13, అక్టోబర్ 2016, గురువారం

తప్పు పట్టకుండ చెప్పవయ్య



పుట్ట నేమిటికయ్య కిట్ట నేమిటికయ్య తప్పు
పట్టకుండ చెప్పవయ్య భగవంతుడా

పుట్టువారలను కొంద రిట్టిట్టి వనరాని
చెట్టబుద్ధులతోడ చెలరేగ
గట్టిగ నీపాద కంజాతముల దోయి
పట్టి కొందరు భక్తివరు లౌదురే
ఏ పవలైనా

చుట్టపు చూపుగ చొచ్చుచు భూమిని
వట్టి యాశలవెంట పరువెత్తి
యుట్టి చేతులతోడ నుర్వి జనావళి
మట్టి కలయుటలోని మర్మ మదెట్టిది
ఏ పవలైనా

శ్రీరామ నీనామ చిన్మంత్రరాజంబు
కారుణ్య మొప్పంగ కావంగ
నోరారా జపియించ నేరక మానవు
లూరక శోకింతు రిది యేమయ్య
ఏ పవలైనా


2 కామెంట్‌లు:

  1. Sir, once the entire series of songs is over, I request you to publish a book with two sections. One with Annamayya's songs and the other with your Sri rama sankirtanams. These songs need to be preserved for posterity. Initially please bring out e book.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిమానానికి కృతజ్ఞుడనండి.
      శ్రీరామసంకీర్తనం కొనసాగుతూనే ఉంటుంది. అన్నమయ్య సంకీర్తనాల వ్యాఖ్యానం ఎంతగా కొనసాగించగలనా అన్నది తెలియదు. ఐతే మీరన్నట్లు సంకలనాలుగా వెలువరించటం‌ మంచి ఆలోచనయే. ఈ విషయంపై దృష్టిసారిస్తాను. శ్రీరామసంకీర్తనం రెండువందలు కాగానే ఒక e-book చేస్తాను. రెండువందలకు చేరుకొనటకు ఇంకా మూడువారాలు పట్టవచ్చును. అంటే నవంబరు మొదటి వారంలో సంపన్నంకాగానే e-book ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకూ ఏ e-book కాని చేసింది లేదు కాని ఎప్పుడో ఒకప్పుడు ప్రయత్నం మొదలు కావాలి కదా. మీ సూచనలకు ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.