31, అక్టోబర్ 2016, సోమవారం

రామనింద చేయువారు రాకాసులే


రామనింద చేయువారు రాకాసులే
తామది చేయుదురా ధర్మాత్ములు

పామరత్వము చేత పలుగాకు లగుచు
కోమలాంగుల గాంచి కొంకక వదరుచు
కామాతురు లగుచు తిరుగాడెడు వారు
రాము డేమిసుజను డని ప్రశ్నించుటొక్కటా
రామ

తెల్లవారినది మొదలు తెరపిలేక డంబములు
కల్లలు కపటములే కాని యన్యములు లేని
గుల్ల బుద్ధులవారు గొప్పగా ప్రశ్నింతురె
చెల్లునా రాముడు శీలవంతు డనుట యని
రామ

కనులు మూసుకొన్న వారు కాంతి లేదన్నటుల
మనసు మూసుకొన్న వారు మంచి లేదన్నటుల
ఇనకులేశుడు లేడు హీనసంస్కారులకును
కనులుతెఱచి మనసునిచ్చు కొనిన కానవచ్చు
రామ


దేవతలకు నైన తెలియరాదు హరిమాయ


దేవతలకు నైన తెలియరాదు హరిమాయ
ఆ వెన్నుడే యెఱుగు నంతియ కాదే

యిలపైన మాయగొని వెలసెనట రాముడై
పులుగుఱేని కిచ్చెనే పొలుపుగా ముక్తిని
తులలేనిపద మీయగలవాడు తానైన
తెలియునా తెలియదా దేవుడ తానేనని
దేవ

సీతకై విపినంబుల చింతించుచు తిరుగ
మాత పార్వతి తానే సీతయై శోధింప
నాతడను సోదరీ యన్యాయ మిదియని
యా తీరుచూడ లీల యనిపించు కాదా
దేవ

అవతారపురుషు డట యదియు తానెఱుగ డట
కువలయమున తనకన్న గొప్పవాడు లేడట
చివరకా బ్రహ్మవచ్చి చెప్పగా వెన్నుడవని
అవునా నే దాశరథి ననుకొందు ననునట
దేవ


హరి వేగ నామనసు నలుముకోవయ్యా


హరి వేగ నామనసు నలుముకోవయ్యా
త్వరపడ కుంటే వచ్చి తానుండురా కలి

సురుచిరముగ నీవు శోభించు మనసులో
శిరసులెత్త జాలునా దురూహలు
కరమరుదగు ప్రేమతో‌ కరుణాలవాల నీ
పరమైన భావనల పరవశించు గాక
హరి

తరచుగా నీ నామము తడవు నాలుకపైన
పొరపాటు మాటలు పుట్టునా
నిరుపమాన మైనట్టి నీగుణముల నెన్నుచు
పరిపరివిధంబుల పరవశించు కాక
హరి

రాముడవై రాకాసుల ధీమసమ మణచితివి
కామక్రోధాది రాకాసులమూక
ఆ మాయకలిసైన్య మగుచు చొరబడులోన
నా మనసులో నిండి నన్ను కావ కాదా
హరి


29, అక్టోబర్ 2016, శనివారం

అంతయును నీకే


అంతయును నీకే యప్పగించి నాను నీ
వంత మంచివాడ వనియే రామా

ఏవేవో భవములం దెఱుగక చేసినవి
నీవిప్పు డనుభవించ బోవకెట్లు
నా వలన నుందువేని యే వెతలును నీకు
లేవంటి వందుకే జీవితం బెల్ల నిదె
అంతయును

కామక్రోధములు గెలువగాదు నీవలన
పామరుల పండితుల వదల వవి
యేమరక తారకనామ భజన చేయు మిక
తామసహర మంటివని నామనం బెల్ల నిదె
అంతయును

భవసాగరమున బడి బయటకు పోలేక
చివుకుచుంటి నని చింత యేల
నవలంబించుదు వేని న న్నదియే చాలు చాలం
టివి గావున పోరాడక తేకువ నాభార మిదె
అంతయును


నే నొక్కడ భారమా నీకు


నే నొక్కడ భారమా నీకు గోవింద
నేను నీవాడనే కానైతినా

నరహరి మధుసూదన నారాయణాచ్యుత
మురహర నరకనిర్మూలనా
పరమపురుష బ్రహ్మేంద్రభావిత శ్రీచరణ
నరనాయక శ్రీరామ నను బ్రోవవే
నే నొక్కడ

హరి పురుషోత్తమ అనిరుద్ధ మాధవ
నిరుపమ కృపానిధానమా
గరుడధ్వజ పరమాత్మ కమలామనోహర
తరచైనవి చిక్కులివి తప్పించవే
నే నొక్కడ

భువనాశ్రయ రామ పుండరీకాక్ష దక్ష
భవనాశన సర్వపాపఘ్నా
శివ జగదీశ మనోహర చింతితార్థప్రద
తివిరి నా బుద్ధి చక్కదిద్దరావే
నే నొక్కడ


హరిలీల హరిలీల


హరిలీల హరిలీల హరిలీల మేరకే
నరు లార మీరెల్ల నర్తించేరు

హరి యాడుమన్న యాట లాడేరు మీరు
మిరిపెముతో‌ హరి తిలకించ
వరుసగ నవరస భరితములైన
పరిపరివిధముల బ్రతుకులతో
హరిలీల

హరి పాడు మన్న పాట లాలపించేరు
సరగున సరసుడు హరికొఱకు
మరి మీదు కోరికల మంచిరాగాలతో
నిరతము చేరుచు హరిచెంగటను
హరిలీల

హరి చెప్పినట్టు లుండి యలరించేరు
నరులా హరినే నడతలను
నరులందరకును రామనాయకుడై
హరి నేర్పె మంచిబుద్ధు లన్నిటిని
హరిలీల


28, అక్టోబర్ 2016, శుక్రవారం

నమ్మిన వానికి నారాయణుడవు


నమ్మిన వానికి నారాయణుడవు
నమ్మని వానికి నరమాత్రుడవు

ఈ కనబడు సృష్టి యెల్ల నించుక క్రీడార్థము
నీ కల్పన యనగ వెలసె నీ వేడుక ముగియుచో
లోకస్థులు లోకేశులు లోకంబులు లేని దగు
నీ కడిది నాటకమున నేనుంటిని సుమ్మని
నమ్మిన

వరబలగర్వోద్ధతరావణాదుల రణంబున
నిరుపమవిక్రమమున నిగ్రహించిద్రుంచితని
హరబ్రహ్మేంద్రాదులు నిన్నగ్గించిరి కావున
నరాకృతిం గొన్నయట్టి పరాత్పరుడ వేనని
నమ్మిన

ముక్తినిచ్చు దొరవనుచు ముదమారగ మనసా
శక్తికొలది పూజించుచు చపలత్వము లేక
ముక్తసంగులగుచు మంచి బుద్ధిమంతులైన
భక్తియుతుల చేయివిడని పరదైవము నీవని
నమ్మిన


వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే


వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే
రసనా యిక పలుకవే రామమంత్రమే

సర్వపూజ్యమంత్రమే సకలసిద్ధిమంత్రమే
గర్వహరణమంత్రమే గరుడగమను మంత్రమే
సర్వవిజయమంత్రమే సర్వశుభదమంత్రమే
యుర్వినేలు మంత్రమే యుద్ధరించు మంత్రమే
వసుధ

పావనమగు మంత్రమే భవతారకమంత్రమే
భావనాతీతుడైన పరమాత్ముని మంత్రమే
కావలసిన మంత్రమే కలిహరణమంత్రమే
సేవ్యమైన మంత్రమే శివసన్నుతమంత్రమే
వసుధ

అందమైన మంత్రమే యాత్మవిద్యామంత్రమే
అందరికీ సులభమైన యతిచక్కని మంత్రమే
సుందరుడగు శ్రీరాముని చూపించే మంత్రమే
పొందదగిన వాని జేసి మోక్షమిచ్చు మంత్రమే
వసుధ


చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ


చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ
దక్కు కదా మోక్షమే తప్పక నీకు

రామపదధ్యానముపై రాదా మనసు
కోమలాంగిపైననే కుదురుకున్నదా
భూములుపుట్రలపైన బుద్ధినిలచునా
యేమి లాభమివి యన్ని యెంతనికరము
చిక్కేమి

రామగురుచరిత్ర పారాయణంబున
మీమనసుల రక్తిలేక మేలు కలుగునా
ఏమేమో గురుచరితల నెంతచదివిన
యేమిలాభ మవి ముక్తి నీయలేవుగా
చిక్కేమి

శ్రీరాముడు సాక్షాత్తు నారాయణుడు
శ్రీరాముని భక్తులకు చేటు కలుగదు
శ్రీరాముని సేవవలన చేకురు ముక్తి
శ్రీరామున కన్యముల చింతయె వలదు
చిక్కేమి


రామనామము చాలు


రామనామము చాలు రాముడు చాలు
రామేతరముల విరక్తియె చాలు

లౌకికములపై మీ లౌల్యంబు చాలు
మీకాలమును వాని మీద వెచ్చించి
యా కొంచెముల జొక్కి యన్యాయమగుచు
నా కాలు డరుదెంచ శోకించ నేల
రామ

కరుగును ప్రాయమ్ము కరుగును బలము
కరుగు నధికారమ్ము కరుగు మరియాద
హరినామపారాయణానంద మటుల
కరుగని దేముండు కాలమ్ము నందు
రామ

రాముని పదముల వ్రాలిన వారే
కామాదులను గెల్చి కడముట్ట గలరు
రాముని యాదినారాయణు డనుచు
మీమీ మనములందు ప్రేమించరయ్య
రామ


27, అక్టోబర్ 2016, గురువారం

ఉపచారము లేమి చేయుచుంటిమి


ఉపచారము లేమి చేయుచుంటిమి మేము నీ
కపచారము లొనరించెడు నల్పులమే కాక

నీవు ధర్మవిగ్రహుడవు నిత్యసత్యవ్రతుడవు
భావింపగ సత్యధర్మపథములకు మే
మావల వర్తించుచుండు నట్టి వారము మేము
మా వీఱిడిబుద్ధులతో‌ మంచిగ పూజింతుమే
ఉప

రాకేందువదన భావగ్రాహిరామచంద్ర య
స్తోక దయాసాంద్ర మాదోసములనంతము
నీ కెఱుకే మమ్ము కలి నీరసింప చేయుట
కాకున్న నీకు మేము కడుంగడు దాసులము
ఉప

నీ‌ నామము నాలుకపై నిలుపలేని వారమే
నీ నిరంజనాకృతిమది నిలుపలేని వారమే
నీ నిర్మలకథాపఠన నిరతిలేని వారమే
ఓ నిర్వ్యాజకృపాకృతీ యుద్ధరించరావే
ఉప


ఒక స్పందన - ప్రతిస్పందనలు - సమాధానం



విశ్వనాథవారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతన్నగారు అంధ్రీకరించిన భాగవతపురాణం తెలుగువాళ్ళకు ప్రాణప్రదం అయ్యింది. ఒకప్పుడు అందరిళ్ళల్లోనూ కనీసం దశమస్కంధం ఐనా తప్పని సరిగా ఉండేది. కేవలం‌ గృహాలంరణంగా కాదు. దానిని పారాయణం చేసేవారు. లేదా వీలుప్పడల్లా తన్మయత్వంతో పఠించేవారు.

