో భాగ్యముగా

దొరకెను పరమమంగళనామం

దొరకెను పరమమంగళనామం దొరకెను మనకు రామనామం
 
సలలితమగు యీ స్వామినామం సజ్జనరంజక స్వామినామం
పలుకండందరు స్వామినామం పవలును రేలును స్వామినామం
సంపత్కరమగు స్వామినామం సర్వోన్నతమగు స్వామినామం
కొలిచేవారికి స్వామినామం కొంగుబంగరే స్వామినామం
శక్తినొసంగే స్వామినామం భుక్తినొసంగే స్వామినామం
రక్తిని గొలిపే స్వామినామం ముక్తినొసంగే స్వామినామం
భక్తజనప్రియ స్వామినామం ప్రాణాధారము స్వామినామం
భూరిసుఖదమగు స్వామినామం తారకమంత్రం స్వామినామం
మదిలో నుంచుడు స్వామినామం నిదురను విడువక స్వామినామం
సర్వోన్నతమగు స్వామినామం సర్వార్ధదమగు స్వామినామం
పతితపావనము స్వామినామం పరమార్ధదమగు స్వామినామం
సీతారామ స్వామినామం చిన్మయుడగు మన స్వామినామం

హరిభజన చేదాము రారే

హరిభజన చేదాము రారే జనులార

      అది కదా తరియించు దారి


కలిగాడి ఆగడా లడగించు దారి

       కమలాక్షుని భజన కాదా జనులార

       కమలాక్షుని భజన కాదా

కలుషమ్ము లన్నటిని తొలగించు దారి

       కమలాపతి భజన కాదా జనులార

       కమలాపతి భజన కాదా

       

క్రోధాధిశత్రువుల కొట్టి తరిమెడు దారి

       గోవిందుని భజన కాదా జనులార

       గోవిందుని భజన కాదా

బాధలన్నీపటాపంచలై చను దారి

       పరమాత్ముని భజన కాదా జనులార

       పరమాత్ముని భజన కాదా


తాపత్రయంబును తగ్గించుటకు దారి

       గోపాలుని భజన కాదా జనులార

       గోపాలుని భజన కాదా

శాపంబులన్నియును శాంతించుటకు దారి

       శ్రీపతి భజనయే కాదా జనులార

       శ్రీపతి భజనయే కాదా


భవసాగరము నీది బయటపడుటకు దారి

       భావింప  హరిభజన కాదా జనులార

       భావింప హరిభజన కాదా

వివరింప హరిజేరి విహరించుటకు దారి

        భువిని శ్రీహరిభజన కాదా జనులార

        భువిని శ్రీహరిభజన కాదా


శ్రీరమారమణ యని శ్రీనివాసా యని

        చేయరే హరిభజన నేడే జనులార

        చేయరే హరిభజన నేడే

శ్రీరామరామ యని శ్రీకృష్ణకృష్ణ యని

        చేయరే హరిభజన నేడే జనులార

        చేయరే హరిభజన నేడే


మ్రొక్కేము మ్రొక్కేమురా దేవుడా

మ్రొక్కేము మ్రొక్కేమురా దేవుడా నీకు 
            మ్రొక్కేమురా స్వామి మారాముడా
            

ఎల్లవేళలను మాపిల్లలను పాపల
             చల్లగ జూచుచు నుండేవురా
ఇళ్ళువాకిళ్ళను బంధుబలగమును కో
             కొల్లలుగ దయచేయుచున్నావురా

భోగభాగ్యములు మాకిచ్చేవురా మంచి
             బుధ్ధిని నీవు మాకిచ్చేవురా
రోగాలు రొచ్చులు లేకుండగా ఆ
              రోగ్యభాగ్యము కూడ నిచ్చేవురా

నీపైన భక్తిని నిండించి మాలోన
          నీవారిగా చేసుకున్నావురా
కాపుండి మాకెపుడు కష్టాలు రాకుండ
          కరుణతో మమ్మేలు చున్నావురా

శ్రీరామ యన్నాక చింతలే యుండవని
      నోరార నీపేరు పలికేమురా
శ్రీరామనామమే తారకనామమని
       చిత్తశుధ్ధిగ నమ్ముచున్నామురా

ఉదయమైనది మొదలు పడక నెక్కేదాక
          వదలక నీపేరు తలచేమురా
 వదలక నీపేరు నిదురలో నైనను
           పలుమారులే కలువరించేమురా

మాయిండ్లలో నీవు మరువక కొలువుండి
         మానోళ్ళలో నీనామమే కొలువుండి
మాయదారి మయ మమ్మంటుకొన కుండి
         నీయాన మేము తరియించేమురా


        

ఏల వేల భక్తజాల పాలనశీల

ఏల వేల భక్తజాలపాలనశీల నీ
కేల కరుణ రాదు జగదీశ్వర మేలా
 
బ్రహ్మాండములను చేయునట్టి వాడవు నీవు
బ్రహ్మానంద మొసగునట్టి వాడవు నీవు
బ్రహ్మాదు లెపుడు  పొగడునట్టి వాడవు నీవు
బ్రహ్మాదులను పనుల నిలుపు వాడవు నీవు
 
నిన్నే గాక వేరొకరిని నేను కొలువను
నిన్నే గాక దైవమొకని నేనెఱుంగను 
నిన్నే నమ్మి యుంటి ననుచు నీవెఱింగియు
మన్నింపకునికి కారణ మేమున్నది రామ

గర్వించు రావణాదులను కాటికంపిన
శర్వాదివినుత విక్రముడవు శాశ్వతుండవు
నిర్వాణపదము నొసగెదవు నీభక్తులకు
నిర్వేదపడగ నేల నాకు నీభక్తునకు


హరి హరి యంటే చాలు కదా

హరి హరి యంటే చాలు కదా మరి యిక జన్మము లేదు కదా

అంబరీషుపై నతికృప జూపిన హరినే శరణము జొచ్చితి నేనని
కరివరదుండగు చక్రాయుధునే శరణము జొచ్చితి శీఘ్రముగా నని
శాశ్వతపదమున ధ్రువునుంచిన జగదీశ్వరుడా హరి శరణము నాకని
ఈశ్వరు డితడని యెఱిగితి హరియే శాశ్వతు డితడే శరణము నాకని
దైత్యబాలకుని సంరక్షించిన దయాశాలి హరి శరణము నాకని
పాతాళమునకు పొమ్మని బలిని పంపిన హరియే శరణము నాకని
సీతారామస్వామిగ వెలసిన శ్రీహరి యొకడే‌ శరణము నాకని
అవనీభారము నంతము చేసిన హరి శ్రీకృష్ణుడు శరణము నాకని
కలియుగాంతమున కల్కిగ వచ్చెడి జలజాక్షుడు హరి శరణము నాకని
మారజనకుడగు హరియేగాక మరియొక రక్షకు డెవడును లేడని
శరణాగతులను పరిరక్షించెడి హరినే శరణము వేడెద నేనని
తారకనామము నాలుకపైనిడి ధన్యత చెందితి రామహరే యని