కర్లపాలెం‌ హనుమంత రావు గారు తమ నాకు తెలిసిన లోకం అనే తమ బ్లాగులో ఇటీవల పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను వ్రాసారు.  (గమనిక: ఈ టపా ఇప్పుడు కనిపించటం లేదు.)

ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యను వ్రాసాను.  అక్టోబరు 24 ఉదయం 7:38ని॥ వ్రాసిన ఆ వ్యాఖ్య ఇదిగో:

ఎవరు వ్రాసారో ఈసంపాదకీయాన్ని!

శ్రీరామచంద్రమూర్తిని  రాజమ్మన్యుడు అని సంబోధించటం ఏమిటి? ఎంత విడ్డూరం! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హత లేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. పోనివ్వండి నానాటికీ జనం తెలుగును తమాషాగా వాడుతున్నారు! నిన్నమొన్ననే వచ్చిన ఒక సినిమా పేరు నాగభరణం. నాగాభరణం కాదు! ఒక్కడు కూర్చుని కథ వ్రాయవచ్చును కాని పదిమంది చేతులు వేయకుండా సినిమా తయారు కాదే, అలాంటిది ఆ సినిమాపేరులో ఉన్న తప్పు ఎవ్వరికీ తట్టలేదందామా లేక పట్టలేదందామా లేక నాగాభరణం కన్న నాగభరణమే వారికి నచ్చిందందామా? ఇంక తెలుగుకు దిక్కు లేదందామా చెప్పండి? రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా చంపుకుతింటుంటే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు.

'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలోనే పోతనామాత్యుడు  ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయంలో  సందేహాలున్నాయి. బమ్మెర ఆయన ఇంటిపేరైనంత మాత్రాన అది ఆయన నివాసస్థలం అన్నట్లుగా ఎలా వ్రాసేయటం? ఆయనిది ఓరుగల్లు అని ఒంటిమిట్ట అని వివాదపడుతున్నారే ఒక ప్రక్కన!



దదుపరి నాకు 25వ తారీఖున 11:32ని॥ ఒక స్పందన వచ్చింది.  అది ఈ విధంగా ఉంది:

నమస్తే! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హతలేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. అన్నారు కదా! సాధికారికమైన నిర్వచనం చూపిస్తే తప్పు ముందు ముందు జరగకుండా సరిచేసుకొనేందుకు వీలవుతుంది. రాజమ్మన్యుడు -కి మీరు చెప్పిన అర్థం వినడం నేనైతే ఇదే మొదటి సారి. శ్యామల గారూ! అలవోకగా వ్యాఖ్యానించి ఉంటే మాత్రం ఒక్క పదాన్ని పట్టుకుని సంపాదకీయం విలువ మొత్తాన్ని తగ్గించినట్లవుతుంది - అని నా భావన.

ఆ వ్యాఖ్య వచ్చిన మరి కొద్ది సేపటికి అంటే 25వ తారీఖున 11:58ని॥ సమయంలో మరొక స్పందన వచ్చింది. అది కూడా చూడండి:

రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు- అన్నారు, తెలుగు స్వరూప స్వభావాలు చెదిరిపోతున్నాయన్న మీ చింత కొంత అర్థం చేసుకోదగినదే కానీ.. మారుతున్న కాలం ప్రకారం భాష.. వ్యక్తీకరణలలో మార్పు రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాని విషయం అని నా భావన. సినిమావాళ్ల తెలుగు పరిజ్ఞానాన్ని ఈ టపాకింద ఉదహరించ తెలుగు చచ్చి పోతున్న విధానానికి నొచ్చుకోవడం సబబు కాదని.. అనిపిస్తున్నది నాకు. పోతన జన్మస్థలం గురించి మీరన్నట్లు బమ్మెర .. ఓరుగల్లా అన్న చర్చకు ఇది సరైన వేదిక కాదు. ఆ తరహా చర్చలక్ దిగేందుకు ఈ సంపాదకీయం కేవలం మౌలికంగా వివిధ భావాల సాహిత్య మాలిక. ఈ కారణాల చేత మీ వ్యాఖ్యానాన్ని ఆ బ్లాగు కింది వ్యాఖ్యలనుంచి తొలగించాలని అనుకుంటున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

కొద్ది సేపటి క్రిందట నాకు వచ్చిన పై స్పందనలకు సమాధానం వ్రాద్దామని ఆ పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను దర్శించయత్నిస్తే ఆ టపాయే కనిపించ లేదు. అందుచేత నా సమాధానాన్ని హనుమంత రావు గారికి తెలియజేయటం ఎలాగు?

అందుచేత ఇలా టపా ద్వారా వారికి సమాధానం వ్రాస్తున్నాను.

మొదట రాజమ్మన్యుడు అన్న మాట గురించి నేను చెప్పిన అర్థాన్ని ఆయన ఇంతవరకూ వినలే దంటున్నారు హనుమంత రావుగారు. కాని నేను చెప్పినది ప్రసిద్ధమైనదే కాని క్రొత్త విశేషం ఏమీ‌ కాదు.

మీరు ఆంధ్రభారతి - తెలుగు నిఘంటువు పేజీ లోపల పండితమ్మన్యుడు అన్న పదాని అర్థాన్ని చూడండి. మీకు శ్రమ అవసరం లేకుండా అక్క డేముందో క్రింద చూపుతున్నాను.


పండితమ్మన్యుడు

పండితమ్మన్యుడు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 
 సంస్కృత విశేషణము
        తన్ను పండితునిగా తలచుకొనెడివాడు.

పండితంమన్యుడు/పండితమ్మన్యుడు/ పండిత మాని : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 201
 [హిందూ]
        తనను తాను పండితుడుగా భావించు కొనేవాడు. 

ఇదేదో వెబ్-సైట్ నిఘంటువు కదా ఏమంత సాధికారికమైనది అన్న అనుమానం మీకు రావచ్చును. కాని వారు తమ అర్థానికి ప్రమాణాలనూ ఎత్తి చూపారు కదా. మీకు అనుమానం ఉంటే ఎవరైన వయోవృద్ధులైన తెలుగు లేదా సంస్కృతపండితులను సంప్రదించండి. నేను వయోవృద్ధులైన అనటానికి కారణం ఈనాటి తెలుగుపండితులలో అనేకులకు ఉన్న తెలుగుపరిజ్ఞానం  మరీ అంత నమ్మదగ్గది కాకపోవటమే.

హనుమంతరావు గారూ, నేను ఒకవేళ అలవోకగా వ్యాఖ్యానించానేమో అని అడుగుతున్నారు కాని అలాంటిదేమీ‌ లేదని నమ్మకంగా చెప్పగలను. ఒకవేళ నాకే అంత తెలుగులో పరిజ్ఞానం సరిపోకపోయినా నా బుద్ధికి ఎలా తోస్తే అలా అన్నానేమో అని మీరు విస్మయపడటంలో ఆశ్చర్యం‌ లేదు. అలా చేసే వారూ దండిగానే ఉంటారు, ఉన్నారు కూడా.


ఇకపోతే మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు అనటంలో అనౌచిత్యం ఏమీ లేదనే అనుకుంటున్నాను.

ఈ రోజున ప్రింట్ మీడియాలోనూ‌ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ‌ కూడా కనిపించే వినిపించే తెలుగు చాలా నేలబారుగానే ఉంటోంది.

మీడియా ప్రసక్తి అనుచితం అనుకోవద్దండి. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థిదశలో ఉన్నవాళ్ళకు మాతృభాష చుట్టుప్రక్కల ఉన్న మనుష్యుల ద్వారా ఎంత అవగాహనకు వస్తుందో అంతగానే మీడియాద్వారా కూడా అవగాహనలోనికి వస్తుంది. అందుకే వారికి కనిపించే వినిపించే భాషయొక్క స్వరూపస్వభావాల ప్రమాణాలను దిగజారనిస్తూ పోతూ‌ ఉదాసీనంగా ఉండి కాలం‌ మారుతోంది అనటం సబబు కానేకాదు.

పోతన జన్మస్థలం‌ ప్రసక్తి టపాలోనే ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యానించటానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు కదా.

మీరు నా వ్యాఖ్యను తొలగించా లనుకుంటే దానికి నా దగ్గర అభ్యంతరం లేదు. మీ బ్లాగు మీ‌ నిర్ణయం. మీకు నచ్చనిది మీరు తొలగించ వచ్చును దానికేమి.

ఐతే మొత్తం టపానే తొలగించటం ఆశ్చర్యం కలిగించింది.

ఈ టపా ఉద్దేశం కేవలం నా సమాధానాన్ని హనుమంతరావు గారికి తెలియ చేయటమే‌ కాని ఇదేదో వివాదం అని ఎవరూ ఊహలూ అపోహలూ చేయవద్దని అందరికీ మనవి.

నిజానికి హనుమంతరావు గారి ఉద్దేశం రాజమాన్యుడు అని చెప్పటం అనుకుంటాను. వారు కొద్దిగా పొరబడి రాజమ్మన్యుడు అన్నారు. ఐతే అర్థం సరిగా తెలియకుండా ఒక మాట వాడటం వలన అది శ్రీరామచంద్రమూర్తికి వారు చేయబోయిన పురస్కారం కాస్తా తిరస్కారంగా మారింది. ఉపచారం‌ కాస్తా అపచారం ఐనది. ఆ దోషం నాకు చాలా మనస్తాపం కలిగించింది.  భాషలో మెలకువలు పెద్దలనుండి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రకటించే ముందు అందరూ ఒకటికి పదిమార్లు సరిచూసుకొనక తప్పదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ‌కాలంలో ఒక కవిత ఐనా వ్యాసం ఐనా జనందాకా వెళ్ళటానికి అనేక దారులు సులభంగా దొరుకుతున్నాయి. కాబట్టి తప్పుల విషయంలో మరింతగా జాగరూకత వహించాలని అందరమూ  తప్పక గ్రహించవలసి ఉంది.

25, అక్టోబర్ 2016, మంగళవారం

నీవు దేవుండని యేవాని నమ్మెదో


నీవు దేవుండని యేవాని నమ్మెదో
జీవుడ వానినే చెందదవు

భూతప్రేతములను పూజించ నీవా
భూతాదులనే పొందెదవు
ప్రీతి దేవతల తగురీతుల గొల్చిన
ఖ్యాతిగ వారల కలసెదవు
నీవు

చపలత్వంబున సాగి యజ్ఞుడవై
కపటగురువు టక్కరిబోధ
నపదైవంబుల నారాధించిన
విపరీతయోనుల వేగెదవు
నీవు

మరల చెప్పగనేల మానక రాముని
పరదైవంబని లోనెఱిగి
నిరతము చింతించ నిష్కలుషుడవై
పరమపదమునే బడసెదవు
నీవు


పరులు తలచిన హరితోడ్పడవలె



పరులు తలచిన హరితోడ్పడవలె
హరిసంకల్పం బప్రతిహతము

అది యిది చేయుదు ననుకొను నరునకు
తుది జరుగునది తెలిసేనా
అది శ్రీహరికే విదితము కాక
మదిలో నెఱుగుట మనుజుని తరమా
పరులు

హరి నేమార్చగ నజుడెంచినను
పరికింపగ నది భగ్నంబాయె
హరి తాను గోగోపకానీక మైన
హరు వెరుగక నల్లాడెను కాదే
పరులు

సురలు ధర్మాత్ములు హరి వారి తోడు
సురవైరులను హరియణచు
నరుడై దశరథనందనుడై హరి
పరిమార్చడె రావణప్రభృతుల
పరులు


24, అక్టోబర్ 2016, సోమవారం

వినయగుణము నీయ నట్టి విద్యదండుగ



వినయగుణము నీయ నట్టి విద్యదండుగ
జనకసుతావరు నెఱుగని జన్మదండుగ

దానగుణము లేకుండిన ధనము దండుగ అభి
మానగుణోత్కర్ష లేని మనికి దండుగ
పూనికతో చేయకుండు పనులు దండుగ నిం
డైన భక్తి లేని పూజలన్న దండుగ
వినయ

బోధగురువు మాట వినని బుధ్ధి దండుగ ఒక
బాధగురువు నాశ్రయించ బ్రతుకు దండుగ
సాధకుడు కాని వాని చదువు దండుగ మరి
మాధవనిలయమ్ము కాని మనసు దండుగ
వినయ

కసరుచు వాదించుచు తిరుగాడి దండుగ దు
ర్వ్యసనంబులు దోచినట్టి వయసు దండుగ
రసనాద్యింద్రియములందు రక్తి దండుగ ఈ
వసుసుదతీత్యాదులందు భ్రాంతి దండుగ
వినయ


22, అక్టోబర్ 2016, శనివారం

ఇది శుభమని



ఇది శుభమని నిర్ణయించున దెవరు
ఇది యశుభంబని యెఱుగున దెవరు

పట్టభంగ మశుభంబని పౌరులు
పట్టరాని దుఃఖభావము నొంద
చెట్టరావణుని చీడవదలినది
యిట్టిది హరిలీల యెఱుగ రితరులు
ఇది

కొడుకు రాజగునని కోరిన వరములు
పడి చెఱచగ తన పసుపుకుంకుమల
నడిగిన శుభమున నశుభము కలెగె
నడచును హరిలీల లన నీ పగిదిని
ఇది

శుభమశుభంబని చూడగ నేటికి
విభుని లీలలని వేడుక నెంచక
అభయదాయకుడు హరి రాముండై
యుభయంబుల తోడుండగ మనకు
ఇది


మనసున రాముడు మాత్రము కలడని



మనసున రాముడు మాత్రము కలడని యనగలిగితివా యది మేలు
మనసిచ్చితివా రఘువల్లభుడు మరువక సేమము కూర్చునయా

హరి యాత్మీయుడు కరుణామయుడై యరుదెంచిన శుభసమయమున
నరుడా నీ వెటువంటి విధంబున జరిపెదవో నీ సేవలను
పరిపరి విధముల పరిచర్యలతో ప్రభువుకు మోదము కూర్చెదవో
పొరబడి నిర్లక్ష్యము చేసెదవో బుద్ధిహీనత బయలుపడ
మనసున

అక్కర వేళల పదుగుర కొకగది యమరించెడు విధమను నటుల
చక్కగ కామక్రోధాదులకును సవరించితివా హరిగదిని
నిక్కువ మాహరి నీచుల సరసన నిలువనేరక వెడలునయా
దక్కిన యవకాశంబును విడువక దశరథనందను కొలువవయా
మనసున

మనసు పాతసామానుల గది వలె మారుట మంచిదికాదు సుమా
పనికిమాలిన చెత్తనంతటిని పారవేసి సవరించవయా
మునుకొని హరిమయమగు తలపులతో మనసును తీరిచి దిద్దవయా
యినకులపతిమందిరమై యుండిన మనసే మనసని తెలియవయా
మనసున


21, అక్టోబర్ 2016, శుక్రవారం

అంతరంగమున హరి యున్నాడు



అంతరంగమున హరి యున్నా డిక
చింతలెక్కడి వీ జీవునకు

ఏజన్మంబున నెంచి పట్టెనో
యీజీవుడు హరిచరణముల
పూజలెన్నిటిని పొలుపుగ జేసెనొ
యోజకు వచ్చుచు నున్నాడిదిగో
అంత

రామనామమున రక్తిజనించిన
ధీమంతున కిక తిరుగేదీ
ప్రేమమయునిపై పెరుగగ మమత
కామితమన్యము కలుగుట యున్నే
అంత

వైకుంఠంబున భాసిలు శ్రీహరి
లోకోద్ధరణకు కాకుత్స్థుఁడుగా
ప్రాకటముగ రామభద్రుండై తన
లో కొలువుండగ లోటొకటున్నే
అంత


అదికోరి యిదికోరి యలమటించుటె కాని



అదికోరి యిదికోరి యలమటించుటె గాని
పదపడి దొఱకు కర్మఫలమొక్కటే మనకు

వెనుకటి భవముల మనమెఱుంగము కాని
మునుకొను నట్టి కాలమునకు మర పేమి
వెనునంటు సంచిత మనుభవింపక పోదు
కనుక కర్మత్రయము గడచు టది యెట్లో
అదికోరి

విదులకైన నహము వదిలించు కోన గాదు
చదువు సాముల నహము వదలుట కల్ల
మొదలైన హరిధ్యాస హృదయంబు నందు
కదలిక కలిగి యది కరుగుట జరుగు
అదికోరి

నరులందరకు రామనారాయణుడు దిక్కు
మరువక శ్రీరామమంత్రమును నోట
తిరముగా నెలకొల్పి పరమాత్మకృపతో
పొరిగొనదగు కర్మమూలంబు లెల్ల
అదికోరి


20, అక్టోబర్ 2016, గురువారం

నీ వుండగా నాదు భావంబున నిల్చి



నీ వుండగా నాదు భావంబున నిల్చి
యే వార లేమన్న నేమయ్య రామయ్య

పదిమంది పొగడిన ఫలమేమి కలుగును
కొదవేమి కొందరు తిట్టినను
ముదమున నన్నీవు వదలక యుండిన
నది చాలు పరులాడు నవి విన నేల
నీ వుండగా

మెచ్చి యొక రిచ్చు నవి మేలేమి చేయును
పుచ్చుకొని మురిసిముక్కలు గా
నచ్చంపు మేళుల నిచ్చు వాడవు నన్ను
గ్రుచ్చి యెత్తి మోక్షమిచ్చెదవు కాకేమి
నీ వుండగా

అన్యుల గణించిన నగును బహుబంధ
విన్యాస మది చాల వెగటని నీ
కన్య మెఱుగక యుందు నటులున్న చాలదే
ధన్యత్వమును చెంద దాల్చిన జన్మంబు
నీ వుండగా


ఏ మందు మో రామ



ఏ మందు మో రామ ఈ నాడు రావణు
ప్రేమించు వారును పెరుగుచున్నారయ్య

ఆలి నెత్తుకపోయి నట్టివానిని నీవు
కోలనేసితివని కోపింతురయ్య
కూళలు వారైన కోపించి పెనగరో
ఆలి నన్యులు పట్ట నానంద పడుదురో
ఏ మందు

దళితుడందురు వారు దశకంఠు వింటివా
దళితుడా యబలల బలిమిని బట్టి
దళితుడా లోకాల దర్పించి మొత్తి
దళితు డనుమాట కర్థంబునే తెలియరే
ఏ మందు

బలహీనులను కాపాడుట ధర్మమని
ఇల నాచరించి చూపిన వాడ వీవు
తెలియ నొల్లని వారి దీనతను ద్రుంచి
కలకదేర్చ వలయు కాదనక శ్రీహరి
ఏ మందు


18, అక్టోబర్ 2016, మంగళవారం

వివిధము లైనను మార్గములు



వివిధము లైనను మార్గములు తుది
    వెన్నుని చేరెద రందరును
ప్రవిమలురు ఘనపాపులును
    భగవంతుని తప్పక చేరెదరు

గిరిశిఖరంబును చేరుకొనుటకు
    తరచుగ నెన్నో మార్గముల
నరయగ సుగమంబుమలు కొన్ని
    మరియును దుష్కరములు కొన్ని
నరుడే మార్గము పట్టిపోయినను
    నమ్మకముగ శృంగము చేరు
పొరి యత్నంబున చేరుదురు
    ముందువెనుకగ నందరును
వివిధము

నదిని దాటుటకు పద్ధతులనగ
    నరులకు తెలియును విశదముగ
వదలక యీతకొట్టు వారలును
    పదిలముగా పడవెక్కు వారలును
గదిసి వంతెనను దాటు వారలన
    కనుగొన మూడు విధంబు లిటు
ముదమున నరులు నదిని దాటుదురు
    ముందువెనుకగ నందరును
వివిధము

చేరి ప్రేమతో సేవించినచో
    శ్రీహరి చెంతను మురిసెదరు
వైరభావమును పూని మెలగినను
    వదలడు హరి రప్పించు కొను
నారాయణుని శీఘ్రమ చేరగ
    నామస్మరణం బుత్తమము
శ్రీరామా రఘరామ పాహియని
    చేయుడి నామము మరువకను
వివిధము


అందరకు పతియనగ హరియొక్కడే



అందరకు పతియనగ హరియొక్కడే మన
కందరకు గతియనగ హరియొక్కడే

తల్లియగుచు తండ్రియగుచు తనరుచు లోకంబుల
నెల్లవేళలను హరియే కద ప్రోచును
చల్లని స్వామి వాని సంగతియే యందరకు
కొల్లగా సుఖములు కురిపించు తనివార
అందరకు

భక్తిసిద్ధాంతముల యందు పాండిత్యము లేదా
భక్తులను తెలియ నీ వలనగాదా
శక్తికొలది శ్రీహరిని స్మరియించ గలుగుదువా
యుక్తి యదే చాలు హరి యుండు నీకు ప్రీతుడై
అందరకు

రాముడై కృష్ణుడై రాకాసులనణచివైచి
భూమినేలినవాడు పురుషోత్తముడు
కామాది రిపుగణక్షయము చేసి నిను కాచు
రామరామరామ యనుటె రక్షయగును నీకు
అందరకు


కల్క్యావతారము



కలిదురాగతములు ఖండింపంగ
నిలపైన కల్కివై వెలసెదవు నీవు

తులువలు ధరనాక్రమించి దోపిడికాండ్రై
కలిపురుషుని యండతో కావరంబున
పలుబాధలు పెట్టుచుండ ప్రజావళిని కావ
వెలసెదవు నీవు విష్ణుయశుని కొడుకువై
కలి

హరియజ్ఞము లేమి హరిచరితము లేమి
హరినామము లేమి యంతరింపగ
హరి నీవు వత్తువు లోకావనశీలుండవై
మరల పుడమిపైన సత్యమార్గము వెలుగ
కలి

శ్రీమన్నృసింహుడవై చెండి కనకకశిపుని
రాముడవై రావణుని రాల్చినావు
భూమిభారము కృష్ణమూర్తివై తీర్చితివి
నీ మహిమము చేత కలినిర్మూలిత మగును
కలి


17, అక్టోబర్ 2016, సోమవారం

బుద్ధావతారం



బుద్ధివాదముల జూప పురుషోత్తముడు
బుద్ధుడై ధరణిపై బుట్టినాడు

తపజపహోమాదికతత్పరు లయ్యు జగ
దపకారులగుచు నధికులై
విపరీతముల జేయు కపటదైత్యులకు
చపలత్వము కల్గి బుధ్ధిసత్త్వమడగ
బుద్ధి

వేదము లందున వివరంబుల తర్క
వాదంబుల జొచ్చి పలుకుచు
భేదించెను దైత్యవరుల బుధ్ధులెల్ల
మోదించి సురలంత మొత్తి రసురులను
బుధ్ధి

తమకే తపములు తమకే వేదములు
తమకే భోగమని తలచుచు
తమకంబున నున్న తన్నడే వెన్నుండు
భ్రమలణచడె నాడు రాముడై రణమున
బుద్ధి


15, అక్టోబర్ 2016, శనివారం

లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము



లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము
మా కష్టము శ్రీరామ మన్నింపుము

మొదట భువనముల జేసి ముచ్చటగా నీవు
పదునాలుగు సుందరముగ భాసించ
తుదిలేని క్రీడ నొండు మొదలిడితివి గాద
యిదిగిదిగో యీజీవుల మిచట నాడగ
లోక

మరియాద కప్పుడపుడు మామధ్య కరుదెంచి
పరమదివ్యలీలలను పచరించి
అరిగెదవు క్రీడాంగణ మంతయు సరిజేసి
పరుగిడిపరుగిడి మేము బడలితి మయ్య
లోక

ఆడలేక మొత్తుకొను నట్టి జీవాళి మయ్య
వేడుకొందు మొక్కింత విశ్రాంతి
ఆడించువాడ మా కానతి దయచేయ వయ్య
వేడకతో తొల్లింట విశ్రమించు డనుచు
లోక


గోపగోపీజనసంతోషరూప గోపబాల



గోపగోపీజనసంతోషరూప గోపబాల
పాపకదళీవనకుఠారరూప గోపబాల

నారదాదిసుజనహృద్విహారి గోపబాల
క్రూరకంసనిర్మూలనకుశల గోపబాల
దారుణారివర్గవిదళనదక్ష గోపబాల
ధారుణీభారాపనయనధీర గోపభాల
గోప

రూపవిజితశతశతమదనాటోప గోపబాల
పాపరాజగర్వవిదళనకోప గోపబాల
చాపధరశ్రీరామచంద్రరూప గోపబాల
తాపహరణశీల కలిసంతాప గోపబాల
గోప

పాహి దీనజనావనశీల పాహి గోపబాల
పాహి పార్థవిజయకారణ పాహి గోపబాల
పాహి భక్తజనసందోహవరద గోపబాల
పాహి పాహి విష్ణుదేవ పాహి నందబాల
గోప


14, అక్టోబర్ 2016, శుక్రవారం

మా రామచంద్రు డండి మంచివా డండి



మా రామచంద్రు డండి మంచివా డండి
నారాయణమూర్తి యండి నమ్మండి

అతిమనోహరుడండి అందాల గని యండి
ప్రతిలేని వీరు డండి రామచంద్రుడు
సతి సీత నెత్తుకొని జనిన రావణుని బట్టి
చితుకగొట్టి చంపె నండి చెలగి యీ కోదండి
మా రామ

పరమ కారుణికుడండి పగవాడే అలయుచో
మరల రేపు రమ్మనే మంచి వాడు సుండి
పరమధర్మమూర్తి యండి పగతుని తమ్ముడికి
శరణమిచ్చి రాజ్యమిచ్చు సాత్వికుడండి
మా రామ

సురరాజ సేవ్యు డండి శుభ్రప్రకాశు డండి
హరవిరించి వినుతుడండి ఆదిపురుషు డండి
పరమయోగిసేవ్యు డండి భావనాతీతు డండి
నరులారా రండి రండి నమ్మి సేవించండి
మా రామ




నా కెందు కాస్వర్గము



నా కెందు కాస్వర్గ మేకోరికయు లేని
నా కెందుకు దాని సౌకర్యము

నీ నామమది యిచ్చు నానందమే చాలు
నే నితరముల కోర బోనయ్య
నా నాలుకకు రుచి నీ నామమే కాక
యా నాకమందున్న యమృతంబును కాదు
నా కెందుకు

నా మానసంబున నీ మూర్తి యుండగ
కామితంబులు వేరు కలిగేనా
ఏమేమొ భోగాల కిరవైన స్వర్గంబు
పై మోహపడుదునా పరికించి చూడ
నా కెందుకు

శ్రీరామచంద్రుడ చేయెత్తి మ్రొక్కెద
నా రొంపిస్వర్గంబు నట్లుంచుమా
ఈరేడులోకాల నేలు నీ యండయే
పారమ్యమని నేను భావింతు నయ్య
నా కెందుకు


13, అక్టోబర్ 2016, గురువారం

గజేంద్ర మోక్షమా - గజేంద్రమోక్షణమా?


హరిబాబు గారు ఈనెల ఏడవ తారీఖున ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసారు:

ఒక చిన్న ముఖ్యమైన సందేహం,గజేంద్ర మోక్షం కధని "గజేంద్ర మోక్షణం" అని మాత్రమే అనాలి,ఆ సనివేశంలో మోక్షం ఇవ్వలేదు - కేవలం మకరి పట్టునుంచి విడిపించటం మాత్రమే జరగడం వల్ల మోక్షణం అనాలి అని ఒకరు చెప్పగా విన్నాను.కానీ నేను మీకిచ్చిన లింకు దగ్గిర గజేంద్ర మోక్షంకధా ప్రారంభం అని ఉంది.వ్యాసవిరచిత మూలంలో ఎలా ఉంది? 

ముందుగా పోతనామాత్యుల రచన చూదాం. ఆయన అష్టమస్కందంలో 135వ పద్యంలో 'ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణకథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబు' అని శుకయోగీంద్రుని వాక్యంగా రచించారు. ఆ పద్యం పూర్తిపాఠం ఇదిగో.

సీ. నరనాథ! నీకును నాచేత వివరింపఁ
    బడిన యీ కృష్ణానుభావమైన
గజరాజమోక్షణకథ వినువారికి
    యశము లిచ్చును గల్మషాపహంబు
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ
    బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన
    విప్రులకును బహువిభవ మమరు

తే.గీ. సంపదలు గల్గుఁ బీడలు శాంతిఁ బొందు
సుఖము సిద్ధించు వర్థిల్లు శోభనములు
మోక్ష మఱచేతిదై యుండు ముదము చేరు
ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.


ఇక సంస్కృతభాగవత పురాణం చూదాం.

వ్యాస భాగవతంలో
 అష్టమస్కందం మొదట్లో ఒకశ్లోకంలో

తత్రాపి జజ్ఞే భగవాన్హరిణ్యాం హరిమేధసః
హరిరిత్యాహృతో యేన గజేన్ద్రో మోచితో గ్రహాత్

అని ఉంది. మోచనం అంటే విడిపించటం (మన తెలుగువాళ్ళకు విమోచనం అన్నమాట బాగా పరిచితమైనదే)

హరివలన మకరిపీడ తొలగిన గజేంద్రుడి సంగతిని ఇలా వ్యాసభాగవతం చెబుతున్నది.

గజేన్ద్రో భగవత్స్పర్శాద్విముక్తోఽజ్ఞానబన్ధనాత్
ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః

పోతనగారి సీసపద్యం మొదట ఉదహరించాను కదా, దానిమూలం వ్యాసప్రోక్తంగా ఇలా ఉంది:

ఏతన్మహారాజ తవేరితో మయా
కృష్ణానుభావో గజరాజమోక్షణమ్
స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం
దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్

అని.

శాపగ్రస్తుడైన ఇంద్రద్యుమ్నుడనే రాజు ఏనుగైనాడు. ఆయనకు కలిగిన మోక్షణం కేవలం మకరినోటి నుండే కాదు, హరిధ్యానంలో ఉండి అగస్త్యముని రాకను గమనించని కారణంగా పొందిన శాపం నుండి కూడా. అంతే కాదు భవబంధాలనుండి కూడా మోక్షణం పొందాడు. అదే మోక్షం. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములనే చతుర్విధముక్తుల్లో ఒకటైన సారూప్య ముక్తి ఆ గజరాజుకు హరిప్రసాదంగా లభించింది.  అందుకే గజేంద్రుడు ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః అయ్యాడు. అనగా భగవంతుని రూపాన్నే పొందాడు అయన వలెనే పీతాంబరధారి అయ్యాడు చతుర్భుజములనూ‌ పొందినాడు. అంటే గజరాజు ఇంక ఏనుగు వలె కాక విష్ణువువలె ఉన్నాడు అని కదా పిండితార్ధం. 

దీనికి మరొక సాక్ష్యం గజేంద్రమోక్షణానంతరం గజరాజుతో హరిపలికిన మాటలే. ఇంకా శంక ఉంటే ఏదో రకంగా, అది కూడా తీర్చే మాటలు హరిప్రోక్తములే ఉన్నాయక్కడనే.

యే మాం త్వాం చ సరశ్చేదం .... అని మొదలు పెట్టి చివరన

యే మాం స్తువన్త్యనేనాఙ్గ ప్రతిబుధ్య నిశాత్యయే
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిమ్

అని చెబుతాడు శ్రీహరి. హరి మాం..త్వాం.. అనటం‌ గమనించండి. నన్నూ, నిన్నూ అని మొదలు పెట్టి స్తవనీయమైన మరికొన్ని విభూతులనూ పేర్కొని వీటిని స్మరించిన వారు ముచ్యన్తే తేఽహసోఽఖిలాత్ - అనగా అన్ని బంధాలనుండీ విముక్తులైపోతారని చెప్పాడు హరి. అంతే కాదు వారికి ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతిని ఇస్తాననీ‌ చెప్పాడు. విమలగతి అంటే మోక్షం. ఈ‌గజేంద్రస్మరణంతోనే మోక్షాధికారసిద్ధి అంటే ఆ గజరాజుకు మోక్షం వచ్చిందా అని మరలా ప్రశ్న వేసుకోవలసిన అగత్యం ఉందా?

పరమశివుని శిష్యుడీ పరశురాముడు



పరమశివుని శిష్యుడీ పరశురాముడు
కర మఱుదగు విక్రమంబు కలిగినవాడు

జవమున క్రౌంచమును హంసలపాలు చేసి
శివు డిచ్చిన పరశువును చేతబట్టినాడు
అవలీలగ కార్తవీర్యార్జును పొగరణచి
కువలయపతిజాతిని కుళ్ళబొడిచినాడు
పరమ

భూమి నెల్ల కశ్యపుడను ముని కిచ్చినాడు
భూమీశులపైన పగను పోనడచినాడు
తామసము విడచినాడు తపసియై నాడు
ఆ మహేంద్రగిరివరం బందు నిలచినాడు
పరమ

విష్ణుమూర్తి యంశయై వెలసినాడు భువిని
విష్ణుసోదరికి పరమ వీరభక్తు డతడు
విష్ణుచాపము రామ విభుని చేతి కిచ్చి
విష్ణువే రాము డనుచు వినుతి చేసినాడు
పరమ


తప్పు పట్టకుండ చెప్పవయ్య



పుట్ట నేమిటికయ్య కిట్ట నేమిటికయ్య తప్పు
పట్టకుండ చెప్పవయ్య భగవంతుడా

పుట్టువారలను కొంద రిట్టిట్టి వనరాని
చెట్టబుద్ధులతోడ చెలరేగ
గట్టిగ నీపాద కంజాతముల దోయి
పట్టి కొందరు భక్తివరు లౌదురే
ఏ పవలైనా

చుట్టపు చూపుగ చొచ్చుచు భూమిని
వట్టి యాశలవెంట పరువెత్తి
యుట్టి చేతులతోడ నుర్వి జనావళి
మట్టి కలయుటలోని మర్మ మదెట్టిది
ఏ పవలైనా

శ్రీరామ నీనామ చిన్మంత్రరాజంబు
కారుణ్య మొప్పంగ కావంగ
నోరారా జపియించ నేరక మానవు
లూరక శోకింతు రిది యేమయ్య
ఏ పవలైనా


12, అక్టోబర్ 2016, బుధవారం

ఆడే బొమ్మల నాడనీ



ఆడే బొమ్మల నాడనీ పలుకాడే బొమ్మల నాడనీ
యాడేపాడే బొమ్మలకు నిను వేడే వేడుక తీరనీ

నీవే యూదిన యూపిరి తోడ నిలచియాడు నీబొమ్మలు
నీవు చేయు కనుసన్నల వెంబడి కదలియాడు నీబొమ్మలు
నీ వొనరించిన యాడేపాడే నీవినోదపు బొమ్మలు
నీ వాడించే యాట లన్నిటిని హాయిగ నాడే బొమ్మలు
ఆడే

నీవు నేర్పిన పలుకులన్నిటిని నిరతము పలికే బొమ్మలు
నీవు పాడమని నేలకు పంపిన నేర్పు గలిగిన బొమ్మలు
నీ విధమంతయు పాటలు కట్టి నిత్యము పాడే బొమ్మలు
నీ వాల్లభ్యము పట్టి నిత్యమును నిన్ను భజించే బొమ్మలు
ఆడే

మర్మమెఱింగియు నీ ముచ్చటకై మానక నాడే బొమ్మలు
కర్మబంధములు గడచి నిలచి నీ ఘనతను పాడే బొమ్మలు
నిర్మలమైన హావభావముల నీవు మెచ్చిన బొమ్మలు
ధర్మవిగ్రహ రామచంద్ర నీ తత్త్వ మెఱింగిన బొమ్మలు
ఆడే




హరిభక్తి యున్న చాలు నన్యము లేల



హరిభక్తి యున్న చాలు నన్యము లేల ఆ
పరుసవేది యున్న పెఱవస్తువు లేల

భూమినేలువాని స్నేహ మొప్పుగ నున్న
గ్రామాధికారి నంటకాగుట యేల
రామచంద్రు నాశ్రయించ లబ్ధి యుండగ
సామాన్యుల వలన గల్గు సంపద లేల
హరిభక్తి

పూతగౌతమీ పాయ పొంతనుండగ
నూతినీటి స్నానముల న్యూనత లేల
చేతోమోదముగ రామసేవ దొరుకగ
ప్రీతిమీఱ నొరుల సేవింప నేల
హరిభక్తి

శ్ర్రీరాముని కృప నీకు చేరి యున్న
ఆరాటపడ నేల నన్యుల దయకు
తారాధ్వం బెల్ల గతి తప్పును కాక
నీ రాముడు నీవాడే నిశ్చయముగను
హరిభక్తి


చెలులాల కోరిటు చేరి నుతించఁగ (అన్నమయ్య)



చెలులాల కోరిటు చేరి నుతించఁగ
అలమేల్మంగకు నమరినవి

పూవుబాణములు పొదిసేసె మరుఁడు
కావవి నవ్వులు కాంతవి
భావించ మందపవనుఁడు మలసెను
తావి వూరు పిది తరుణిది
చెలులాల

మొదల నారదుఁడు మోయించె వీణెను
అది గాదు మాఁట లంగనవి
చదల నదివో యరసంజె వొడమె నిటు
మదరాగము లవి మానినివి
చెలులాల

మెఱుఁగులు మెరిచీ మింటను మేఘము
యెఱఁగలేరు కళ లింతివి
అఱిముఱితీగె మా కంటెను కా దింతి
యెఱుకల శ్రీవేంకటేశును గూడె
చెలులాల



వ్యాఖ్య:

ఇది ఒక చమత్కారపూరితమైన సంకీర్తనం.

ఈ సంకీర్తనకు ఒక నేపథ్యం చూదాం.

శ్రీవారు అంతఃపురానికి విజయం చేస్తున్న సందర్భంగా చెలికత్తియ లందరూ అమ్మవారు అలమేలు మంగమ్మను చక్కగా ముస్తాబు చేస్తున్నారు.

అసలే అమ్మవారు జగత్తులో అన్నివిషయాల్లోనూ‌ తనకంటే అధుకులే లేనిది. అసలు తనతో పోటీ వచ్చే సమానులే లేరు. అందుకే ఆవిడ సమానాధికవర్జిత.

అందుచేత అసలే త్రిలోకసుందరాకార ఐన ఆమె ఆ ముస్తాబుతో‌ మరింతగా శోభిస్తూ ఉంటే చెలికత్తెలకే మతిపోయి ఆమెను అద్భుతంగా ప్రస్తుతిస్తున్నారు.

అప్పుడొకామె చమత్కారంగా ఇలా మిగిలిన వారితో‌ అంటున్నట్లు ఈ సంకీర్తన ఇలా చెబుతున్నది.

మీరంతా అమ్మ సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నారు . బాగుంది. చాలా బాగుంది.

మీరేదో అనేక యితరవిషయాలనూ ముచ్చటించి వాతావరణం  మరింత శృంగారోద్దీపకంగా ఉందంటున్నారు. కాని మీరు చెప్పే వన్నీ మన అలమేలు మంగమ్మకే అతుకుతున్నాయి సుమా.

ఏమిటీ మన్మథుడు వచ్చి పూల బాణాలు గుత్తులు గుత్తులుగా విసురుతున్నాడా. అబ్బెబ్బె అది కాదు. అవి పువ్వులు కావు అమ్మ నవ్వులు. (అమ్మ నవ్వులే పూబాణాలకన్నా కూడా శృంగారోద్దీపనకరాలు!)

మెల్లమెల్లగా ఆ పూల సువాసనలను పరిచయం చేస్తూ చిరుగాలి వ్యాపిస్తోందంటున్నారా. కాదు కాదు. అలమేల్మంగమ్మ ఊపిరిపీల్చి వదలుతున్న గాలి యొక్క సువాసన ఇలా వ్యాపిస్తోంది కాని మరేమీ‌ కాదు. వాడి ముఖం. అమ్మ నిట్టూర్పుల సువాసనలకన్న ఆ మన్మథుడు ఎవడో వాడు విసిరే పూవుల తావి గొప్పదా, మతిలేక పోతే సరి!

మెల్లమెల్లగా ఎంతో మధురంగా మీకు వీణానాదం వినిపిస్తోందా. నారదమహర్షి వచ్చి అమ్మవారి దర్శనం కోసం బయట వేచి ఉండి వీణ వాయిస్తున్నాడని అనుకుంటున్నారా. అయ్యో మీ పిచ్చి కాని ఈ సమయంలో ఇక్కడికి నారదమహర్షి ఎందుకు వస్తాడమ్మా? అది వీణానాద‌ం‌ కాదు. అమ్మ మెల్లగా మాట్లాడుతుంటే ఆమాటల తీయందనమే మీకు వీణానాదంలాగా శ్రవణమాధుర్యం కలిగిస్తున్నది. తెలిసిందా?

సాయంకాలం‌ అయ్యింది. అదిగో ఆకాశం ఎరుపెక్కినది అనుకుంటున్నారా?  ఇంకా పొద్దుపోలేదు కానీ ఆ సంధ్యారాగం కాదు మీరు చూస్తున్నది. శ్రీవారు విచ్చేసే సమయం అవుతున్న కొద్దీ, అమ్మముఖంలో అయ్యవారి తలంపులతో అలముకున్న అరుణిమ అది.

ఆకాశంలో ఏమనా మెఱుపులు వస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? వస్తే రానీయండి. శ్రీవారి దివ్యరథం రావటానికి ఏమన్నా వానాగీనా అడ్డేనా ఏమిటి. కానీ ఆకాశంలో మెరుపులేమీ‌ రావటం‌లేదు చూడండి. మీకు కనిపిస్తున్నవి అమ్మ చక్కదనాల కళలే కాని మరేమీ కాదు. ఆవిడ కదలికలే మీకు కళ్ళకు మిరుమిట్లు కొల్పుతున్నాయి కాని తదన్యం ఏమీ‌ కాదు. (స్త్రీపురుషుల శరీరాలలో పదహారేసి కళాస్థానాలుంటాయి. అవి స్త్రీలకు పురుషులకు వేరువేరు. చంద్రుడి కళను అనుసరించి అవి దినదినమూ ఒక్కొక్క స్థానం ప్రముఖంగా శృంగారోద్దీపనకరంగా ఉంటాయి. ఈచరణంలో వాటి ప్రసక్తి కాదు, శరీరలావణ్యపు మెరుపులను గురించి మాత్రమే ప్రస్తావన)

ఇలా చెలికత్తియలు తమలో తాము తర్కించు చుండగానే శ్రీవారు దయచేయటమూ అమ్మవారు వారిని అభ్యంతరమందిరం లోనికి తోడ్కొని పోవటమూ జరిగింది.

తమ తమ చర్చావినోదంలో ఎవరూ గమనించనే లేదు. అంటే అంత నిశ్శబ్దంగా వారు తప్పుకున్నారన్నమాట.

అప్పుడా గడుగ్గాయి మిగిలిన వారితో‌ ఇలా అంటున్నది. ఏమిటీ మనమేమన్నా మరులుతీగ తొక్కామా అంతా ఇంద్రజాలంలాగా ఉందీ. ఇప్పటి దాకా ఇక్కడే ఉన్న అలమేలు మంగమ్మ ఏదీ అని అనుకుంటున్నారా.  భలే. మీరేమీ మైమమరపుకు గురికాలేదు ఏదో త్రొక్కి.  అదంతా అమ్మవారూ అయ్యవారూ చేసిన చోద్యం.  ఇప్పుడు అమ్మవారు అయ్యవారి సాన్నిధ్యంలో ఉన్నారు సుమా. ఇంక పదండి మనతో ఎవరికీ‌ పనిలే దిక్కడ.


అంతరార్థం:

ప్రపంచం అనేది ఒక వ్యావహారికసత్యం. అంటే నిజానికి అది లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తుందన్నమాట. విశ్వం దర్పణదృశ్యమాన నగరీ తుల్యం అని ఉక్తి. కాని జీవుడికి సంబంధించినంత వరకూ ఈ ప్రపంచం నిజంగానే ఉంది. జీవుల సంఖ్య ఇంతని చెప్పనలవి కాదు కాబట్టి అందరు జీవులకూ నిజంగా ఉన్న ప్రపంచ వ్యవహారం‌కోసం ఉన్నట్లే చెప్పుకోక తప్పదు. జూవులకు ప్రపంచంలోని ఇతరమైన అన్నింటి లాగా ఇతర జీవులూ వాటి వ్యవహారాలూ కూడా సత్యమేను.

ఈ‌ప్రపంచంలోని జీవులకు నేను - నాది, నీవు - నీది వంటి మాటలు లేకుండా వ్యవహారాలు లేవు. ప్రపంచం నిజాంతర్గతం అని ఉక్తి. కాని తెలియలేము. కాబట్టి అన్ని వ్యవహారాలూ కూడా బయటి వస్తువులూ చర్యలు గానే ఉంటాయి.

జీవుడి సకలవ్యవహారాలూ అతడి లోనుండే వస్తున్నాయి. అతడు చూసే వ్యవహరించే ప్రపంచమూ అతనిదే. అది అనుభవంలోనికి రావటమే స్వస్వరూపజ్ఞానసిద్ధి.

అంతకు ఒకింత క్రింది స్థాయిలో ఉన్న జీవులు అటువంటి ముక్తజీవులను గమనించి మీరు ప్రపంచవ్యవహారం అనుకుంటున్నది నిజానికి ముక్తజీవుడి విషయంలో అంతా స్వగతమేను అని గ్రహించ గలరు. ఈ సంకీర్తనంలో విషయం వివరిస్తున్న చెలి అటువంటి ముక్తజీవికి సమీపవర్తిని ఐన ఉన్నత జీవి అన్నమాట.

స్వస్వరూపజ్ఞానావస్థ కలిగిన ఆ జీవియే ఇక్కడి నాయిక అన్న సంగతి మరలా వివరించనవసరం లేదు కదా.

పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటం‌ జరగటం అంటే స్వాత్మానందస్థితిలో ఉండటం.

ఆ స్థితిలో ప్రపంచవ్యవహారం లేదు.

అందుచేత వారు బహిఃప్రపంచాన్ని విసర్జించటాన్నే ఇక్కడ ప్రస్తావించారు. బహిఃప్రపంచం వారికి దూరమై సంభ్రమాన్ని పొందటం అని చెప్పి.

తత్పూర్వరంగంగా ప్రపంచంలోని వ్యవహరం అంతా ఆ జీవుడిదే అని శృంగారపరమైన భావనలద్వారా సూచించారన్నమాట.

ప్రపపంచవ్యవహారోపశమనం జరిగితే ప్రపంచం‌ సంభ్రమంలో మునుగుతుంది - అదింకా స్వస్వరూపజ్ఞానావస్థకు చేరని వారితో నిండినది కాబట్టి.



వామనావతారం



చిన్నివటువు చిత్రాలు చెప్పతరమా వాని
వన్నెచిన్నె లెన్నగా బ్రహ్మతరమా

ఆకాశదేవతయే యందించెనట గొడుగు
ఆ కమండల మిచ్చె నంట నలువ
తేకువతో గొన పూర్ణదీక్ష గౌరి యిచ్చెనట
ఆ కుఱ్ఱవాడు నాయింటి కరుగుదెంచె
చిన్నివటువు

ముద్దుకుఱ్ఱని జూచి ముచ్చటపడి కోరుమన
ముద్దుగ కోరెను మూడడుగులు
వద్దువద్దని గురువు వారించుచుండగా
నొద్దికరంబైన దానమొసగితి నయ్య
చిన్నివటువు

కొలువ రెండడుగుల కువలయమును దివిని
తలనిచ్చితి కొలువగ తక్కినదాని
అలనాటి వామనుడే యిల నేటి రాముడని
బలి పలికిన రావణుడు తెలియకపోయె
చిన్నివటువు



11, అక్టోబర్ 2016, మంగళవారం

దశరథరామయ్య దండు వెడలి నాడు



దశరథరామయ్య దండు వెడలి నాడు
దశముఖరావణు దండింపగా

హరిసోదరి దుర్గ వరవిక్రమాన్వితుని
పరమదుస్సహుడైన పాపాత్ముని
గరువంపు మహిషాసురుని ఘోరాజిని
విరచిన దినమైన విజయదశమి నాడు
దశరథ

గజముఖు నర్చించి కమలాక్షు సోదరి
విజయదుర్గకు పూజ వెలయించి
విజయరాఘవమూర్తి వెడలెను లంకపై
విజయదశమినాడు ధ్వజమెత్తి
దశరథ

నాడు క్లీంకారంబు నాలుకపై నున్న
వాడు సుదర్శనవసుధేశు
తోడై రక్షించిన దుర్గమ్మ దీవింప
వేడుక మీఱగ విజయదశమి నాడు
దశరథ


నృసింహావతారస్తుతి



భయదదంష్ట్రప్రభాప్రకటనాద్భుతరూప
జయశీల రణశీల స్వామి నరసింహ

వరసిద్ధదోర్ధర్పదుద్భరార్భటివాని
సురయక్షగంధర్వనరసిద్ధసాద్ధ్యకి
న్నర హింసనుని హిరణ్యకశిపు నుద్ధతుని
చరచితివి ప్రహ్లాదవరదనరసింహ
భయద

కినిసి సుజన పీడాకృతిని దితిసుతుని
పెనగి సంధ్యావేళ పెందొడల పైన
నునిచి చంపితివి తదుదరాంత్రమాలికా
ఘనగళాభరణసంగ్రహణనరసింహ
భయద

వసుధాదిభువననిర్వహణనరసింహ
అసురేశగర్వాపహరణనరసింహ
అసురుడావలరావణాకృతి గొన వాని
కసిమసగ రాముడై గదియు నరసింహ
భయద


నిడుదనామాలవాడ నీవారి కెదురేది



నిడుదనామాలవాడ నీవారి కెదురేది
బెడదలు వదిలించు వీరుడ వీవుండ

హరిభక్తులను చెనక నతనుడు వెనుదీయు
హరికొడుకే‌ కద యతడనగ
హరికన్యులను బుద్ధి ననుసరించెడు వారి
మరి వదలక వాడు చిరచిర లాడించు
నిడుద

చేసెడు పనులెల్ల చేయెత్తి నీయందు
దాసభావన నుంచి ధన్యులరై
నీ సేవ నుండు వారి దోసమెంచగ లేక
వేసరి వెనుదీయు నా సమవర్తి
నిడుద

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచును
నిరతచింతనులై నిర్మలులై
కోరి కొలిచెడివారి కొంగుబంగారమై
చేరి నీవుండ కలి చేష్టలుడిగి యుండు
నిడుద


10, అక్టోబర్ 2016, సోమవారం

యజ్ఞవరాహావతారం



అవతరించినాడే ఆది యజ్ఞవరాహమై
అవనీపతిహరి గుర్గురారావము వాడై

నలువముక్కు నుండి నలుసంతగ పుట్టి
తెలియునంత లోనె కులగిరులకు మించి
తులువ హేమాక్షుని త్రొక్కి చీరి జంపి
యిలను సుఖము శాంతి వెలయ జేయగను
అవత

స్వామి యొడలు దులుప జారిన రోమములు
భూమిపైని దర్భలన పొలుపుమీఱ పెరిగె
రోమముల నంటిన స్వామిపాదధూళి
యే మొదటి పిండత్రయ మీయిలపై పితరులకు
అవత

ఔరా హరిసతిని అసురుడు కొనిపోయె
దారనపహరించ దండించడె వేగ
శౌరి నిజసతికై పోరాడెను కిటియై
పోరె మరల సతికై శ్రీరాము డగుచును
అవత


9, అక్టోబర్ 2016, ఆదివారం

హరిని నమ్మితే అంతా శుభమే



హరిని నమ్మితే అంతా శుభమే
నరుని నమ్మితే నాశనమే

ధనమే సుఖమను ధనమే బలమను
ధనమే హితమని మనుజుడను । ఆ
ధనలక్ష్మికి మగడగు శ్రీహరినే
మనసున నెన్నుట మంచిదియా
హరిని

కామితార్ధములు కలుగువిధములను
భూమిని పెక్కురు బోధింతురు । ని
ష్కాములు ధన్యులు కావున హరిపై
ప్రేముడి నుండుట క్షేమమయా
హరిని

తప్పుడు గురువులు తరణోపాయము
చెప్పుచు మోసము చేయుదురు ।రా
మప్పయె గురుడని యాత్మను నమ్మిన
నిప్పుడె నీవు తరింతువయా
హరిని


హరిమీద గిరి యుండె



హరిమీద గిరియుండె గిరిమీద హరియుండె
హరిగిరు లిటు లుండ గిరి గిరగిర తిరిగె

సురలసురులు నా వాసుకి కవ్వపు త్రాడుగ
గిరిమంధరము క్షీరశరధిని కవ్వముగ
తరచువేళ గిరి మునిగెడి దైన బొబ్బలిడగ
నిరుపమానమైన మహిమ నిండారగ నిటుల
హరి

కడు కఠినమైన చిప్ప కల కూర్మం‌ బగుచు
నడగడిగో‌ కొండ క్రింద నవతరించినాడు
వడి తిరిగెడు గిరియొరుగక పట్టి నిలుపు చుండ
నిడిగిడిగో కొండమీద నిదే నిలచినాడు
హరి

నాడు శ్రీకూర్మ మగుచు నడిపి నాటకమును
వాడే శ్రీరాము డగుచు వసుధ నేలి నాడు
వాడే భవవార్నిధిని వేడుకతో జొచ్చి
వాడుక నందరను కాచు పైన క్రింద నుండి
హరి


8, అక్టోబర్ 2016, శనివారం

ఏది సుఖంబని యెంచెదవో



ఏది సుఖంబని యెంచెదవో మరి నీ
కేది హితంబని యెంచెదవో

నాలుగుదిక్కుల నీకు దొరకునవి నశ్వరమైన సుఖంబులు
వాలాయంబుగ రాముడిచ్చునవి వట్టిపోని ఘనసుఖంబులు
ఏది

నానాదేవత లిచ్చునట్టివి నాలుగుదినముల భోగములు
పూని రాముని గొలిచి తప్పక పొందగలవు స్థిరభోగములు
ఏది

పంచేంద్రియములు వంచనచేసి పంచెడు సుఖములు పాపములు
మంచివాడవై యుండిన రాముడు పంచును వలసిన సౌఖ్యములు
ఏది

భూమిని దొరకెడు సుఖముల కొరకై ముచ్చట పడితే ప్రమాదము
రాముని గొలిచి నిలుచు వారలకు రానేరాదే ప్రమాదము
ఏది

నరులసేవలో నిలచితివా యిక నానాబాధలె సుఖమేది
పరమాత్ముడు శ్రీరాముని పదములు పట్టుట కన్నను సుఖమేది
ఏది

ఇదిసుఖ మదిసుఖ మని తలచుచు నీ వెన్నా ళ్ళిటునటు తిరిగెదవు
మదిలో శ్రీరామచంద్రుని మానక తలపుము సుఖింతువు
ఏది


మత్స్యావతార కీర్తనం



విలయజలధి నీది నట్టి పెద్దచేప
బలిమి నోడ లాగినట్టి బండచేప

జీవుల కల్పాంతమందు చేదుకొన్న చేప
ఆ వేలుపుపెద్ద మొఱ్ఱ లాలించిన చేప
భావనాతీతమైన బంగారు చేప
ఆ విష్ణుమూర్తి తానైన భలే చేప
విలయ

ఎచ్చటిదని ఓడను రప్పించినదో చేప
మ్రుచ్చు సోమకు నెట్లు పొడిచినదో చేప
మచ్చలేని విక్రమపు మామంచి చేప
అచ్చముగా వెన్నుని యవతారము చేప
విలయ

విపదంబుధి నోడయగుచు వెలసినదీ చేప
అపవర్గము చేర్చునట్టి యందమైన చేప
కృపతో మానససరసిని కొలువైన చేప
చపలత్వము లేని రామచంద్రుడైన చేప
విలయ


7, అక్టోబర్ 2016, శుక్రవారం

ఆట లివన్నియు నీకోసం


ఆట లివన్నియు నీకోసం నా పాట లివన్నియు నీకోసం
ఆడించ జూచెడు ఘనుడవు నీవై నందుకు చాలా సంతోషం


చేసెడు చేతలు నీకోసం నే వ్రాసెడు వ్రాతలు నీకోసం
దోసములన్నియు సరిదిద్దెడు నీ తోరపుదయకు సంతోషం
బాసాడునది నీకోసం నా వేసాలన్నియు నీకోసం
చూసిమెచ్చి కడువేడుకతో దయచూపెద వందుకు సంతోషం
ఆట

ఇలపై మెలగుట నీకోసం బిట కలలు కనుటయును నీకోసం
కలలను నీవే పండించుచు నను కరుణింతు వదే సంతోషం
కలిగెడి తలపులు నీకోసం నా తలపులు తపములు నీకోసం
పిలచి నంతనే ప్రేముడి జూపుచు పలుకుదు వదియే సంతోషం
ఆట

శౌరీ కారుణ్యాలయ గరుడవిహారీ దనుజవిదారీ
శారదనీరదనీలశరీరా సారసాక్ష రణధీరా
భూరమణీతనయారమణా సర్వోపద్రవభయహరణా
శ్రీరామా రఘురామా యని నిను చింతించుటయే సంతోషం
ఆట


6, అక్టోబర్ 2016, గురువారం

గోవిందుడా నిన్ను కొనియాడనీ



గోవిందుడా నిన్ను కొనియాడనీ ।నేను
నీవాడనై యిట్లు నిలచిపోనీ

లేదు విచారము లేదు వినాశము
లేదు నీవారికి లేమియన
లేదొక కామము లేదొక మోహము
లేదు కలిభయమును నీదయ లుండగ
గోవిందుడా

కావున నీయందు కపటమే లేని
భావనలే కాని ప్రభవించని
జీవుడనై యుంటి సేవించు చుంటి
నీవే సర్వము నిశ్చయమనుచు
గోవిందుడా

ప్రేముడి మీఱగ వేమార్లు దినమును
రామ రామ యందు నేమరక
రామగోవింద సర్వ రక్షక కృపజూపి
నామొఱలాలించి నన్నేలరా
గోవిందుడా


చక్రమేది శంఖమేది



చక్రమేది శంఖమేది చాపమొకటె చేపట్టి
విక్రమించి రాక్షసుల పిండిపిండి చేసితివి

హరిని వధింతునని యన్నిట గ్రుమ్మరి
పరమాత్మా మిక్కిలి భంగపడి
సురలను మునులను పరిభవించి తుదకు
నరుడవై నీవురా విరిగె నా రావణుడు
శంఖమేది

పదితలలుండు గాక పంచాయుధము లేల
వదలిన పదునైన బాణములు
ముదిరిన వాని పీడ వదిలించగా నీవు
ముదితులై రెల్ల లోకములలోని జనులు
చక్రమేది

నరులను వానరులను నవ్వి చులకన చేసె
నరుడగ నీవురా నాడెఱిగె
నరునిగ వచ్చిన వాడు హరియన్న సత్యము
నరుడనే నేనని నమ్మిన రామయ్య
చక్రమేది


బలవంతు డగువాడు వచ్చి పైబడితే



బలవంతుడగువాడు వచ్చి పైబడితేను
బలహీనుడగువాడు పరుగోపరుగు

బల్లిదుండైన రామభద్రుని శరములు
కొల్లలై తమమీద కురియుచుంటేను
కల్లబలంబులవి రాకాసుల మూకలే
యెల్ల దిక్కులు పట్టి చెల్లాచెదరు
హరిని

ప్రకటంబుగ వార్ధకంబు పైబడితేను
చకచక జారు కరచరణసత్వంబులు
మొకమున కళలెల్ల నొకటొకటిగ దిగును
ఒకటని యేమి బ్రతుకు హొయలే చెడును
హరిని

బలవంతుడైన సమవర్తి వచ్చి పైబడి
యిలమీది జీవులబట్టి యీడ్చుక పోవును
బలహీను డతడు రామభక్తుల చెంగట
తలవంచి వారలకే తాను మ్రొక్కేను
హరిని




మనసులోన రామనామ మంత్రమున్నది


మనసులోన రామనామ మంత్రమున్నది నా
మనసు దానితోడ మైమరచి యున్నది


రామునిపై యంతులేని ప్రేమ భావమున్నది
రాముని గుణగణముపై రక్తి చాల యున్నది
రామునిపై పాడుదునని నీమ మొక్కటున్నది
రాముడు దయచేసినట్టి రక్షణ నా కున్నది
మనసు

ఈమనసున నైహికముల కేమి తావున్నది
ఈ‌మనసున దూరగ కలి కేమి సందున్నది
ఈ మనసున రేబవళ్ళ కేమి బేధమున్నది
ఈమనసును రాము డాక్రమించి కొలువుండగ
మనసు

ఈ మంత్రమిచ్చు ఫలము నితరమ్ము లిచ్చునా
భూమి నున్న నేడుకోట్ల పుణ్యమంత్రము లందు
ఈ మంత్రమే శ్రేష్టమైన మంత్రమై వెలసె
నేమి కావలయు నింక నిది నాకు ప్రాప్తించె
మనసు


పూవులతో మనరాముని పూజించుదమే


పూవులను కోయుదమా పూబోడి నేడు
పూవులతో మనరాముని పూజించుదమే


కువలయములు పూచె కోయుద మిపుడు
కువలయాక్షుని పూజ కొఱకైన నటులే
భువమోహనము సురపొన్న పూచినది
భువమోహనుని మనము పూజింప గొనవే
పూవులను

ఆ గన్నేరు పూవు లందగించి పూసె
చేగొనవే హరిపూజ చేయుట కొరకు
నాగకేసరములు బాగుగ విరిసె
నాగశయను పూజకై నళినాక్షి గొనవె
పూవులను

మల్లెలివే విరబూచె మనతోటలో
నల్లనయ్య కీయవలె మల్లెలమాల
తెల్లసన్నజాజు లివే కొల్లగపూచె
ఆల్లవే మాలలను హరిపూజకు
పూవులను


5, అక్టోబర్ 2016, బుధవారం

సీతారామా ఓ సీతారామా


సీతారామా ఓ సీతారామా మా
చేతలు మన్నించవయ్య సీతారామ


భూతదయ మరచి మేము సీతారామ - స్వ
ప్రీతికి తెగబడుదుమయ్య సీతారామ
కోతియైన సాయపడును సీతారామ - మా
జాతి కసలు జాలిలేదు సీతారామ
సీతారామ

చేతజపమాల బట్టి సీతారామ - మా
కాతాళము విడువమయ్య సీతారామ
కోత లెన్నొ భక్తులమని సీతారామ - దు
ర్నీతిపరత మానలేము సీతారామ
సీతారామ

పాతరవేసెనయ్య సీతారామ - ఈ
జాతి నీ‌సందేశము సీతారామ
రీతి మారకున్న నింక సీతారామ - మా
రాతలెట్లు మారునయ్య సీతారామ
సీతారామ


4, అక్టోబర్ 2016, మంగళవారం

నారాయణు డున్నాడు నాకుతోడుగా



నారాయణు డున్నాడు నాకుతోడుగా
శ్రీరాముడై వాడు చిత్తములో నిలచ్

వాడే యీ లోకముల ప్రభవింప జేసెను
వాడే బ్రహ్మాదుల ప్రభవింప జేసెను
వాడే లోకంబుల పంచె జీవరాసులను
వాడే కడుధైర్యమిచ్చువా డగుచు నిలచెను
నారా...

సనకసనందాదులకు సర్వస్వ మగువాడు
వనజభవశక్రాదుల వలన నుండువాడు
తనయురమున నుండు లచ్చి ధ్యానించువాడు
నను విడువక చేయిపట్టి నడిపెడివాడు
నారా..

రాముడై లోకముల రక్షించు వాడు
ధీమంతులు బుద్ధిలోన తెలియుచుండు వాడు
కామాది వికారముల గర్వమణచువాడు
నామొరాలకించు వాడు నన్ను బ్రోచు వాడు
నారా..


వీడే వీడే రాముడు


వీడే వీడే రాముడు వీడే ధర్మవిగ్రహుడు
వీడే లోకారాధ్యుడు వీడేను నారాయణుడు


వీడే వీడే కుమతుల నందర వీఱిడిపుచ్చే వీరుడు
వీడే వీడే సుమనస్కులకు విమలజ్ఞానదీపకుడు
వీడే వీడేలే సుమనసులకు వెలుగులు పంచెడివాడు
వీడే వీడే జీవరాశి హృత్పీఠములందలి దేవుడు
వీడే

వీడే వేడే జగదాదిజుడు విశ్వంబుల జేసెడి వాడు
వీడే వీడే విశ్వరక్షకుడు వీడేలే లయకారకుడు
వీడే వీడే వేదవేద్యుడు వేల కొలది పేరులవాడు
వీడే వీడే మునిగణంబులకు వేడుక ముక్తి నొసగువాడు
వీడే

వీడే వీడే మకరిబారిబడి వేడిన కరి నేలినవాడు
వీడే వీడే ద్రుపదతనయమొఱ విని వేగమె రక్షించినవాడు
వీడే వీడే ప్రహ్లాదునకై వీరనృసింహుండైనాడు
వీడే వీడే భక్తవరదుడు వీనికి సాటి మరి యెవడు
వీడే


3, అక్టోబర్ 2016, సోమవారం

నే నెవ్వడ నైతే నేమి



నే నెవ్వడ నైతే నేమి నీ భటుడను
నీ‌ నా భేదములు లేని నీ‌ భటుడను

మేలు కాంచినది మొదలు మిగుల శ్రద్ధగా నడుము
వాలుచు నందాక నీదు భటుల నొక్కడ
ఈ లోక మందున నా కింతకు మించి - వే
యేల ప్రియమైన పని యేమియు లేదు
నే నెవ్వడ

ప్రమాదాలస్యములు పట్టకుండగా నీ
విమలనామ మూతగా వెడలుచుందును
యముడు వచ్చి పదవీవిరమణ మన్నచో - నే
మమత విడువలేను గాన మరలవత్తును
నే నెవ్వడ

కామాదికములు నన్ను కలత బెట్టవు - శ్రీ
రామ నీ సేవ యందె రక్తుడ నగుట
స్వామి నీ‌ గుణగణములు చాటి చెప్పుటే - ఈ
రామభటుడు చేయుచుండు రాచకార్యము
నే నెవ్వడ


నరుడవు కావయ్య నారాయణా



నరుడవు కావయ్య నారాయణా - ధర్మ
పరులను కావగ నారాయణా

ముల్లోకముల నేడు మ్రుచ్చులు దైత్యులు
కల్లోలపరచు చుండ గమనించుచు
చల్లనివాడ వారి చదుమకున్నావో
నల్లనయ్యా మాకు మరి దిక్కులేదే
నరుడవు

అనివేడు సురలను మునివరులను బ్రోవ
ఘనముగ రామరూపగ్రహణము చేసి
యనిని దశాననాదు లసురుల ద్రుంచితివి
విను మా దనుజులు మనుజులైరి కలిని
నరుడవు

ధరమీద నధర్మము దారుణమై తోచె
కరుణతో దిగివచ్చి కాపాడ వలయును
నిరుపమానందరూప నీదయనే కోరి
పరిపరివిధముల ప్రార్థింతు మయ్య
నరుడవు


2, అక్టోబర్ 2016, ఆదివారం

అందరకు దొరకేనా అదృష్టము



అందరకు దొరకేనా అదృష్టము - ఆ
యందగానిపై పాడే అదృష్టము

వేదార్ధవిదుడనగ వెలయు గాక నిలను
వేదాంతశాస్త్రమందు విజ్ఞుడగును కాక
శ్రీదయితుని భక్తుడై చెలగునందాక
రాదే యీ యదృష్టము మేదిని మీద
అందరకు

పురాకృతము మంచిదై పొలుపుగ నీనాటికి
తరింపగా జేయ వెంట దవిలి వచ్చిన గాక
పరాత్పరుం డితని హరిని భావించి పొగడగా
నరుం డొకని సంస్కారమునకు పొడమేనా
అందరకు

సదా శ్రీరామచంద్రస్వామినే పొగడుట
అదెంతభాగ్యమోయన్న దాత్మలో నెఱుగక
మదాదిదోషపూర్ణమానవజన్మంబులు
పదేపదే పొందగనే పట్టదీ యదృష్టము
అందరకు


శ్రీరామచంద్రునే చేరుకొనుడు




శ్రీరామచంద్రునే చేరుకొనుడు సం
సారబంధమోక్షమే కోరుకొనుడు


ఉపయోగము కాని యహము నుజ్జగింపుడు - మీరు
విపరీతబుద్ధులన్ని విడచి యుండుడు
కపటబుధ్ధి జూపువారి కలియ కుండుడు - సర్వ
మపహరించు గురువులుందు రనియు తెలియుడు
శ్రీరామ

వారి నడిగి వీరి నడిగి భంగపడకుడు - వట్టి
యారగింపు దేవుళ్ళ నడిగి చెడకుడు
కూరచీరలకునరుల కొలిచి చెడకుడు - డంబా
చారముల పట్టి మీరు దారి చెడకుడు
శ్రీరామ

దేవునిపై భారముంచి దిగులు విడువుడు - లోక
పావనుడగు శ్రీరాముని భజన చేయుడు
మీ వేదనలు తీర్చి మీకు మోక్షము - రాము
డీ వేళో రేపో మీ కిచ్చు నమ్ముడు
శ్రీరామ


1, అక్టోబర్ 2016, శనివారం

అంతలోనె యీ నిరాశ



అంతలోనె యీ నిరాశ యింతింతన రానిది
ఇంతలోనె యుత్సాహం బిదిగో నీ విచ్చినది

భాగవతశిఖామణుల బాటను నే పోగలనా
సాగి నిన్ను మెప్పించెడు శక్తి నాకు కలదా
వేగిరపడి మీదెఱుగక వెంగళినై సాహసించి
చేగొన్న కార్యం బిది చేయ నెంతవాడ నని
అంతలోనె

అన్నిటికిని నీ వుంటి వని సాహసించెదనో
యెన్న నెంతవాడ నని యెంచి మిన్నకుందునో
యన్న మీమాంస వదల కున్నదయా నాకు
నన్నుజూచి యిది దురాశ యన్నావో పై నేమని
అంతలోనె

శ్రీరామ నీకునై చేసెడు నా విన్నపములు
కోరి లెక్కించుకొనెడు కుతూహలము కాదు
నీరేజదళనయన నీవు మెచ్చుకొందువో
ఔరా యీగోల యేమి యందువేమో యని
అంతలోనె


ఇటు వచ్చినాడు వీడెవ్వడో



ఇటు వచ్చినాడు వీడెవ్వడో - వీ
డిటు వచ్చుటకు కల హేతువెట్టిదో

కట్టుబట్టలేక వచ్చె కడుపేద యతిథి - వీ
డిట్టిట్టే నవ్వు లెన్ని యింట పంచె చూడరే
చుట్టాలందరికి పెద్దచుట్ట మాయె చూడరే
పట్టరాని సంతసాల భాగ్యాల రాశియై
ఇటు

చిన్ని చిన్ని నవ్వులాడు చున్నాడు వీడు
కన్నవారి కిచ్చినా డెన్నడో వరమునే
యెన్నగా నది వీరి పున్నెంబులకు జోడై
యున్నదిగా వీనిరాక యుత్సాహకారణమై
ఇటు

శ్రీరాము డన్నపేర చెలగుననిరి వశిష్టులు
పేరొందిన యినవంశము పెంపొందు ననిరి
శ్రీరమణుడు వీడని చెప్పరైరి జనులకు
వారు చెప్పకయ నదియు వసుధ వాసి కెక్కె
ఇటు